నమ్మించి నిండా ముంచి.. దగా పాలన | YSRCP President YS Jagan fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నమ్మించి నిండా ముంచి.. దగా పాలన

Mar 12 2026 5:08 AM | Updated on Mar 12 2026 5:08 AM

YSRCP President YS Jagan fires on Chandrababu Naidu

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సున్నా వడ్డీకి చాప చుట్టేసిన బాబు సర్కారు

మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ కోతలు

రూ.40 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయిన రుణాలు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

రెండేళ్లలో గజం ఇంటి స్థలం ఇవ్వలేదు.. కొత్తగా ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు

పైగా ఇప్పుడు త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామంటూ మోసగిస్తున్నారు 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక చదువులు మానేస్తున్న విద్యార్థులు

విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.10,328 కోట్లు.. కేటాయింపులు రూ.2,766 కోట్లే  

ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్ల బకాయిలు 

ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీ.. ఐఆర్‌ ఊసే లేదు

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ అంటూ గొప్పలు

సచివాలయాల ఉద్యోగులు, సర్వేయర్లకు సస్పెన్షన్లు, వేధింపులే బహుమానం 

నిజానికి సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది?

ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్‌లకు మంగళం.. ఆస్పత్రుల్లో మందుబిళ్ల కూడా దొరకట్లేదు 

ఇచ్చిన హామీలకు దిక్కులేకున్నా ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని ఎలా చెబుతారు? 

చంద్రన్న పెళ్లి కానుక కిందప్రతి జంటకు రూ.లక్ష చొప్పున ఎంత మందికి ఇచ్చారు?

సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబు తన పాలనలో అన్ని వర్గాల వారిని నిండా ముంచారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులను సైతం తన అబద్ధాలతో వంచించారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపుతూ చంద్రబాబు ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. 

‘పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏప్రిల్‌లో సున్నా వడ్డీ ఇచ్చేవాళ్లం. మేం ఐదేళ్లలో రూ.4,900 కోట్లు ఈ పథకానికి ఇచ్చాం. చంద్రబాబు మేనిఫెస్టోలో వడ్డీ లేని రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. పెంచడం కథ దేవుడెరుగు.. మా హయాంలో ఇచ్చేది కూడా ఎగర­గొట్టేశారు. ఈయన మేనిఫెస్టోలో చెప్పిన రూ.10 లక్షల ప్రకారం చూస్తే ఈయన ఇవ్వాల్సింది ఏటా రూ.3,500 కోట్లు. ఈ మూడేళ్లలో కలిపి రూ.10 వేల కోట్లకు పైగా ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఇస్తారని అక్కచెల్లెమ్మలు ఎదురు­చూస్తున్నారు. 

మరోవైపు పొదుపు సంఘాల పరిపతి తగ్గిపోయింది. ఏకంగా రూ.10 వేల కోట్ల రుణాలు తగ్గిపోయాయి. నాబార్డు డేటా ప్రకారం రూ.40 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గిపోయాయి. మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశారు. వీళ్లు ఇస్తామన్నా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ ఎగ్గొట్టేశారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు
» విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారని సీఎం చంద్ర­బాబును గట్టిగా నిలదీస్తూ అడిగాం. కానీ ఒక్క మాట లేదు. 2024 జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్‌లో వెరిఫై చేసి ఇచ్చే వాళ్లం. మార్చి 16న ఎన్నికల కోడ్‌ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అక్కడి నుంచి పిల్లల కష్టాలు మొదలయ్యాయి. 

» అసెంబ్లీ జరుగుతుండడంతో ఎక్కడ గొడవవుతుందో అని బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) రూ.1,200 కోట్లు ఇచ్చారు. బీఆర్వో ఇస్తే డబ్బులు ఇచ్చినట్టు కాదని ఆరోజే చెప్పాను. కానీ ఇచ్చింది రూ.300 కోట్లే అంటున్నారు. మొత్తంగా వీళ్లు ఇచ్చింది రూ.2,071 కోట్లు మాత్రమే. అంటే రూ.6,428 కోట్లు ఈ రెండేళ్లకే బాకీ పడ్డారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్స్‌కు రూ.700 కోట్ల చొప్పున రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఏప్రిల్‌ 2026లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి ఈ ఏడాది రూ.3,900 కోట్లు ఇవ్వాల్సి ఉంది. తొలి రెండేళ్లూ బాకీపడ్డ రూ.6,428 కోట్లు కలిపితే మొత్తంగా రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది బడ్జెట్‌లో వీళ్లు జరిపిన కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. 

»  ఒక్కో త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.700 కోట్లు ఖర్చవుతుంది. 9 క్వార్టర్స్‌కు రూ.6,300 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద ప్రతీ ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఎన్ని­కల కోడ్‌ రాకతో ఆగిపోయింది. ఏప్రిల్‌ 2024, ఏప్రిల్‌ 2025.. అంటే రెండేళ్లలో రూ.2,200 కోట్లు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే విద్యా దీవెన కింద రూ.6,300 కోట్లు, వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు కలిపి మొత్తంగా రూ.8,500 కోట్లు ఇవ్వాలి. కానీ 2024–25 బడ్జెట్‌లో రూ.1,771 కోట్లు విడుదల చేసినట్టు చూపించారు. 

»  ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? కళాశాల యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టించుకుంటున్నాయి. కట్టలేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. తల్లిదండ్రులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చదువులు మానేస్తున్న పరిస్థితి. అయినా సరే చంద్రబాబుకు మనసు రాదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలైన తర్వాత కూడా ఇవి ఎప్పుడు ఇస్తావని అడిగితే చంద్రబాబు నోటి నుంచి మాట రావడం లేదు. 

ఆరోగ్యశ్రీకి భారీ బకాయిలు
»   ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమం ఆగిపోయింది. 17 వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో నిరసన తెలిపారు. ఆ ఆధునిక దేవాలయాలైన బోధనాస్పత్రులను పూర్తి చేయాలని కోరితే చంద్రబాబు దగ్గర నుంచి స్పందన లేదు. ఆరోగ్యశ్రీ కింద రూ.3,150 కోట్ల బకాయిలు పెట్టారు

» 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే మరో రూ.4 వేల కోట్లు కావాలి. అంటే, బకాయిలతో కలిపి చూస్తే రూ.7,150 కోట్లు రాబోయే ఆర్థిక ఏడాదిలో ఖర్చు చేయాలి. చంద్రబాబు బడ్జెట్‌ కేటాయింపులు మాత్రం రూ.4 వేల కోట్లు చేశారు గానీ, అంతకు ముందు సంవత్సరాలు చూస్తే ఎప్పుడూ కూడా రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట­లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఒకవైపు బంద్‌ ప్రకటిస్తున్నా­యి. తాము అగ్రిమెంట్లు చేసుకోమని నోటీసులు ఇస్తున్నాయి. దీనిపై చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా అనిపించట్లేదు.

బాబు కేరాఫ్‌ క్రెడిట్‌ చోరీ!
» చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా రెండే పనులు చేస్తారు. ఒకటి పింఛన్‌ పంపిణీలో ప్రచారం చేసుకోవడం.. రెండు ఏదో గ్రామానికి వెళ్లిన చోట రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తానని బిల్డప్‌ ఇస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, సమగ్ర సర్వే, టెక్నాలజీ వినియోగం, క్యూఆర్‌ కోడ్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాలు, భూములను జియో కో ఆర్డినేట్స్‌తో హద్దులు నిర్ణయిస్తున్నానంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో.. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినవే.

» జగన్‌కు ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకు థ్యాంక్స్‌ కూడా చెప్పరు. వాస్తవానికి సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్‌ స్టేషన్లు, రోవర్స్‌ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్‌ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్‌బుక్‌లో క్యూఆర్‌ కోడ్, జీయో ట్యాగింగ్‌ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది? ఇవన్నీ చంద్రబాబు చెప్పరు. 

»   సచివాలయ వ్యవస్థలో 15 వేల మంది సర్వేయర్లు, వారితో పాటు రెవెన్యూ, డిజిటల్‌ అసిస్టెంట్లు లేకుండా ఈ పనులన్నీ అయిపోయాయా? అంత కష్టపడి పని చేసిన ఉద్యోగులకు కనీసం ప్రోత్సాహకం కల్పించకుండా వేధింపులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 50–60 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిపై కనీసం సానుభూతి ప్రదర్శించట్లేదు. సర్వేయర్లకు సస్పెన్షన్లు, వేధింపులు బహుమానంగా ఇస్తున్నారు. చిక్కటి చిరునవ్వులతో ప్రోత్సహించి పనులు చేయించుకోవాల్సిన చోట చావులకు పురిగొల్పుతున్నారు. ఇదీ చంద్రబాబు పాలన.

సున్నా వడ్డీకిదిక్కు లేదు
»  ఒకవైపు సున్నా వడ్డీకి దిక్కు లేదు. మరొకవైపు ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. ఇంకోవైపు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఇవేమీ చేయకుండా మహిళా దినోత్సవం రోజున అక్క­చెల్లెమ్మలను పారిశ్రామికవేత్తలను చేస్తామంటూ చంద్రబాబు కోతలు కోస్తున్నారు. మహిళా సాధికారత కోసం మా హయాంలో అమూల్, ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, హిందుస్థాన్‌ లీవర్, ఐటీసీ, రిలయన్స్‌ వంటి బహుళ జాతి సంస్థలను తీసుకొచ్చాం.

»  బ్యాంక్‌ లింకేజ్‌తో టై అప్‌ చేసి ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారి చేయడం కోసం మా ప్రభుత్వ హ­యాంలో ఆసరా, చేయూ­త, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వాహన మిత్ర, సున్నా వడ్డీ.. ఇలా అనేక పథకాలు అమలు చేసి అక్కచెల్లెమ్మలను నిలబెట్టే కార్యక్రమం చేస్తే.. చంద్ర­­బాబు ఇవన్నీ రద్దు చేసి వాళ్లను మోసగించారు. 

»  మా హయాంలో అక్కచెల్లెమ్మలకు రుణాలు ఏటా పెరిగాయి. 2020–21లో రూ.20,808కోట్లు, 2021­­­­–22లో రూ.33,568 కోట్లు, 2022–23లో రూ.38,014 కోట్లు, 2023–24లో రూ.49,626 కోట్లకు పెంచుకుంటూ పోతే.. చంద్రబాబు హయాంలో రూ.41,623 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది రూ.30,698 కోట్లకు దిగజారిపోయింది. మహిళా సాధికారత కాదు.. మహిళలను నాశనం చేస్తున్నారు.

» త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని చంద్ర­బాబు ఇప్పుడు చెబుతున్నారు. కనీసం మేము మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడిగితే మాట్లాడడు. కానీ, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్క అక్కచెల్లెమ్మకు ఒక్క గజం స్థలం ఇచ్చాడా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. 

» మేము 31 లక్షల పట్టాలిచ్చి, 21 లక్షల ఇళ్లు మంజూరు చేసి, 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లకు ఇవ్వకుండా ని«ధులు మళ్లించాడు. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. ఉన్న ఇళ్లను పూర్తి చేయమంటే.. త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అంటాడు. 

మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి ఆదివాసీలకు రూ.లక్ష, కొండ ప్రాంతంలో కాకుండా కిందనున్న ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలు, చేనేతలకు రూ.50 వేలు చొప్పున అదనంగా ఇస్తామన్నాడు. రెండేళ్లలో ఒక్కరికైనా ఒక్క పైసా అయినా ఇచ్చాడా? ఇవ్వలేదు. దీనిపై గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు.

ఐఆర్‌ ఏదంటే ఉలకట్లేదు 
అధికారంలో వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ (మధ్యంతర భృతి) ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటికీ అతీగతీ లేదు. అసలు పీఆర్సీ ప్రస్తావన తేవట్లేదు. నాలుగు పెండింగ్‌ డీఏలు, డీఆర్‌లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుచేయాలంటూ విజయవాడలో ధర్నా చేస్తుంటే.. అర్ధరాత్రి పూట పోలీసులతో దాడి చేయించి అక్కడి నుంచి ఎత్తించేశారు.

పాలు, నీళ్లు తాగినా చావులే!
» చంద్రబాబు పాలనలో పాలు తాగినా, నీళ్లు తాగినా ప్రజలు మృత్యువాత పడుతున్నారు. స్కూళ్లు, హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్ట­ట్లేదు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. నాడు–నేడు ఎత్తేయడంతో కలుషితమైన తాగు నీరు, ఆహారం తిని పిల్లలు చనిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థతి. జీరో వెకెన్సీ పాలసీ గాలికి వదిలేశారు. 17 కొత్త బోధనాస్పత్రులను స్కాముల కోసం పనులు నిలిపివేశారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్‌ క్లినిక్, ఆస్పత్రుల్లో జీఎంపీ మందుల మాట దేవుడెరుగు సాధారణ మందుబిళ్ల కూడా దొరకట్లేదు.

కళ్లార్పకుండా అబద్ధాలు 
» ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ఎత్తేశారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఆపేశారు. గోరుముద్దకు అన్యాయం చేశారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే ప్రభుత్వ స్కూళ్లలో జీఈఆర్‌ శాతం తగ్గిపోయింది. 2023–24లో దాదాపు 43 లక్షల మంది ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో విద్యను అభ్యసిస్తే.. చంద్రబాబు వచ్చిన తర్వాత ఏకంగా 33 లక్షలకు పడిపోయింది. అంటే 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు.

» సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అమలు చేయరు. మా ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచకుండా, కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. 

» ఇంత విధ్వంసాన్ని సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు తాపీగా ప్రతి జంట ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. చివరికి చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రతి జంటకు రూ.లక్ష ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కానీ, మూడో బిడ్డను కంటే డబ్బులు ఇస్తారట! చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు.కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడంలో చంద్రబాబుకు తగ్గ తనయుడు పుట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement