బాల సాహితికి బంధువు బి.వి.నరసింహారావు

బాల సాహితికి బంధువు బి.వి.నరసింహారావు


స్మృతిపథం: ఆబాలగోపాలం అలవోకగా   ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం బి.వి.నరసింహారావు జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు.

 

 ‘‘నా కొలిచే దేవుళ్ళు పసివాళ్ళు

 గుండెగుడిని నిండుగ కొలు

 వుండిన దేవుళ్ళు పసివాళ్ళు’’ అని

 తెలుగు బాలల వినోద, విజ్ఞాన, వికాసాలకు తన జీవితాన్ని అంకితం చేసి ‘‘బాలబంధు’’గ తెలుగు నాట గణుతికెక్కారు బి.వి. నరసింహారావు.

 ‘‘అల్లారుముద్దు పిల్లల్లారా!

 ఇల్లారండి భయపడకండి

 ఇదిగో నాహృది! మీ విడిది!

 ఇట దొరుకుతుంది మీకు వలసింది’’ అని

 పిల్లల్లో పిల్లవాడై తన ఆటతో, పాటతో, మాటతో వారిని తన్మయులను చేసేవాడు.

 బి.వి. నరసింహారావు. వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంధ్ర, విరిసినపూలు, నా కథలు, ప్రియదర్శి, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది.

 

 బాలవాంగ్మయ రచనా వ్యాసంగాన్ని ఆయన నిర్దిష్ట లక్ష్యసాధనకు చేపట్టారు. అవి... చిన్న పిల్లలకు విద్యామార్గాలు, జ్ఞానాంశాలు సులువుగా, సుందరంగా బోధించడం; బాలల్లో నిక్షిప్తమై ఉన్న విశిష్ట లక్షణాలను వివరించి చెప్పడం; కాలం తీరిన పెద్దలకూ, కాలం తీరాన ఉన్న పిన్నలకూ మధ్యనున్న అఖాతాన్ని, అగాథాన్ని అవగాహన అనే పూలవంతెన నిర్మాణం ద్వారా తొలగించడం; పిల్లలను నూతన దృక్కోణంతో, హేతువాద దృష్టితో అర్థం చేసుకొని వారి ఎదుగుదలకు పాటు పడవలసిందిగా పెద్దలకు విన్నవించడం; ముఖ్యంగా ఆబాలగోపాలం అలవోకగా ఆనందంగా అందుకోవడానికి, ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావు పెట్టుకున్నారు. నేటి బాల సాహిత్యకారులు బాలబంధు బాటలో నడవాలి. ‘బాలల భావాలు బాలభాషలో వెలార్చడానికి ముందు బాల మనస్కత మనలో పుష్కలంగా ఉండాలి’ అంటారు బాలబంధు. తదనుగుణంగానే తన జీవిత విధానాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు.

 

 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాడిగ వేంకటనరసింహారావు జీవితం కొత్త పుంతలు తొక్కింది. కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం పిల్లలతో నాటకాల్లో వేషాలు వేయించి, చదువు చెప్పిస్తారని విని, చిన్ననాటి నుంచి నటనాభిలాష ఉన్న నరసింహారావు అందులో చేరారు. కస్తూరి శివరావు. రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు బి.వి. జీవిత గమనాన్ని మార్చివేశారు. వింజమూరి రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రధారణ బి.వి.తో వేయించారు. తన గానంతో, అభినయంతో, నాట్యంతో ఆయన ప్రేక్షకులను మైమరిపించారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు.

 

 దాదాపు పదేళ్ళపాటు అనార్కలి పాత్రలో ప్రజలను రంజింపచేశారు. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు, బి.వి. నరసింహారావు స్త్రీ పాత్రలతో ప్రసిద్ధులయ్యారు. పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు దాదాపు 30 ఏళ్లపాటు నాట్యరంగానికి బి.వి. విశేషసేవ చేశారు. జానపదాలకు నాట్యాభినయం కూర్చి దాన్ని శాస్త్ర,కళాసాంప్రదాయంగా రూపొందించిన ఘనత బి.వి. దక్కించుకున్నారు. ఆధునిక కవిత్వంలో భాగంగా, భావకవిత్వం కొత్త వస్తువుతో కొత్త రూపంలో ఆవిర్భవించిన సమయంలో, ఆ కొత్త పాటల ప్రాతిపదికన కొత్త నాట్యం ఆవిర్భావానికి బి.వి. కారకులయ్యారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటి మహాకవుల గీతాలకు నాట్యాన్ని కూర్చిన ఘనత బి.వి.కే దక్కింది.

 

 ‘ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలంటే దాన్ని గురించిన వివేచన వుుందు కొంతైనా అవసరం, అందుకోసం నేను, నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేసుకున్నాను’ అని బి.వి. తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలా నాట్య వివరణ అందించినవారిలో కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, కాళోజీ, ఇంద్రగంటి, వేదుల వంటి వారెందరో ఉన్నారు.1942లో పాలకొల్లులో బి.వి. నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ల నారాయణ దాసు మనసు పులకించి అమాంతంగా రంగస్థలం మీదికి దుమికి ‘ఒరే! నా ఒళ్ళు మొగ్గతొడిగిందిరా నీ నాట్య దర్శనంతో’ అంటూ ఆశువుగా పద్యం చెప్పి ఆశీర్వదించారు. కవిసామ్రాట్ విశ్వనాథ బి.వి. నాట్యానికి ‘భావనాట్యం’ అని పేరుపెట్టారు. బి.వి.నరసింహారావుకి మహారచయిత చలంగారితో ఆత్మీయానుబంధం ఉండేది. తనకు చలం రాసిన లేఖలను పుస్తకంగా వెలువరించారు. 1994 జనవరి 6వ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చలం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై బి.వి. హఠాన్మరణం చెందారు. అపురూప బాలసాహితీవేత్తగా, తెలుగునాట్యానికి నూతనత్వాన్ని సంతరింపచేసిన నాట్య కళాకారుడుగా చరిత్రకెక్కిన బాలబంధు బి.వి. నరసింహారావు చిరంజీవి.  

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top