అన్నమయ్య జిల్లా: నాకు ఉద్యోగం ఉంది. మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. నన్ను పెళ్లు చేసుకుంటే మహరాణిలా చూసుకుంటానని యువతిని నమ్మించాడు. అతడి మాయమాటలను నమ్మిన యువతి కన్నవాళ్లను సైతం కాదనుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదిన్నర కాలం కూడా గడవకనే ఆ యువతిని వదిలించుకోవాలని యువకుడు ముఖం చాటేస్తున్నాడు.
దిక్కు తోచని ఆ యువతి న్యాయం కోసం బుధవారం పోలీసులను ఆశ్రయించింది. బాధిత యువతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన తెల్లగొర్ల గంగులప్ప కుమార్తె గాయత్రి (23) అనే యువతి డిగ్రీ వరకు చదివి బెంగళూరులోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేది. కొద్ది నెలలు గడిచాకా ఆమె బంధువుల ద్వారా బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం దిన్నెమీదపల్లికి చెందిన కటార్ క్రిష్ణప్ప కుమారుడు రాజశేఖర్ (25)తో పరిచయం ఏర్పడింది. అతను కూడా మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. అయితే ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు.
దీంతో ఆ యువతి కన్నవాళ్లను సైతం కాదని కాబోయే అత్తా, మామ సమక్షంలో రాజశేఖర్‌ను బెంగళూరులోని బన్నేరుగట్ట సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో 2024 డిశంబర్ 4న వివాహం చేసుకుంది. అనంతరం దిన్నెమీదపల్లిలో కాపురం పెట్టారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం ఆమె గర్భం దాల్చడంతో ఏడు నెలలకే నొప్పులు అధికమై ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స పొందింది. కోలుకున్నాకా నా బిడ్డ ఎక్కడా అని భర్తను ప్రశ్నించగా చనిపోయాడని దిన్నెమీదపల్లిలోని వ్యవసాయ భూమిలో ఖననం చేసినట్లు చెప్పినట్లు యువతి వాపోయింది. కన్నబిడ్డ కడచూపు కూడా చూసుకోలోదని కంటతడి పెట్టింది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకా తాను అత్తారింట్లో రెండు రోజులు ఉండి భర్త, అత్తా,మామ కోరిక ప్రకారం గత ఏడాది డిసెంబర్ 15న పుట్టింటికి చేరానని, అప్పటి నుంచి తన భర్తలో చాలా మార్పు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 2న కన్నవాళ్లతో కలసి అత్తారింటికి వెళ్లగా లోనికి రావద్దని గేటు వేసారని యువతి వాపోయింది. ఎలాగైనా తనను వదిలించుకుని నా భర్తకు వేరే పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో విసిగి వేసారిన తాను న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు యువతి పేర్కొంది.


