ఉపాధ్యాయులకు విషమ ‘పరీక్ష’ | Andhra Pradesh government fails in conducting HM Accountant test | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు విషమ ‘పరీక్ష’

Mar 10 2026 5:49 AM | Updated on Mar 10 2026 5:49 AM

Andhra Pradesh government fails in conducting HM Accountant test

హెచ్‌ఎం అకౌంటెంట్‌ టెస్టు నిర్వహణలో సర్కారు ఫెయిల్‌

పేపర్ల వ్యాల్యూయేషన్‌ చేయకుండానే మార్కులు జనరేట్‌!

100 మార్కుల పరీక్షకు 90 మార్కులకే పేపర్‌ రూపకల్పన

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీచర్లు

సాక్షి, అమరావతి: విద్యాశాఖలోని పరీక్షల నిర్వహణ విభాగం తప్పులు ఉపాధ్యాయుల పాలిట శరాఘాతాలుగా మారాయి. ఆ తప్పులను సరిదిద్దాల్సిన సర్కారు అదేమని అడిగిన ఉపాధ్యాయులపైనే బెదిరింపులకు దిగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 24 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు హెచ్‌ఎంగా ఉద్యోగోన్నతి లేదా ఆ స్థాయి ఇంక్రిమెంట్‌ ఇచ్చేందుకు విద్యాశాఖ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అకౌంటెంట్‌ టెస్ట్‌ నిర్వహించింది. 100 మంది దరఖాస్తు చేసుకోగా, 65 మందికి మాత్రమే హాల్‌టికెట్లను పంపింది.

దీనిపై గతంలోనే ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా సర్కారులో చలనం లేదు. 100 మార్కులకు పరీక్ష కాగా, కేవలం 90 మార్కులకు మాత్రమే పేపర్‌ ఇచి్చంది. రెండు పేపర్లకు హాజరైన ఉపాధ్యాయులు ఒక్క పేపర్‌ మాత్రమే రాశారని, మరో పేపర్‌కు గైర్హాజరయ్యారంటూ ఫెయిల్‌ చేసింది. సోమవారం రాష్ట్ర పరీక్షల విభాగం విడుదల చేసిన ఫలితాల్లో ఈ దారుణాలు వెలుగుచూశాయి. ఫలితాలు చూసి అవాక్కవడం టీచర్ల వంతైంది.

పేపర్లు వ్యాల్యూయేషన్‌ చేయలేదు..
అకౌంటెంట్‌ టెస్టుకు హాజరైన 65 మందిలో 23 మంది ఫెయిల్‌ అయినట్టు సోమవారం ఫలితాల్లో చూపారు. ఇందులో చాలామంది ఒక పేపర్‌కు హాజరై మరో పేపర్‌కు గైర్హాజరయ్యారంటూ ఆబ్సెంట్‌ వేశారు. అన్నమయ్య జిల్లాలో సీనియర్‌ ఉపాధ్యాయురాలు చింతలబోయిన స్రవంతి విజయవాడలో నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు ఆమె వేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ (అటెండెన్స్‌) నమోదై ఉంది. కానీ ఆమె పేపర్‌–1 ఆబ్సెంట్‌ అయినట్టు ఫలితాల్లో చూపారు. అలాగే బా పట్ల జిల్లాకు చెందిన సీహెచ్‌ ప్రభాకర్‌ రెండు పేపర్లకు హాజరవగా, అటెండెన్స్‌ లేదని చూపారు.

అంతేగాక, పేపర్‌–1కి 20 మార్కులు, పేపర్‌–2కి 21 మార్కులు వేసి ఫెయిల్‌ అయినట్టు చూపించారు. మిగిలిన వారికీ ఇలా జరగడంతో అసలు పేపర్ల వ్యాల్యూ యేషన్‌ చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.  2024 డిసెంబర్‌లో నిర్వహించిన పరీక్షలోనూ ఇదే దుస్థితి ఎదురైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎంతో కీలకమైన పదోన్నతి పొందే పరీక్ష నిర్వహణలో ఇంత నిర్లక్ష్యమేంటని నిలదీశారు. తాము రాసిన పరీక్ష పేపర్ల జెరాక్సు ఇస్తే పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం బండారం బయటపడుతుందని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫలితాలపై విచారణ చేయాలి
ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌
సాక్షి, అమరావతి: హెచ్‌ఎం అకౌంటెంట్‌ టెస్టు ఫలితాలపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్‌కే చిన్నప్ప డిమాండ్‌ చేశారు. పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసరెడ్డిని సోమవారం కలిసి పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో డొల్లతనాన్ని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఎయిడెడ్‌ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు నిర్వహించిన పేపర్‌–1లో వంద మార్కులకు గానూ 90 మార్కులకు మాత్రమే ప్రశ్నలు ఇచ్చారని వివరించారు.  జవాబు పత్రాలు దిద్దకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. పరీక్ష రాసిన ఉపాధ్యాయుల జవాబు పత్రా ల జిరాక్స్‌ కాపీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement