
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలపై(Kamal Kannada Comment) కన్నడనాట తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కమల్ కామెంట్‌పై స్పందించారు.
కన్నడ భాషకు(Kannada Language) ఎంతో చరిత్ర ఉంది. పాపం కమల్ హాసన్‌కు ఆ విషయం తెలియకపోయి ఉండొచ్చు అంటూ సిద్ధరామయ్య అన్నారు. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర యడియూరప్ప సైతం కమల్ వ్యాఖ్యపై మండిపడ్డారు.
‘‘మాతృభాషను ప్రేమించడం మంచిదే అయినా.. ఇతర భాషలను అవమానించడం సరైంది కాదని అన్నారాయన. ఇది కన్నడ ప్రజలను మాత్రమే కాదు.. శివరాజ్ కుమార్ లాంటి అగ్రనటుడిని కూడా అవమానించడమే. కన్నడ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన కమల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని విజయేంద్ర డిమాండ్ చేశారాయన.
చెన్నైలో జరిగిన థగ్ లైఫ్ చిత్ర(Thug Life) ఈవెంట్‌లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ ‘‘మీ భాష(కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’ అని అన్నారు. ఈ కామెంట్‌పై ఇటు రాజకీయంగా, అటు సోషల్ మీడియాలోనూ కమల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడ పరిరక్షణ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక కమల్ వ్యాఖ్యలపై భగ్గుమంది. క్షమాపణలు చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది.
మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి లీడ్ రోల్స్‌లో నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఖబడ్దార్ కమల్.. నల్ల ఇంకు పోస్తాం