మన లోకం పిలుస్తోంది చలో చలో | Sakshi Special Story About Hyderabad Book Fair 2025 | Sakshi
Sakshi News home page

మన లోకం పిలుస్తోంది చలో చలో

Dec 21 2025 12:51 AM | Updated on Dec 21 2025 12:51 AM

Sakshi Special Story About Hyderabad Book Fair 2025

బుక్‌ఫెయిర్‌ స్పెషల్‌

ఆకాశంలో ఎగిరే ‘మేజిక్‌ కంబళి’... ‘ఓపెన్‌ ససేమ్‌’ అనగానే తెరుచుకునే గుహద్వారం 
దీపం రుద్దితే వచ్చే ‘జినీ భూతం’... దొంగల భరతం పట్టే ‘తెనాలి రామ’
అక్బర్‌ని పకపకా నవ్వించే ‘బీర్బల్‌ గారు’ ... అమాయకుల్ని మోసం చేసే ‘బంగారు కంకణం పులి’
‘కరటక దమనకులు’ ... ‘మర్యాద రామన్న’లు ... ‘హారీ పాటర్‌’లూ ‘సూపర్‌ మేన్‌’ సిరీస్‌లూ...
బుక్‌ఫెయిర్‌ నిండా బాలల లోకమే...  
ఎన్నో కొత్త కొత్త పుస్తకాలు వారిని అక్కడకు తీసుకెళ్లండి...
వాళ్ల లోకాలను సొంతం చేసుకోనివ్వండి...

‘నువ్వు ఏ దిక్కయినా వెళ్లు... ఒక్క ఉత్తర దిక్కు తప్ప’ అంటుంది పూటకూళ్ల అవ్వ రాకుమారుడితో పిల్లల కథల్లో. రాకుమారుడు పట్టుబట్టి ఉత్తర దిక్కు వైపే వెళతాడు. ప్రమాదాలను ఎదుర్కొంటాడు. అపాయాలను దాటుతాడు. శాపాలతో బంధించబడిన వారిని విముక్తం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న రాజ్యానికి రాజవుతాడు. అందరూ నడిచే దారుల్లో నడవకుండా కొత్త దారుల్లో ధైర్యంగా వెళ్లమని పిల్లలకు చె΄్తాయి కథలు. ప్రస్తుతం జరుగుతున్న ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’లో అలాంటి ధైర్యాన్ని నూరి పోసే అనేక పుస్తకాలుంటాయి. వాటిని వారికి ఇవ్వండి. అక్కడకు తీసుకెళ్లండి.

‘ఈసప్‌’ అనే పెద్దాయన కనీసం రెండు వేల ఏళ్ల క్రితం కొన్ని కథలు చెప్పి మనుషుల్ని సంస్కరించాడు. ‘బంగారు గొడ్డలి’ కథ అతడు చెప్పిందే. కట్టెలు కొట్టేవాడు తన ఇనుప గొడ్డలి నదిలో పారేసుకుంటే నదీ దేవత వెండి గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... బంగారు గొడ్డలి తీసుకు వస్తుంది... తనది కాదంటాడు... చివరకు ఇనుప గొడ్డలే తీసుకుంటాడు... నదీ దేవత సంతోషించి మూడు గొడ్డళ్లనూ అతనికి బహూకరిస్తుంది. నిజాయితీతో ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి అని పిల్లలకు చె΄్తాయి కథలు. విలువలకు ప్రాముఖ్యం లేకుండా పోతున్న నేటి రోజుల్లో  పెద్దలు వాటిని చెప్పకపోతే పోయారు... కనీసం పుస్తకాలైనా చెప్పనివ్వండి... పిల్లల్లో నిజాయితీ పాదుకునేలా చేయండి.

ఇంట్లో దొంగలు పడితే వారి చేత బావి లోని నీళ్లన్నీ చేదించి పాదులకు పోయించుకున్నాడు తెలివైన తెనాలి రామలింగడు. ‘ఈ బిడ్డ నాదంటే నాది’ అని ఇద్దరు తల్లులు కొట్లాడుకుంటే వారిలో అసలు తల్లి ఎవరో యుక్తిగా కనిపెట్టాడు మర్యాద రామన్న. నమ్మించి కొంతమంది ఎలా గొంతు కోస్తారో అనడానికి ఉదాహరణగా నిలిచాడు ఆషాఢభూతి. వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్న పావురాలు అన్నీ కలిసి ఐకమత్యంతో వలతో పాటు ఎగిరి వెళ్లిపోయాయి. ఆకాశంలో కొంగలు మోసుకెళుతున్న తాబేలు నోటి తీటతో నోరు తెరిచి నేలన పడి ప్రాణం వదిలింది....
ఇవన్నీ పిల్లలకు చెప్పే పాఠాలెన్నో. ఎన్నెన్నో. అందుకే వారికి మంచి స్కూలు, మంచి ట్రాన్స్‌పోర్టు, ట్యూషను ఎలా పెడతామో మంచి పిల్లల పుస్తకం కూడా అలాగే చేతికివ్వాలి. పిల్లలు నేర్చుకునే విధాలు వేయి. కాని వేయి విధాలుగా నేర్పగల ఒకే సాధనం పుస్తకం.

గతంలో చందమామ, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు... పిల్లల కోసం ప్రచురితమయ్యేవి. వాటిలో కథలు, బొమ్మలు, విశేషాలు ఉండేవి. పిల్లలతోపాటు పెద్దలూ ఆసక్తిగా చదివేవారు. కాలం మారింది. పిల్లలు స్కూళ్లు, క్లాసులు, ట్యూషన్ల మధ్య హడావిడి పడుతుండటంతో మెల్లగా ఒక్కో పత్రికా మూతబడింది. ప్రస్తుతం పిల్లల కోసం నడుస్తున్న పత్రికలు అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు కొందరు రచయితలు పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. వాటికి ఆకర్షణీయమైన బొమ్మలు జోడించి ప్రచురిస్తున్నారు. 

చదవడం, రాయడం వచ్చిన కొందరు పిల్లలు తమ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కథలు, కవితలు రాసి పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటికే ‘చిప్పగిరి కథలు’, ‘జక్కాపూర్‌ బడిపిల్లల కథలు’, ‘నల్లగొండ జిల్లా బడిపిల్లల కథలు’, ‘మా బడి పిల్లల కథలు’, ‘సిద్ధిపేట జిల్లా బడిపిల్లల కథలు’, ‘మన ఊరు–మన చెట్లు’ ‘వరంగల్‌ జిల్లా బడి పిల్లల కథలు’ వంటి పిల్లలు రాసిన కథలతో వచ్చిన పుస్తకాలు ఆదరణ పొందాయి. దీంతోపాటు చిట్టి పొట్టి పాటలు, బాల గేయాలు, కవితలు రాసి విద్యార్థులు ఉపాధ్యాయుల సాయంతో ప్రచురిస్తున్నారు. కొందరు ఇంగ్లీషులోనూ రాసి పుస్తకాలు తెస్తున్నారు. అవన్నీ బాలసాహిత్యానికి బలమైన చేర్పుగా మారాయి. 

తెలుగులో బాలసాహిత్యం ఏనాటి నుంచో ఉంది. పాల్కురికి సోమనాథుడు, పోతన వంటి ప్రాచీన కవుల రచనల్లో పిల్లల కోసం తేటతెనుగు మాటలు జాలువారాయి. అనంతర కాలంలో అలపర్తి వెంకటసుబ్బారావు, నార్ల చిరంజీవి, మిరియాల రామకృష్ణ,  మహీధర నళినీమోహన్, న్యాయపతి రాఘవరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, దాసరి వెంకట రమణ, ఎం.హరికిషన్, చొక్కాపు వెంకటరమణ, భూపాల్, వాసాల నర్సయ్య, పత్తిపాక మోహన్, ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి తదితరులు బాలల కోసం అనేక పుస్తకాలు రాశారు. ప్రస్తుతం అనేకమంది రచయితలు బాలసాహిత్యకారులుగా గుర్తింపు పొందారు. 

రష్యన్‌ బాల సాహిత్యం కూడా తెలుగులో పునర్ముద్రణ అవుతోంది. అనిల్‌ బత్తుల ‘రష్యన్‌ జానపద కథలు’ పుస్తకం తీసుకొచ్చారు. ‘పిల్లల సినిమా కథలు’, ‘బాపు బొమ్మల పంచతంత్రం’ వంటి పుస్తకాలు పిల్లల కోసం తీసుకొచ్చారు. ప్రముఖ రచయిత్రి ముళ్లపూడి శ్రీదేవి రాసిన పిల్లల కథలు ప్రచురితం అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జానకీరామ్‌ ‘ఏడు రంగులవాన’ అనే బాలల కథల పుస్తకం రాయడంతోపాటు విద్యార్థుల చేత కథలు రాయించి, తన సంపాదకత్వంలో ‘ఊహలకు రెక్కలొస్తే’ అనే కథల పుస్తకం తీసుకొచ్చారు. పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి తానా, మంచి పుస్తకం 2025లో పోటీ నిర్వహించగా ‘చతుర్ముఖం’ (శాఖమూరి శ్రీనివాస్‌), ‘ఆలిబాబా అయిదుగురు స్నేహితులు’ (డా.ఎం.సుగుణరావు), ‘మనకు మనుషులు కావాలి’ (పాణ్యం దత్తశర్మ), ‘మునికిష్టడి మాణిక్యం’ (ఆర్‌.సి.కృష్ణ స్వామిరాజు), ‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’(పేట యుగంధర్‌) పుస్తకాలు ఎంపికయ్యాయి. ఇటీవల రచయిత దొండపాటి కృష్ణ పిల్లలకోసం ‘వింత శాపం’ అనే చిన్ని పుస్తకం తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఇంగ్లిష్‌ భాషలో ఎన్నో పుస్తకాలు పిల్లల కోసం ఉన్నాయి. ఆ నింగి నక్షత్రాలను నేలన ఉన్న తారలకు ఇవ్వండి.
 

తెలుగు నేర్పించేందుకు కథలు చదివిస్తున్నారు
ఇంతకు ముందు తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ పుస్తకాలు చదివించేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు తెలుగు పిల్లలకు రావాలని తెలుగు పుస్తకాలు చదివిస్తున్నారు. ‘మంచి పుస్తకం’ సంస్థ పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు ప్రచురిస్తోంది. పిల్లల ఏజ్‌ గ్రూప్‌ను బట్టి వారి కోసం ‘గ్రీన్‌ సిరీస్‌’, ‘బ్లూ సిరీస్‌’... ఇలా పుస్తకాలు ప్రచురిస్తున్నాం. మనకి తెలియాల్సిన విషయం ఏమిటంటే రెండూ రెండున్నర ఏళ్ల పిల్లలు కూడా పుస్తకాలకు ఆకర్షితులవుతారు. వారి కోసం బొమ్మల పుస్తకాలు ఉంటాయి. అప్పటి నుంచి అలవాటు చేయాలి. ‘మంచి పుస్తకం’ తరఫున ‘గిఫ్ట్‌ ఏ లైబ్రరీ’ కాన్సెప్ట్‌ ఉంది. మీరు చదివిన స్కూల్‌కు 10 వేల రూపాయల పుస్తకాలు బహూకరించాలనుకుంటే వాటిని డిస్కౌంట్‌లో 8500 లకే మేము అందిస్తాం. ఈ ఆలోచనకు మంచి స్పందన ఎదురవుతోంది. పిల్లలకు పుస్తకాలు కొని తెచ్చివ్వడం కన్నా వారిని పుస్తకాల షాపుకు తీసుకెళితే వారికి కలిగే ఉత్సాహం వేరు అని మా అనుభవం చె΄్తోంది. ఇక బుక్‌ఫెయిర్‌కు తీసుకెళితే వారు తూనీగలే అవుతారు.
– పవిత్ర, మంచి పుస్తకం ఇన్‌చార్జ్‌

రికార్డుల మోత
చిన్న వయసులోనే ఎక్కువ రికార్డ్‌లు సృష్టించిన యువతిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది చండీగఢ్‌కు  చెందిన జాన్వీ జిందాల్‌. ప్రీస్టైల్‌ స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది. జాన్వీకి కోచ్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. తండ్రి సహాయంతో, యూట్యూబ్‌ వీడియోల ద్వారా స్కేటింగ్‌ నేర్చుకుంది.‘భాంగ్రా ఆన్‌ స్కేట్స్‌’ ‘యోగా ఆన్‌ స్కేట్స్‌’వంటివి సృష్టించి, భారతీయ సంస్కృతిని స్కేటింగ్‌తో మిళితం చేసింది. పదకొండు గిన్నిస్‌ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న జాన్వీ, మన దేశంలో అత్యధిక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లను సాధించిన తొలి మహిళగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement