
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో(Manipur Politics) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటునకు తాము సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి తోక్చోమ్ రాధేశ్యామ్ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం రాధేశ్యామ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు ప్రజాభీష్టం మేరకు మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసేందుకు 10 మంది ఇక్కడికి వచ్చాం. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంది’’ అని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదిరిందా? అనే ప్రశ్నకు రాధేశ్యామ్ సమాధానం దాటవేశారు.
2023 మేలో మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలతో హింసాత్మక పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 20 నెలలపాటు అవి కొనసాగాయి. ఈ అల్లర్లలో 250 మంది మరణించగా.. వేల మంది మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే.. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గుచూపింది. దీంతో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
మణిపూర్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు నెగ్గింది. మొత్తం 60 సీట్లకుగానూ బార్డర్ మెజారిటీ దక్కించుకున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ శాసనసభ పదవీకాలం 2027 వరకు ఉంది. అయితే హింస కారణంగా సీఎం రాజీనామాతో.. రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: డీఎంకే రాజ్యసభ అభ్యర్థిగా కమల్ హాసన్