‘క్రిస్టోస్’, ‘మాస్సే’ అనే రెండు పదాల నుంచి క్రిస్మస్ అను మాట వచ్చింది. దాని అర్థం క్రీస్తును ఆరాధించుట. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్‌ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. క్రిస్మస్ పరమార్థాన్ని గుర్తించి దేవుని ఆరాధించుటలో తప్పులేదు గాని దానిని ఆచార ‡సంబంధమైన ఓ పండుగగా భావించి ఏవో కొన్ని కార్యక్రమాలు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే! ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినం క్రిస్మస్.
క్రిస్మస్ సమయంలో ప్రతి చర్చిలోను, ప్రతి కార్యక్రమాలలోను క్రైస్తవులు ఈ బైబిల్ వాక్యాలను తప్పక చదువుతారు. ‘‘ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంటుండగా, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే, ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు.
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొకతొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు’ అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను’’– (లూకా 2:814).
ఇంగ్లండు దేశంలో జన్మించిన చార్లెస్ వెస్లీ తన జీవితకాలంలో సుమారుగా 6500 పాటలు రచించాడు. తన అన్న జాన్‌వెస్లీ తన ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే, చార్లెస్ వెస్లీ తన పాటల ద్వారా అనేకులను దేవునివైపు నడిపించాడు. ఆక్స్‌ఫర్డ్‌లో విద్యనభ్యసించిన చార్లెస్ దేవుని పట్ల అపారమైన భయభక్తులు కలిగియున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు వచ్చిన సందర్భాన్ని తాను వ్రాసిన పాటలలో అద్భుతంగా వివరించాడు. వాటిల్లో ఒక పాట ఇలా ఉంటుంది.
‘‘దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి... ఆ ప్రభుండు పుట్టెను బేత్లెహేమునందున. భూజనంబు కెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకసంబునందున మ్రోగుపాట చాటుడి.’’ దాదాపుగా అన్ని సంఘాల్లో ఈ పాట పాడి క్రిస్మస్ ఆత్మీయ అర్థాన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ‘నిన్ను నమ్మువారికి ఆత్మశుద్ధి కలుగును’ అనే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని దగ్గరకు ఒక వ్యక్తి రావడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? సకలలోక సృష్టికర్తయైన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన శరణు కోరిన వారిని పవిత్రపరుస్తాడు. పాపము విడిపించి ఆత్మశుద్ధిని దయచేస్తాడు.
సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకున్నాయి కూడా. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న ‘అపోలో–11’ అనే రాకెట్ మీద అక్షరాలా 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు.
ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి, మహనీయుడైన దేవుని మనసారా స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్‌లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘‘నిన్ను కాపాడువాడు’’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టియే ఇంత అద్భుతంగా ఉంటే, దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా!
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళి వచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి, కొన్ని పరిశోధనలు చేసి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు కూడా తీసుకువచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి, ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి.
ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణలలో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచారు. ప్రతి సభలోనూ ఆయన ప్రకటించిన సత్యం... ‘‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు అదీ గొప్ప విషయం.’’ నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భువిపై జన్మించారన్నది లేఖన సత్యం.
క్రీస్తు ప్రభువు జన్మ స్థలమైన బేత్లెహేము ప్రపంచంలోని కోట్లాదిమంది దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఈ బేత్లెహేము ఒకప్పుడు స్వల్ప గ్రామమైనను నేడు అది ప్రత్యేక ప్రదేశంగా విరాజిల్లుతోంది. బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుంచి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను (మీకా 5:2). దేవుడు తన ప్రజల జీవితాల్లో తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బేత్లెహేము నుంచి వస్తాడు అని చెప్పబడిన ప్రవచనం చాలా గొప్పది. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రవచనం. రక్షకుడు పుట్టే స్థలము మాత్రమే గాక ఆయన గుణలక్షణమును, విశిష్ట అధికారాన్ని మీకా తెలియచేశాడు. దేవుడు నిత్యుడు. అందుకే ఆయన శరణు కోరిన ప్రతి ఒక్కరికి నిత్య సంపదలు అనుగ్రహిస్తాడు. నిత్యజీవం ఆయన ఇచ్చే బహుమానములలో ప్రధానమైనది.
సృష్టికర్త పుడమిపై పవళించిన ఆ స్థలము పరమ పావనమై పునీతమైంది. బేత్లెహేము చరిత్రను మనం క్లుప్తంగా గమనించగలిగితే ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు విశదమౌతాయి. పరిశుద్ధ గ్రంథంలో బేత్లెహేమునకు విశిష్టమైన స్థానం ఉంది. బేత్లెహేము అనేమాటకు రొట్టెల గృహము (హౌస్ ఆఫ్ బ్రెడ్) అని అర్థం. ఇది జెరూషలేముకు దక్షిణంగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
యాకోబు కాలంలో ఈ ప్రాంతాన్ని ‘ఎఫ్రాతా’ అని పిలిచేవారు. ఇక్కడే యాకోబు తన భార్యయైన రాహేలును పాతిపెట్టాడు. ‘‘రాహేలు మృతిబొంది బేత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడెను.’’ పరిశుద్ధ లేఖనాల్లో ప్రాముఖ్యమైన ఘట్టం రూతు చరిత్ర. రూతు కూడా తన అత్తయైన నయోమితో కలిసి మోయాబు నుంచి బేత్లెహేముకు వచ్చెను. దేవుడు రూతును బహుగా హెచ్చించెను. రూతు బోయజును వివాహమాడి ఓబెదును కనెను. ఓబెదు యెష్షయిని, యెష్షయి దావీదును కనెను. (రూతు 4:21). మోయాబు దేశం నుండి వచ్చిన రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడడం నిజంగా ఆశ్చర్యమే కదా!
దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. దేవుని చిత్తానికి ఒక వ్యక్తి తన జీవితాన్ని సమర్పిస్తే తన దివ్య ప్రణాళికలు అద్భుతమైన రీతిలో నెరవేర్చబడతాయి అనడానికి రూతు జీవితమే ఓ గొప్ప ఉదాహరణ. బేత్లెహేములోని పొలాలను బోయజు పొలాలు అని కూడా పిలుస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన దావీదు బేత్లెహేములోనే జన్మించి బేత్లెహేమీయుడుగా పిలువబడెను. దానినే దావీదుపురము అని కూడా కొన్ని సందర్భాలలో పిలిచారు. కారణం అది దావీదు జన్మస్థలము కాబట్టి.
మరియకు ప్రధానం చేయబడిన యోసేపు కూడా బేత్లెహేములో జన్మించాడు. అది అతని జన్మస్థలము కాబట్టి ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకొనుటకు నజరేతు నుంచి ప్రయాణం చేసి బేత్లెహేము వరకు వచ్చెను. ఏ బేత్లెహేముకైతే అత్యంత పురాతన చరిత్ర ఉన్నదో అదే బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించెను. బెత్లెహేము అనే మాటకు రొట్టెల గృహము అని అర్థం అయితే, యేసుక్రీస్తు ‘‘జీవపు రొట్టె’’గా జీవాహారముగా ఆ ప్రాంతములో జన్మించి ఆ పేరును స్థిరపరచెను.
ఈ బేత్లెహేము పొలములోనే గొర్రెల కాపరులు క్రీస్తు ఆగమన సందేశాన్ని పొందారు. రాత్రివేళ భయముతో తన మందను కాచుకొనుచున్న ఆ గొర్రెల కాపరుల చుట్టూ దేవుని మహిమ ప్రకాశించడం మాత్రమే గాక వారి జీవితాలను కూడా క్రీస్తు ప్రేమ అనే వెలుగుతో నింపివేసెను. హల్లేలూయ! యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించాడని బైబిల్‌లో ఆయాచోట్ల తెలియచేయబడింది.
రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసుపుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి ‘‘యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి’’ అని చెప్పిరి. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతిగా ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుంచి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుంచి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? అనిరి (యోహాను 7:42).
చర్చ్ ఆఫ్ నేటివిటీ
ప్రపంచంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రాంతాలు, కట్టడాలు వున్నాయి. నిత్యం వేలాది యాత్రికులు ఆ ప్రాంతాలు సందర్శిస్తూ ఉంటారు. న్యూయార్క్‌లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, పారిస్‌లో ఉన్న ఈఫిల్ టవర్, చైనాలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇండియాలో ఉన్న తాజ్‌మహల్– ఇంకా ఎన్నో వింతలుగా పేర్కొనబడుచున్నవి. కాని, వీటికంటే ఉన్నతమైన రీతిలో ఒక ప్రాంతం ప్రపంచంలో కోట్లాదిమందిని ఆకర్షిస్తూ ఉంది. అదే బేత్లెహేములో ఉన్న చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఎంతో విశాలమైన ప్రాంతంలో నిర్మించబడిన ఈ చర్చ్ ప్రాముఖ్యత మనకందరికి విదితమే! ఇదే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన స్థలం. పుడమిపై శాంతిదూత వెలసిన పుణ్యస్థలం.
ఏటా కోట్లాదిమంది అనేక దేశాల నుంచి ఇక్కడకు వచ్చి దైవభక్తితో క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీ బేత్లెహేములో ఉంది. ఇది ప్రపంచ నగరాలలో పోలిస్తే చాలా చిన్నది కాని, జగద్రక్షుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు.
జస్టీస్ మార్టెర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా; 3వ శతాబ్ద చరిత్రకారులైన ఆరిజన్, యుసేబియస్‌లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్‌స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. గొప్ప చరిత్రకారుడు, బైబిల్‌ను లాటిన్ భాషలోనికి అనువదించిన సెయింట్ జెరోవ్‌ు కూడా క్రీ.శ.384 సంవత్సరంలో ఇక్కడే పాతిపెట్టబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. కానీ క్రీ.శ 614వ సం.లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు.
ఆశ్చర్యమేమిటంటే వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే ఆ చర్చ్‌లో వారు చూసిన కొన్ని దృశ్యాలు, యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే!
6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చ్‌ని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చ్‌లో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు ప్రభువువారు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది.
ఈ చర్చిలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే తల వంచి వెళ్ళాలి. ఆ చర్చి ముఖద్వారం చాలా చిన్నగా ఉండడమే దానికి కారణం. ప్రపంచంలోని ఎంత గొప్పవ్యక్తి అయినా, తల వంచి లోపలికి వెళ్ళాల్సిందే! మొన్నీ మధ్య అమెరికా ప్రెసిడెంటు కూడా తలవంచి లోపలికి వెళ్ళారు. అయితే చిన్న పిల్లలకు ఆ సమస్య లేదు. వారు చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు. ‘‘చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి. ఈలాటి వారిదే పరలోక రాజ్యము’’ అని ప్రభువు చెప్పిన మాట ఆ సందర్భంలో జ్ఞాపకం వస్తుంది.
బేత్లెహేము నక్షత్రమని పిలువబడిన ఈ నక్షత్రాన్ని అసిస్సి వాసియగు ఫ్రాన్సిస్ సంబంధీకులు క్రీ.శ. 1717లో వుంచారు.
అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అని అక్షరాలు చెక్కబడియున్నవి. క్రొత్తనిబంధన కాలంలో ఉన్న మనకు ప్రభువే ముఖ్యుడు. ప్రాంతం మనకు ముఖ్యం కాదు. క్రీస్తు రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేమునందు జన్మించడం వలన ఆ చిన్న గ్రామానికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినట్లుగా నేడు మనం ఆయనను మన హృదయాలలోనికి ఆహ్వానిస్తే కీర్తి, ఘనత, ఆశీర్వాదం మన సొంతమవుతాయి.
మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను వ్రాయబడిన క్రీస్తు వంశావళిలో కొంతమంది స్త్రీలను చూస్తాం. వాస్తవానికి సమాజంలో కొంతమంది స్త్రీలను చిన్న చూపు చూస్తుంటారు. స్త్రీ బలహీనమైనదని, ఆమెపట్ల పక్షపాతం చూపిస్తారు. యూదుల వైఖరికూడా స్త్రీల పట్ల చులకనగానే వుంటుంది. కానీ దేవుని దృష్టిలో స్త్రీ, పురుషులని భేదం లేదు. అందరికీ సమానంగా తన కృపను చూపించుచున్నాడు అనే విషయం తన వంశావళిలో స్త్రీల పేర్లను ప్రస్తావించుటను బట్టి తేటతెల్లమయ్యింది. ఏ యూదుని వంశావళిలోనూ స్త్రీ పేరు కనబడదు.
స్త్రీలకు బైబిల్ గ్రంథంలో ఎంతో శ్రేష్టమైన స్థానం కల్పించబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించిన తరువాత పురుషులు, దేవదూతలతో పాటు స్త్రీలు కూడా ఆనందించారు. బైబిల్ గ్రంథంలో పురుషులు చేసిన సేవను గుర్తించిన విధంగా స్త్రీలు చేసిన పరిచర్యను కూడా ప్రభువు గుర్తించారు. పాతనిబంధనలో స్త్రీలు ప్రవక్తలుగా సేవలందించారు. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా స్త్రీల సహాయం చాలా గొప్పది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతిని శిష్యులకు తెలియజేసినది కూడా స్త్రీలే. అంత గొప్ప ప్రాధాన్యతను ప్రభువు వారికి అనుగ్రహించి, స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ వారు కాదని, వారిపట్ల కూడా దేవుడు అపారదృష్టి కలవాడని నిరూపించాడు.
యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో కూడా స్త్రీలను ప్రస్తావించుట ద్వారా దేవాదిదేవుడు వారికెంత విలువ, గౌరవం ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో క్రొత్తనిబంధనలో ఇద్దరు సువార్తికులు యేసుక్రీస్తు వంశావళిని వ్రాశారు. సువార్తికుడైన లూకా యోసేపు వంశావళి క్రమాన్ని అనుసరించి దావీదు కుమారుడైన నాతాను క్రమం నుంచి వ్రాసుకొస్తే, మత్తయి సువార్తికుడు మాత్రం మరియ వంశ క్రమాన్ని దావీదు కుమారుడైన సొలొమోను క్రమం నుంచి వ్రాసుకుంటూ వచ్చాడు.
వీరిద్దరిలో మత్తయి పేర్కొన్న వంశావళిలో ఐదుగురు స్త్రీలను గూర్చి ప్రస్తావించాడు. పరిశుద్ధాత్ముడు అనుమతించాడు గనుకనే వీరిపేర్లు దైవగ్రంథంలో చిరస్మరణీయంగా లిఖించబడినాయి. దేవునిలో లింగభేదం, వయోభేదం, కుల మత భేదాలు లేవని; అందరినీ సమానంగా ప్రేమించుచున్నాడని దానినిబట్టి అవగతమవుతుంది. మత్తయి సువార్తికుడు ప్రస్తావించిన ఐదుగురు స్త్రీలను గూర్చి ధ్యానిద్దాం!
మొదటిగా తామారు. ఆమెను గూర్చిన వివరణ ఆదికాండం 38వ అధ్యాయంలో చూడగలం. యూదా కనానీయుని కుమార్తెను పెండ్లి చేసుకొనెను. ఆమె యూదాకు ఏరు, ఓనాను, షేలా, అను ముగ్గురు కుమారులను కనెను. యూదా తన పెద్దకుమారుడైన ఏరుకు తామారును ఇచ్చి వివాహం చేసెను. అయితే ఆమెయందు సంతానమేమీ కలగకుండానే ఏరు చెడునడతను బట్టి చనిపోయాడు. తదుపరి రెండవ కుమారుడైన ఓనానుకు తామారు ఇవ్వబడింది. ఓనాను కూడా తన స్వార్థపు బుద్ధితో సంతానం లేనివాడాయెను. అప్పటికి యూదా మూడవ కుమారుడు షేలా చిన్నవాడై యుండుట వలన తామారును తన తండ్రి ఇంటికి పంపివేసెను. రోజులు గడుచుచుండగా తామారు మారువేషంలో యూదాను కలుసుకొనగా వారిరువురకు పెరెసు, జెరహు అను కుమారులు కలిగి యూదా వంశం కొనసాగించబడింది.
ఇక్కడ తామారును దేవుడు యేసుక్రీస్తు వంశావళిలోనికి అనుమతించడానికి గల కారణం ఆమె యూదాకు సంతతి కలుగజేసి, అతని వంశమును నిలువబెట్టాలనుకోవడమే! ఎందుకంటే మెస్సీయా ఈ గోత్రం నుంచే వస్తాడు గనుక సాతాను ప్రాముఖ్యంగా ఈ గోత్ర నిర్మూలనకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి యూదా గోత్రాన్ని ఎంచుకున్నాడు. సంఖ్య 24:17లో వ్రాయబడినట్లు ‘‘నక్షత్రము యాకోబులో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును’’అను వాక్యం నెరవేరునట్లుగా యూదా సంతతి కొరకు దేవుడు తామారును ఎంపిక చేసుకున్నాడు. దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు, యూదా వంశమును కొనసాగించుటకు తామారు తీసుకొన్న నిర్ణయం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే హర్షించదగినదే! యూదా వంశమును కొనసాగించుటకు ఆమె తనకు తాను తగ్గించుకొని అనేకుల చేత నిందలనిపించుకొనుటకైనా సిద్ధపడింది. ఆమె సమాజం దృష్టికి నీచమైనదిగా కనబడినప్పటికీ ప్రభువు ఆమెను, ఆమె తగ్గింపును గుర్తించి తన వంశావళిలో స్థానం కల్పించాడు.
రెండవ స్త్రీ రాహాబు. యెరికో ప్రాకారం మీద నివసించిన ఒక వేశ్య. ఈమె ఆ ప్రాంతంలో నివసిస్తూ అనేకులను పాపం వైపు ఆకర్షిస్తుంది. యెరికో అనే మాటకు ‘‘సువాసన’’ అని అర్థం. అయితే ఆ యెరికో ప్రాకారాల మీద నివసించు స్త్రీలు కొంతమంది ఆ సువాసన కల్గించే వాటిని ఉపయోగించి బాటసారులను పాపమునకు ఆకర్షించేవారు. పేరు మంచిదే గాని, దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిదిగా లేదు. మంచి పేరు ఉండడం తప్పు కాదు కాని, ఆ పేరుకు తగ్గ జీవితం వున్నదా లేదా అనేది ముఖ్యం. రాహాబు భయంకర పాపములో జీవిస్తుండేది. ఇశ్రాయేలీయులు యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును ముట్టడి వేయడానికి ముందు ఆ పట్టణమును వేగుచూచుటకు రాగా రాహాబు వారిని తన ఇంట చేర్చుకొని ఆ ప్రాంతపు రాజు చేతినుండి తప్పించెను.
అందువలన ఇశ్రాయేలీయుల చేతిలో యెరికో పట్టుబడెను గాని రాహాబు, తన కుటుంబము మాత్రమే తప్పించబడెను. రాహాబు ఇశ్రాయేలీయులలోని శల్మాను అను వ్యక్తిని పెండ్లి చేసుకొని క్రీస్తు వంశావళిలో చోటు సంపాదించెను. లోకరీతిగా వేశ్యలకు అంత విలువ, గౌరవం ఉండదు. కాని, ప్రభువు మాత్రం ఎంతో గొప్ప స్థానం కలుగజేశాడు. ఎందుకనగా రాహాబు జీవితంలో కొన్ని మార్పులు జరిగాయి. ఆమె దేవుని ప్రణాళికలో భాగస్థురాలయింది. రాహాబు తన గతాన్ని సమాధి చేసి ఓ మంచి దైవికమైన భవిష్యత్తు కొరకు తనను తాను సిద్ధపరచుకున్నది. ఒక వ్యక్తి గతమెంత భయంకరమైనదైననూ ఆ వ్యక్తి ప్రభువును అంగీకరించుట ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవచ్చు అని రాహాబు ఋజువు చేసింది.
మూడవది రూతు. ఆమె మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. ఇశ్రాయేలు దేశంలో కరవు వచ్చినప్పుడు నయోమి తన భర్తను, కుమారులను తీసుకొని మోయాబుకు వెళ్ళింది. అక్కడ తన కుమారులకు వివాహాలు చేసింది. పది సంవత్సరాలలో భర్త, కొడుకులు చనిపోయారు. తిరిగి బేత్లెహేముకు రావాలని నిర్ణయించుకుంది. ఒక కోడలు అత్తను విడిచి వెళ్లిపోయింది. అయితే, రూతు తన అత్తను హత్తుకొని ఆమె కోసం నిలబడింది. ఇక మంచి అత్తాకోడళ్ళ బంధాన్ని వీరిలో స్పష్టంగా చూడవచ్చు.
రూతు తన అత్తతో పాటు యూదా దేశానికి వస్తున్నప్పుడు ‘‘నీ దేవుడే నా దేవుడు’’ అని పలికింది. ఆయన రెక్కల నీడలో ఆశ్రయం ఉందని, బహుమానం ఇచ్చువాడని గ్రహించి ఆ దేవుని విడువక హత్తుకుంది. మోయాబు దేశాన్ని విడచి దేవుని ప్రజలతో ఉండాలని బెత్లేహేమునకు వచ్చింది. బేత్లెహేములో సంపన్నుడైన బోయజు ఉన్నాడు. అతని పొలంలోకి పరిగె ఏరుకొనుటకు ఒక పరదేశిగా ప్రవేశించింది. పూర్వదినాలలో భూస్వాములు తమ పంటలో కొంత భాగాన్ని పరదేశుల కోసం విడిచిపెట్టేవారు.
ఏ పొలంలోనికైతే యవలు ఏరుకొనుటకు వెళ్ళిందో తన సత్ప్రవర్తననుబట్టి ఆ పొలానికి యజమానురాలు అయ్యింది. బోయజు ఆమెను పెండ్లిచేసుకొని, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మోడుబారిన జీవితాలను సర్వశక్తుడైన దేవుడు చిగురింపచేయగలడు అనే సందేశాన్ని రూతు ప్రపంచానికి ఇచ్చింది. నాల్గవదిగా బత్షెబ. ఈమె గూర్చి సువార్తికుడైన మత్తయి ‘‘ఊరియా భార్య’’ అని ప్రస్తావించాడు తప్ప ఆమె పేరును మాత్రం తెలుపలేదు. ఈమెను గూర్చి 2 సమూయేలు 11వ అధ్యాయంలో చదువగలము.
ఈమె ఏలీయాము అనువాని కుమార్తె, ఊరియా అను హిత్తీయుని భార్య. ఊరియా దావీదు సైన్యంలోని నమ్మకమైన సైనికుడు. దావీదు ఊరియా భార్యయైన బత్షెబతో పాపం చేసి, దానిని దాచుకొనుటకు తనభర్తయైన ఊరియాను యుద్ధంలో చంపించెను. తరువాత దావీదు బత్షెబను వివాహమాడి ఆమెయందు నాతాను, సొలొమోను అను ఇద్దరు కుమారులను కనెను. దావీదు బత్షెబతో పాపం చేయడం ద్వారా పుట్టిన మొదటి కుమారుడు చనిపోయెను. ప్రవక్తయైన నాతాను ద్వారా దావీదు గద్దింపబడినప్పుడు అతడు పశ్చాత్తాపం చెంది దేవునివైపు తిరిగెను. దేవుని మహాకనికరం అతని మీద కుమ్మరించబడెను. దేవుడు దావీదుకు వాగ్దానం చేసినట్లుగా తన సింహాసనం తనకు నిత్యం స్థిరపరచుదునన్న మాటను నెరవేర్చుటకు దేవుడు బత్షెబను దీవించాడు.
చివరగా మరియ. గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది’. వివాహం కాకుండా గర్భం ధరించుట వలన ఎన్ని నిందలు అవమానాలు వస్తాయో ఊహించలేనంత పరిస్థితిలో మరియ లేదు. ప్రపంచం ఎదురు తిరిగినా తాను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంది.
దూత ప్రకటన వినిన తదుపరి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని రక్షకుని ఆగమనానికి సహకరించింది. తాను పొందబోయే శ్రమల కంటే దేవుని కృప గొప్పదని గుర్తించింది. ‘‘నీవు కృప పొందితివి’’ (లూకా 1:30). ఆ ఒక్క మాట చాలు! దేవుని కృప ద్వారా ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోవచ్చు. నిండు చూలాలిగా ఉన్నప్పుడు నజరేతు నుంచి బేత్లేహేముకు ప్రయాణం, తమకు తెలియని ఈజిప్టు దేశంలో చిన్నబాలుడైన యేసుతో పాటు రెండు సంవత్సరాలు నివసించడం, అన్ని విషయాల్లో బాలుడైన యేసును అతి జాగ్రత్తగా చూసుకొనే విషయాల్లో మరియ దేవుని కృపమీద ఆధారపడింది.
∙∙
ఇకపోతే, యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే ప్రశ్నను చాలామంది లేవదీస్తున్నారు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘‘యేసు గ్రీకో–రోమన్ తత్త్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల మానసిక ఆవిష్కరణయే గాని, వాస్తవం కాదు. క్రొత్తనిబంధన ఒక పురాణమే గాని, వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు’’. దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాతి గాంచిన చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు. ‘‘ప్రపంచంలోని చాలా విషయాలకు ఏవిధమైన చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా, కేవలం మనుష్యుల ఆలోచనలపై ఆధారపడియున్నవి.
కాని క్రైస్తవ్యం అటువంటిది కాదు’’. మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బ్రూస్ అనే వ్యక్తి పరిశీలనాత్మకంగా ప్రకటించిన సత్యమిది. వాస్తవాలను క్రోడీకరించే ప్రతి చరిత్రకారునికి జూలియస్ సీజర్ చారిత్రకత ఎంత స్పష్టమో, యేసుక్రీస్తు చరిత్ర అంతకన్నా ఎక్కువ స్పష్టం.
యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడు, ఆయన మొదటి శతాబ్దకాలంలో ఈ భూమిపై సంచరించాడని, ఆయన రక్షకుడు మరియు దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రాజకీయవేత్త. రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటు కాలంలో గలిలయలోని తిరుగుబాటు దళమును నడిపిన వ్యక్తి.
వెస్పాసియన్ అనే రాజుచేత చెరపట్టబడి మిగిలిన తిరుగుబాటు కాలమంతా రోమీయులకు మధ్యవర్తిగానూ, తర్జుమాదారునిగానూ పనిచేశాడు. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు వ్రాశాడు. అవి: ‘‘ద జ్యూయిష్ వార్స్ ’’, ‘‘జ్యూయిష్ యాంటిక్విటీస్’’ ఫ్లావియస్ అనుపేరు రోమా పేరు కాగా జోసఫస్ అను పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు ‘‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.
తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’’ ఫ్లావియస్ జోసఫస్ అత్యంత అద్భుతమైన చరిత్రకారుడు. ఆయన వ్రాసిన చరిత్ర సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు యొక్క జన్మను, మరణాన్ని, పునురుత్థానాన్ని కూడా ఒప్పుకున్నాడు.
నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గూర్చి సవివరంగా వ్రాయబడ్డాయి. ఆ సువార్తికులు ఎవరనగా– మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరిచే సువార్తలన్నీ క్రీ.శ. 70వ సంవత్సరంలోపే వ్రాయబడ్డాయి. అనగా యేసు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాలలోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. క్రీస్తు ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అతి తక్కువ సమయంలోనే వ్రాయబడింది గనుక వాస్తవికతకు నిలువెత్తు నిదర్శనంగా బైబిల్ నిలిచింది.
క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరి దేని గురించి అతడు ఆలోచించడు.
కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి; వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుంచి అపరాధముల నుంచి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుచున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘‘ఏ భేదము లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు’’ అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి.
పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి తన సిలువ మరణం ద్వారా విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. మూడవ రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా మరణం తరువాత కూడా ఓ ఉన్నతమైన జీవితం ఉందనే సత్యాన్ని తెలిపి మనిషికి నిరీక్షణ ప్రసాదించాడు.
గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను’’ అనే మాట బైబిల్‌లో ఉంది. ఒక మంచి వ్యక్తిని ప్రేమించడానికి ఎవరైనా ముందుకు వస్తారేమో గాని, పాడైపోయిన మనిషిని దేవుడు ప్రేమించాడు. నిస్వార్థమైన దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు లోకప్రేమల వెంటబడి తన జీవితాన్ని వృథాపరచుకోడు. క్రీస్తు ప్రభువు బోధలో చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రేమ. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాట ద్వారా నేడు అనేకులు ప్రేమ ఔన్నత్యాన్ని తెలుసుకొని సమసమాజ నిర్మాణంలో తన బాధ్యతను నెరవేస్తున్నారు.
క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కాని, క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.
చెట్టి భానుమూర్తి వ్రాసిన శ్రేష్టమైన ఈ పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడు మరచిపోదు. ‘రారె చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సియ రాజితంబగు తేజమదిగో. కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం. తెల్లగానది తేజరిల్లెడి తారగాంచరె త్వరగ రారే. బాలుడిడిగో వేల సూర్యుల బోలు సద్గుణశీలుడు. బాలబాలిక బాలవృద్ధుల నేలగల్గిన నా«థుడు’. సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
⇒ గలిలయలోని నజరేతులో నివసించే మరియ దేవుని కృప పొందింది. ఆమె దేవునియందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. నేటి స్త్రీలు మరియ వలె ఉండగలిగితే ఎంత మేలు! మరియ ‘తాను పొందబోయే శ్రమలకంటే దేవుని ప్రణాళిక గొప్పది అని గ్రహించింది.
⇒ దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు.
⇒ ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత క్రొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి ఆ వయోలిన్ తనకిమ్మని సంఘ సేవకుణ్ణి అడిగాడు.
ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి, దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయించాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు.
- డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి


