‘సాక్షి’తో జర్నలిస్ట్ ధన్యా రాజేంద్రన్
ధన్యా రాజేంద్రన్ సొంతూరు కేరళ రాష్ట్రం, పాలక్కాడ్. ఢిల్లీ నుంచి జర్నలిస్టు ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వార్తా పత్రికలు, టీవీ చానెళ్లలో పని చేసిన తర్వాత సొంతంగా న్యూస్ వెబ్‌సైట్ ప్రారంభించి నిర్వహిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సమగ్ర దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ అందించారు. ఓటర్ల నమోదులో ఉద్దేశపూర్వకంగా జరిగిన మోసాన్ని ద న్యూస్ మినిట్ వెబ్‌సైట్ ద్వారా బయటపెట్టారు. ‘అవుట్ స్టాండింగ్ ఉమన్ మీడియా పర్సన్’చమేలి దేవి జైన్ అవార్డు (2022) అందుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి హైదరాబాద్ నగరానికి వచ్చారు జర్నలిస్ట్ ధన్యా రాజేంద్రన్. ది న్యూస్ మినిట్ న్యూస్ (టీఎన్‌ఎమ్) వెబ్‌సైట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆమె. సమాచారాన్ని నిజాయితీగా అందించాలంటే పత్రికా స్వేచ్ఛతోపాటు జర్నలిజంలో జవాబుదారీతనం కూడా ఉండాలంటూ అనేక విషయాల పట్ల తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...
‘నేను నమ్మింది నమ్మినట్లు చెప్పడం కోసమే సొంత మీడియా సంస్థను ప్రారంభించాను. టీవీల్లో సమాజానికి అవసరమైన వార్తా కథనాలకంటే రేటింగ్‌ల కోసం ప్రసారాలే ఎక్కువగా కనిపించాయి. మహిళల కోసం, అణగారిన వర్గాల కోసం కథనాలు రాసే అవకాశం కలగలేదు. సొంత సంస్థను స్థాపించి నేను రాయాలనుకున్న కథనాలు రాయడం మొదలు పెట్టాను. నాతోపాటు ఇద్దరు మహిళా జర్నలిస్టులే మా ఎడిటోరియ ల్ టీమ్. ఎంతకాలం నడిపించగలనో తెలియని అయో మయ పరిస్థితుల్లోనే ధైర్యంగా ముందడుగు వేశాను. ఇప్పుడు నా వెబ్‌సైట్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగింది.
ఏం రాస్తున్నామో స్పష్టత ఉండాలి
కెరీర్ విషయంలో మా తరం కంటే ఇప్పుడు కొత్త తరం జర్నలిస్టుల ముందు పెద్ద అయోమయం నెలకొని ఉంది. సమా జం అనేక కోణాల్లో విభజితమై, దేనికదిగా కేంద్రీకృతమై ఉంది. ఈ స్థితిలో మనం ఏం రాస్తున్నామనే విషయంలో స్పష్టంగా ఉండాలి. ఒక విషయం, ఒక వ్యక్తి గురించి రాసే ముందు మనకు నమ్మకం కలగాలి. పేద, దళిత, ఆదివాసీల సమస్యలు రాయడానికి ముందు వాటిని విశ్వసించాలి. మన కలం గొంతు పెగల్చలేని నిస్స హాయులకు గొంతుక కావాలి. వారి గళాన్ని మన కలంతో సమాజానికి వినిపించాలి.
మహిళలకు నిత్యం సమస్యలే!: ఆడవాళ్లకు సవాళ్లు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలవుతున్నాయి. చదువుకోవడం, ఉద్యోగం, పెళ్లి, రోడ్డు మీద నడవడం నుంచి బస్సులో ప్రయాణించడం వరకు ప్రతిదీ ఒక సవాలే. మనదేశంలో మహిళ ఇంకా ఈ సమస్యలన్నింటినీ నిత్యం ఎదుర్కోవాల్సిన స్థితిలోనే ఉంది.
కంపెనీ సీఈవోలు, మీడియా సంస్థలో ఎడిటర్‌గా మహిళలు చాలా తక్కు వ, డిజిటల్ యుగం కావడంతో మహిళలు సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకుని ఎడిటర్‌లు అయిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. గడచిన నాలుగైదేళ్లుగా మన దేశంలో మహిళలను వెనక్కు నెట్టివేయడం స్పష్టంగా తెలుస్తోంది.


