సాక్షి, విశాఖపట్నం: ఏయూ హాస్టల్ విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఏయూ విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు యూనివర్సిటీ ఉన్నతాధికారులు దిగొచ్చారు. ఫీజుతో సంబంధం లేకుండా భోజనం పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇవాళ(బుధవారం) ఉదయం నుంచి భోజనం పెడతామని సర్కులర్ విడుదల చేశారు. ఉదయం నుంచి మెస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో... విద్యార్థులు ఫీజులు చెల్లించలేదన్న నెపంతో ఏయూ పాలకులు కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజులుగా హాస్టల్ విద్యార్థులకు భోజనాలు పెట్టకుండా పస్తులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేసిన వెంటనే చెల్లిస్తామని విద్యార్థులు వేడుకున్నప్పటికీ.. ఏయూ అధికారులు కనికరించ లేదు.
ఫీజు చెల్లిస్తేనే భోజనాలు పెడతామని తెగేసి చెప్పి మెస్‌లకు తాళాలు వేశారు. దీంతో హాస్టల్స్ విద్యార్థులు మెస్‌ల వద్దకు వచ్చి గంటల తరబడి నిరీక్షించినా తెరవకపోవడంతో ఆకలితోనే వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఏయూ విద్యార్థుల ఆకలి కేకలపై సాక్షి మీడియా వరుస కథనాలు ఇవ్వడంతో అధికారులు దిగొచ్చారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదు. దీంతో విద్యార్థులు హాస్టల్ ఫీజులు కట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత హాస్టళ్లకు వచి్చన విద్యార్థులకు ఏయూ అధికారులు షాక్ ఇచ్చారు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం విద్యార్థులు మెస్‌లకు వెళ్లగా.. వాటికి తాళాలు వేసి ఉన్నాయి. మధ్యాహ్నం, రాత్రి కూడా అలాగే ఉండడంతో వేలాది మంది పస్తులు పడుకోవాల్సి వచి్చంది. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. కనీసం 50 శాతమైనా ఫీజు కడితేనే భోజనాలు పెడతామని చెప్పి విద్యార్థుల చేతుల్లో అధికారులు స్లిప్పులు పెట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అప్పులు చేసి రూ.4 వేలు, రూ.5 వేలు చొప్పున చెల్లించారు. వీరికి మాత్రమే మంగళవారం మధ్యాహ్నం భోజనాలు పెట్టారు.
ఇంకా 60 శాతం మంది ఫీజులు కట్టకపోవడంతో మెస్‌లోకి కూడా అనుమతించ లేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫీజులు కట్టలేదని రెండు రోజులుగా విద్యార్థులను పస్తులు వుంచడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే దానికి విద్యార్థులు బలైపోవాలా అని ప్రశ్నించారు.


