పారని రాజకీయ కుట్ర | Police attack Sakshi TV photographer Krishna in Tirupat | Sakshi
Sakshi News home page

పారని రాజకీయ కుట్ర

Jan 8 2026 7:27 AM | Updated on Jan 8 2026 11:36 AM

Police attack Sakshi TV photographer Krishna in Tirupat

సాక్షి, అమరావతి: రాజకీయ కక్షతో సాక్షి ఫోటో గ్రాఫర్‌ మోహన్‌కృష్ణతోపాటు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కోటిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులకు తిరుపతి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానం గట్టి షాక్‌ ఇచ్చింది. వారిద్దరి రిమాండ్‌ని బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్‌ మంజూరు చేసింది. వివరాల్లోకెళితే.. తిరుమలలో ఈనెల 4న ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడటంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆలపాక కోటి ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయాన్ని సాక్షి ఫొటో గ్రాఫర్‌ మోహన్‌ కృష్ణకు సమాచారం ఇచ్చారు. అదే విషయాన్ని తిరుమల ఫొటో గ్రాఫర్‌ గిరి, సాక్షి టీవీ కెమెరామెన్‌కి సమాచారం ఇచ్చారు. 

ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ వివరాలతో ‘సాక్షి’తోపాటు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. అన్ని మీడియా ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. అదే రోజు తిరుమల టూటౌన్‌లో కేసు నమోదైంది. అయితే గుర్తు తెలియని వ్యక్తుల పేరున ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అలాగే ఈనెల 5న తిరుపతి కలెక్టరేట్‌ వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ  వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను పోలీసులు అడ్డుకుని ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటోగ్రాఫర్‌ మోహన్‌ కృష్ణపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్‌లో కూర్చోబెట్టారు.

 ఈ పరిణామాన్ని జర్నలిస్ట్‌ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కేసు నమోదు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే టీటీడీ, టీడీపీ పెద్దల ఒత్తిడితో పోలీసులు తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై మోహన్‌కృష్ణపైనా, కోటిపైనా కేసులు నమోదు చేశారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను టార్గెట్‌గా చేసుకుని రెండురోజులుగా ఓవర్‌ యాక్షన్‌ చేశారు. మంగళవారం తిరుమల టూటౌన్‌ పోలీసులు సాక్షి ఫోటో గ్రాఫర్‌ ఇంటికి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరింపులకూ దిగారు. దీంతో బుధవారం ఉదయం న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మోహన్‌ కృష్ణ అలిపిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

 అయితే సాయంత్రం వరకు డ్రామాలాడిన పోలీసులు ఆ తర్వాత టీడీపీ, టీటీడీ పెద్దల ఒత్తిడితో బెయిల్‌ రాకుండా ఉండేందుకు ఎఫ్‌ఐఆర్‌లో 152 సెక్షన్‌ అదనంగా చేర్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్, వైఎస్సార్‌సీపీ నాయకుడు కోటిని దేవలోక్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కట్టుకథ అల్లారు. బుధవారం రాత్రి  రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. కోర్టులో బాధితుల తరఫున న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వాదనలతో ఏకీభవించిన రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి  రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు, టీటీడీ పాలకమండలి పెద్దలు షాక్‌కు గురయ్యారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement