
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.
టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది..
.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్ అన్నారు.
.. చంద్రబాబు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
.. ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:

.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లు, రేషన్ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, రాజధాని పనులు.. లిక్కర్ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్ అన్నారు.
క్లిక్ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన