డెయిరీలపై అధికారుల దాడులు
మదనపల్లెటౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలోని డెయిరీలపై ఆహార భద్రత అధికారులు బుధవారం దాడులు జరిపారు. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీపాల వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇక్కడ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక బెంగుళూరు రోడ్డు, సీటీఎం రోడ్డు, ఇసుకనూతిపల్లెల వద్ద ఉన్న పాల డెయిరీలపై దాడులు జరిపి పాల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించామని అన్నమయ్య జిల్లా ఫుడ్ సేప్టీ అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పరీక్షల్లో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై ఆహార భద్రత ప్రమాణాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఐదుగురు కోడిపందెం
రాయుళ్ల అరెస్టు
మదనపల్లెటౌన్ : కోడి పందెం ఆడుతున్న ఐదుగురిని మదనపల్లె తాలూకా పోలీసులు అరెస్టుచేశారు.బుధవారం ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని సీటీఎం గ్రామం, ఆంజనేయ స్వామి గుడికి సమీపంలో కోడి పందెం ఆడుతున్నట్లు సీఐ కళా వెంకటరమణకు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి కోడి పందెం స్థావరంపై దాడులు జరపగా.. ఐదుగురు పట్టుబడినట్లు తెలిపారు. నిందితుల నుంచి రెండు పందెం కోళ్లు, రూ.4 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.
జెడ్పీ సీఈఓ బదిలీ
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా పరిషత్ సీఈఓ సి.ఓబుళమ్మను బదిలీ చేస్తూ బుధవారం పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ జీఓఆర్‌టీ నం.118 విడుదల చేసింది. డీడీఓ హోదా కలిగిన ఆమె ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. ఆమెను అనంతపురం యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్టుమెంట్ రీజినల్ డైరెక్టర్‌గా డిప్యూటేషన్‌పైన నియమించారు.
బద్వేలులో చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని రిక్షాకాలనీలో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, 750 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.3 వేలు నగదు చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అట్లూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన బోవిళ్ళగోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. పిల్లల చదువు కోసం గత కొన్నేళ్లుగా పట్టణంలోని రిక్షాకాలనీలో నివసిస్తున్నారు. గోపాల్‌రెడ్డి కాంట్రాక్టు పనుల నిమిత్తం వైజాగ్‌కు వెళ్లగా ఇంటి వద్ద ఆయన భార్య ప్రభావతి, పిల్లలు ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రభావతి పిల్లలకు భోజనం ఇచ్చేందుకు పాఠశాల వద్దకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు తెరిచి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గ్రహించి అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డెయిరీలపై అధికారుల దాడులు


