breaking news
Childrens literature
-
బాలోత్సవం
కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్ కథలు, జంగిల్ బుక్, కాంచన ద్వీపం, గలివర్ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్ రండెల్ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.లండన్‌లోని థేమ్స్ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్ కరోల్. అందులో అలీస్ లిడ్డెల్ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్. అట్లా ‘అలీస్(స్) అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్ లిటరేచర్’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్ బుకర్ ప్రైజ్’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. -
బాలల సాహిత్యానికీ బుకర్
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్‌ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్‌గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది. -
బాల సాహితికి బంధువు బి.వి.నరసింహారావు
స్మృతిపథం: ఆబాలగోపాలం అలవోకగా ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం బి.వి.నరసింహారావు జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. ‘‘నా కొలిచే దేవుళ్ళు పసివాళ్ళు గుండెగుడిని నిండుగ కొలు వుండిన దేవుళ్ళు పసివాళ్ళు’’ అని తెలుగు బాలల వినోద, విజ్ఞాన, వికాసాలకు తన జీవితాన్ని అంకితం చేసి ‘‘బాలబంధు’’గ తెలుగు నాట గణుతికెక్కారు బి.వి. నరసింహారావు. ‘‘అల్లారుముద్దు పిల్లల్లారా! ఇల్లారండి భయపడకండి ఇదిగో నాహృది! మీ విడిది! ఇట దొరుకుతుంది మీకు వలసింది’’ అని పిల్లల్లో పిల్లవాడై తన ఆటతో, పాటతో, మాటతో వారిని తన్మయులను చేసేవాడు. బి.వి. నరసింహారావు. వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంధ్ర, విరిసినపూలు, నా కథలు, ప్రియదర్శి, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. బాలవాంగ్మయ రచనా వ్యాసంగాన్ని ఆయన నిర్దిష్ట లక్ష్యసాధనకు చేపట్టారు. అవి... చిన్న పిల్లలకు విద్యామార్గాలు, జ్ఞానాంశాలు సులువుగా, సుందరంగా బోధించడం; బాలల్లో నిక్షిప్తమై ఉన్న విశిష్ట లక్షణాలను వివరించి చెప్పడం; కాలం తీరిన పెద్దలకూ, కాలం తీరాన ఉన్న పిన్నలకూ మధ్యనున్న అఖాతాన్ని, అగాథాన్ని అవగాహన అనే పూలవంతెన నిర్మాణం ద్వారా తొలగించడం; పిల్లలను నూతన దృక్కోణంతో, హేతువాద దృష్టితో అర్థం చేసుకొని వారి ఎదుగుదలకు పాటు పడవలసిందిగా పెద్దలకు విన్నవించడం; ముఖ్యంగా ఆబాలగోపాలం అలవోకగా ఆనందంగా అందుకోవడానికి, ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావు పెట్టుకున్నారు. నేటి బాల సాహిత్యకారులు బాలబంధు బాటలో నడవాలి. ‘బాలల భావాలు బాలభాషలో వెలార్చడానికి ముందు బాల మనస్కత మనలో పుష్కలంగా ఉండాలి’ అంటారు బాలబంధు. తదనుగుణంగానే తన జీవిత విధానాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాడిగ వేంకటనరసింహారావు జీవితం కొత్త పుంతలు తొక్కింది. కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం పిల్లలతో నాటకాల్లో వేషాలు వేయించి, చదువు చెప్పిస్తారని విని, చిన్ననాటి నుంచి నటనాభిలాష ఉన్న నరసింహారావు అందులో చేరారు. కస్తూరి శివరావు. రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు బి.వి. జీవిత గమనాన్ని మార్చివేశారు. వింజమూరి రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రధారణ బి.వి.తో వేయించారు. తన గానంతో, అభినయంతో, నాట్యంతో ఆయన ప్రేక్షకులను మైమరిపించారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. దాదాపు పదేళ్ళపాటు అనార్కలి పాత్రలో ప్రజలను రంజింపచేశారు. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు, బి.వి. నరసింహారావు స్త్రీ పాత్రలతో ప్రసిద్ధులయ్యారు. పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు దాదాపు 30 ఏళ్లపాటు నాట్యరంగానికి బి.వి. విశేషసేవ చేశారు. జానపదాలకు నాట్యాభినయం కూర్చి దాన్ని శాస్త్ర,కళాసాంప్రదాయంగా రూపొందించిన ఘనత బి.వి. దక్కించుకున్నారు. ఆధునిక కవిత్వంలో భాగంగా, భావకవిత్వం కొత్త వస్తువుతో కొత్త రూపంలో ఆవిర్భవించిన సమయంలో, ఆ కొత్త పాటల ప్రాతిపదికన కొత్త నాట్యం ఆవిర్భావానికి బి.వి. కారకులయ్యారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటి మహాకవుల గీతాలకు నాట్యాన్ని కూర్చిన ఘనత బి.వి.కే దక్కింది. ‘ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలంటే దాన్ని గురించిన వివేచన వుుందు కొంతైనా అవసరం, అందుకోసం నేను, నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేసుకున్నాను’ అని బి.వి. తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలా నాట్య వివరణ అందించినవారిలో కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, కాళోజీ, ఇంద్రగంటి, వేదుల వంటి వారెందరో ఉన్నారు.1942లో పాలకొల్లులో బి.వి. నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ల నారాయణ దాసు మనసు పులకించి అమాంతంగా రంగస్థలం మీదికి దుమికి ‘ఒరే! నా ఒళ్ళు మొగ్గతొడిగిందిరా నీ నాట్య దర్శనంతో’ అంటూ ఆశువుగా పద్యం చెప్పి ఆశీర్వదించారు. కవిసామ్రాట్ విశ్వనాథ బి.వి. నాట్యానికి ‘భావనాట్యం’ అని పేరుపెట్టారు. బి.వి.నరసింహారావుకి మహారచయిత చలంగారితో ఆత్మీయానుబంధం ఉండేది. తనకు చలం రాసిన లేఖలను పుస్తకంగా వెలువరించారు. 1994 జనవరి 6వ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చలం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై బి.వి. హఠాన్మరణం చెందారు. అపురూప బాలసాహితీవేత్తగా, తెలుగునాట్యానికి నూతనత్వాన్ని సంతరింపచేసిన నాట్య కళాకారుడుగా చరిత్రకెక్కిన బాలబంధు బి.వి. నరసింహారావు చిరంజీవి.


