దిగుబడుల్లో అంతరాలెందుకు | Sagubadi: Special article on Yield gaps importance of factors | Sakshi
Sakshi News home page

దిగుబడుల్లో అంతరాలెందుకు

Nov 5 2025 11:22 AM | Updated on Nov 5 2025 11:48 AM

Sagubadi: Special article on Yield gaps importance of factors

వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు తదితర పంటల దిగుబడి, ఉత్పత్తి వ్యయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. 1960 నుంచి 2023 మధ్యకాలంలో సాగు భూముల విస్తీర్ణం, భూసారం  తగ్గిపోవటం, ఎరువుల వాడకం, పంట దిగుబడుల్లో వివిధ దేశాల మధ్య ఎన్నెన్నో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేమిటి? వ్యవసాయం, ఆహార భద్రతల విషయంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? 

అధిక జనాభా భారంతో ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంలో ఇప్పటికీ దిగుబడులు పెంచుకోవటానికి గల అవకాశాలు, మార్గాలేమిటి? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఓ.) తాజాగా ప్రకటించిన గణాంకాలతో ప్రత్యేక కథనం.  

12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం  ప్రారంభమైంది. అప్పటి నుండి నాగరికతలను నిలబెట్టడంలో భూమి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం, ప్రపంచ ఆహార సరఫరాలో 95 శాతానికి పైగా భూమి ఆధారంగా జరిగే వ్యవసాయం ద్వారానే వస్తోంది. 2022లో వ్యవసాయ రంగం ప్రపంచవ్యాప్తంగా 89.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది (మొత్తం ఉపాధిలో 26.2 శాతం). ΄÷లాల బయట ఆహార రవాణా, నిల్వ, పంపిణీ (ఆహార వ్యవస్థల)కి సంబంధించిన పనులు, ఉద్యోగాలలో ప్రపంచ శ్రామిక శక్తిలో అదనంగా 13 శాతం మంది నిమగ్నమై ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భూమి విస్తీర్ణం, పశువుల సంఖ్య, ఆదాయాల పంపిణీని బట్టి చిన్న, సన్నకారు రైతులను గుర్తించే ప్రమాణాలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఒక దేశంలో 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 50 హెక్టార్లున్న వారు చిన్న రైతులు. ఒక దేశంలో వార్షికాదాయం 1,500 డాలర్ల ఆదాయం ఉండే వారు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 2,50,000 డాలర్లు వార్షిక ఆదాయం వున్న వారు కావచ్చు.

2 శాతం తగ్గిన వ్యవసాయ భూమి
ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఓ.) ఇటీవలే ప్రకటించిన 2023 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూభాగంలో వ్యవసాయ భూమి (అంటే.. స్వల్పకాలిక పంటలు పండించే వ్యవసాయ యోగ్యమైన భూమి, శాశ్వత / దీర్ఘకాలిక తోటలు సాగు చేసే భూమి కలిపి) విస్తీర్ణం 12 శాతం మాత్రమే. శాశ్వత పచ్చిక భూములు, పచ్చిక బయళ్ళు మొత్తం భూమిలో నాలుగింట ఒక వంతు ఆక్రమించగా, అడవులు మూడింట ఒక వంతు ఆక్రమించాయి. 2001 – 2023 మధ్య, ప్రపంచ వ్యవసాయ భూమి విస్తీర్ణం నికరంగా 7.5 కోట్ల హెక్టార్ల (2 శాతం) తగ్గింది.

1961 – 2020 మధ్య ప్రపంచ వ్యవసాయ భూమిలో కేవలం 8 శాతం విస్తరణతో వ్యవసాయ ఉత్పత్తిలో నాలుగు రెట్ల పెరిగింది. పంటల ఉత్పాదకతలో గణనీయమైన మెరుగుదలను ఇది సూచిస్తోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార లభ్యతకు ఢోకా లేదు. నేడు కొరత సమస్య కాదు. ఆహారాన్ని పొందగలిగే స్థోమత లేకపోటం, అశాంతి, యుద్ధాలతో ఆహార పంపిణీ సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలలో చారిత్రకంగా నమోదైన పురోగతితో ఆహార భద్రత, పేదరికం తగ్గింపు, ఆర్థిక అభివృద్ధికి  ప్రాథమికంగా కనిపించింది. అయినప్పటికీ కొన్ని ్ర΄ాంతాల్లో స్థానిక పరిస్థితులు గణనీయంగా భిన్నంగా మారుతూ ఉంటాయి.

తీవ్రంగా పెరిగిన ఉత్పాదకాల వాడకం 
ఒకే రకం పంట దిగుబడుల విషయంలో వివిధ దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో తారతమ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో ఉత్పాదకత ధోరణులను విశ్లేషించేటప్పుడు నికర వ్యవసాయ ్ర΄ాంతం, దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ అధిక దిగుబడులు ఉత్పాదకాల వాడకం తీరుపై ఆధారపడి ఉంటాయి. స్థానిక వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, విత్తనం, ఎరువులు, పురుగుమందులు, నీటి΄ారుదల సదు΄ాయాలు వంటి జీవభౌతిక ఉత్పాదకాలతోపాటు శ్రమ, పెట్టుబడులను బట్టి పంటల ఉత్పాదకతను, ఉత్పాదక సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. వ్యవసాయంలో భూమి పాత్రను అర్థం చేసుకోవడానికి వీటన్నిటినీ అర్థం చేసుకోవటం అవసరం. ఉత్పాదకాల వినియోగించే తీవ్రత స్థాయి, సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన నిర్వహణను బట్టి దిగుబడుల్లో తారతమ్యాలు వస్తాయి. అందువల్ల, ఎరువులు, యంత్రాలు లేదా మానవ శ్రమ మరింత ఎక్కువ స్థాయిలో వెచ్చించటం వల్లనే దిగుబడి పెరుగుదల నమోదైందని గుర్తించాల్సి ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి వృద్ధిలో సాగు భూమి విస్తీర్ణం పెరుగుదల చాలా తక్కువ పాత్ర  పోషించిందని, అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంట భూముల విస్తరణే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎఫ్‌ఎఓ చెబుతోంది.

దిగుబడుల్లో అంతరాలు
దిగుబడి పెరుగుదలలో విజయం సాధించినప్పటికీ.. సాధిస్తున్న దిగుబడిలో దేశాల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. దిగుబడి అంతరం అంటే? ఒక నిర్దిష్ట వాతావరణంలో ఒక పంటకు గరిష్టంగా సాధించగల దిగుబడికి, అక్కడి రైతులు ప్రస్తుతం సాధిస్తున్న వాస్తవ దిగుబడికి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం అంటారు. దిగుబడి పెరుగుదలలో గతంలో విజయాలు సాధించినప్పటికీ, అనేక దేశాలు, అనేక పంటలలో గణనీయమైన దిగుబడి అంతరాలు ఉన్నాయి.

ఉత్పాదకతలో ఆస్ట్రేలియా రారాజు
ఉదాహరణకు..  వరిలో (హెక్టారుకు టన్నుల్లో) 2023లో ఆస్ట్రేలియా 9.52 టన్నుల దిగుబడి సాధిస్తే, భారత్‌ 4.32, అమెరికా 8.57, చైనా 7.14, బ్రెజిల్‌ 6.94 టన్నుల దిగుబడి సాధించింది. ఈ అంతరాలు గత 63 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1961లో వరి దిగుబడిలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5.9 టన్నులతో నంబర్‌ వన్‌గా నిలిచింది. 9.52 టన్నులతో ఇప్పటికీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్‌ 1.54 టన్నుల నుంచి 4.32 టన్నులకు పెంచుకోగలిగింది. చైనా వరి దిగుబడులు మన కన్నా ఎక్కువ శాతం పెరిగాయి. 1961లో 2.04 టన్నులున్న చైనా వరి ధాన్యం దిగుబడి 2023 నాటికి 7.14 టన్నులకు పెరిగింది. అమెరికా 3.82 టన్నుల నుంచి 8.57 టన్నులకు పెంచుకోగలిగింది.  

వ్యవసాయ భూమి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించుకోవటంలో కొన్ని దేశాలు వెనుకబడటం కూడా ఈ స్థాయిలో దిగుబడి అంతరాలు ఏర్పడటానికి కారణమని ఎఫ్‌.ఏ.ఓ. చెబుతోంది. ముఖ్యంగా, ఈ అంతరాలకు జీవ భౌతిక కారణాలు మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక, సంస్థాగత పరిమితులు కూడా కారణమవుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, గిట్టుబాటుకాని పంటల ధరలు, రుణం లేదా బీమా సదు΄ాయాలు అంతగా అందకపోవటం, కౌలుదారుల్లో అభద్రత.. వేర్వేరు దేశాల్లో దిగుబడుల అంతరాలు కారణమవుతున్నాయని ఎఫ్‌.ఏ.ఓ. తెలిపింది.

భూసార క్షీణతతో 170 కోట్ల మందికి ముప్పు
మనుషుల పనుల కారణంగా భూసారం నష్టపోతోంది. ఈ కారణంగా పంట దిగుబడులు తగ్గుతున్నాయి. సుమారు 170 కోట్ల మంది నివసిస్తున్న భారత్‌ తదితర ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ ముప్పు ఏర్పడిందని ఎఫ్‌.ఎ.ఓ. నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న అధిక జనాభా గల దేశాలకు ఈ ముప్పు ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి, వ్యవసాయ ఉత్పాదకతకు ఈ నిశ్శబ్ద సంక్షోభం గొడ్డలి పెట్టుగా మారిందని ఎఫ్‌.ఏ.ఓ. హెచ్చరిస్తోంది.

ధాన్యపు పంటలు: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు తదితర ధాన్యపు పంటలకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో.  భారత్‌: 0.95(1961)–3.63(2023). ఆస్ట్రేలియా:1.08–3.23, చైనా:1.19–6.42. బ్రెజిల్‌: 1.35–5.34. అమెరికా: 2.52–8.33.

వరి: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో వరి పంటకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో. భారత్‌: 1.54(1961)–4.32(2023). ఆస్ట్రేలియా:5.9–9.52, చైనా:2.04–7.14. బ్రెజిల్‌: 1.7–6.94. అమెరికా: 3.82–8.57. 

ఈల్డ్‌ గ్యాప్‌ ఒక దేశంలో ఒక పంటకు గరిష్టంగా ఎంత దిగుబడి సాధించే అవకాశం ఉంది? రైతులు ప్రస్తుతం ఎంత తీస్తున్నారు? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం(ఈల్డ్‌ గ్యాప్‌) అంటారు. హెక్టారులో వరి దిగుబడిని భారత్‌ 0.4, చైనా 0.61, రష్యా 3.61, అల్జీరియా 7.57 టన్నుల వరకు పెంచుకునే అవకాశం ఉంది. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పటికే పూర్తిస్థాయి ఉత్పాదకత సాధించాయి. అందుకే ఈ దేశాల ఈల్డ్‌ గ్యాప్‌ సున్నాగా ఉంది. 

 

2023లో పత్తి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. 
భారత్‌: 1.27, ప్రపంచం:2.3, చైనా:6.64, మెక్సికో:4.52,
బ్రెజిల్‌:4.39, ఆస్ట్రేలియా:3.79, పెరు:2.86, అమెరికా:2.84.

2023లో మొక్కజొన్న దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. 
భారత్‌: 3.54, ప్రపంచం:5.96, అమెరికా:11.25, 
ఇండోనేషియా:8.07, ఈజిప్టు:7.51, రష్యా:6.92, చైనా:6.53.

2023లో పప్పుధాన్యాల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. 
భారత్‌: 0.74, ప్రపంచం:0.98, ఈజిప్టు:4.24, ఆస్ట్రేలియా:2.07, 
అమెరికా:1.97, రష్యా:1.95, చైనా:1.86.

 2023లో కూరగాయల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..
భారత్‌: 15.81, ప్రపంచం:20.07, అమెరికా:36.64, ఇరాన్‌:29.59, రష్యా:29.36, జపాన్‌:27.6, చైనా:26.14, బ్రెజిల్‌:25.79.

2023లో పండ్ల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..
భారత్‌:15.11, ఇండోనేషియా:27.06, దక్షిణాఫ్రికా:24.55, 
ఈజిప్టు: 20.94, అమెరికా:20.91, కజకిస్తాన్‌:19.54, బ్రెజిల్‌: 18.39.

2023లో వరి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. 
భారత్‌: 4.32, ఆస్ట్రేలియా: 9.52, ఈజిప్టు: 8.72, 
అమెరికా: 8.57, పెరు:8.07, చైనా: 7.14, బ్రెజిల్‌: 6.94. 

2023లో గోధుమ దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..
భారత్‌: 3.52, ఈజిప్టు: 7.19, మెక్సికో: 6.2, 
చైనా: 5.78, జపాన్‌: 4.72.  


నిర్వహణ: 
పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement