హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan Fires On Chandrababu Naidu Govt | Sakshi
Sakshi News home page

హామీలపై నోరు మెదపరేమి? : వైఎస్‌ జగన్‌

Mar 12 2026 5:07 AM | Updated on Mar 12 2026 6:11 AM

YSRCP President YS Jagan Fires On Chandrababu Naidu Govt

మూడు బడ్జెట్లు పెట్టినా సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీల ఊసెత్తడం లేదెందుకు?

ఉన్న పథకాలన్నీ రద్దు చేసి.. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవ్వక మోసం చేశారు 

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

బాకీపడ్డ నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారు? 

ఆడబిడ్డ నిధి బకాయి ఒక్కొక్కరికి రూ.54 వేలు ఎప్పుడిస్తారు? 

50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ పథకం మాటేంటి? 

నెలకు రూ.4 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.1.44 లక్షలు ఎప్పుడిస్తారు? 

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో చెప్పకుండా ఉన్న పింఛన్లలోనే కోతలా? 

ఇప్పటికే 5,64,709 పింఛన్లు కట్‌.. త్వరలో మరో 7.46 లక్షల పింఛన్లు కోత!  

అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20 వేలు ఎవరికిచ్చారు? 

రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలే ఇచ్చి రూ.30 వేలు ఎగవేత

తల్లికి వందనం తొలి ఏడాది పూర్తిగా ఎగనామం.. రెండో ఏడాది అరకొర 

మరోవైపు తగ్గిన ప్రభుత్వ ఆదాయం.. రికార్డు స్థాయిలో పెరిగిన అప్పులు  

ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు రూ.3.31 లక్షల కోట్లు  

ఈ రెండేళ్లలోనే రూ.3.20 లక్షల కోట్లు దాటిన బాబు సర్కార్‌ అప్పులు 

దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన రాష్ట్ర ఆదాయం  

అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నలకు ఒక్కదానికీ సమాధానమివ్వని ప్రభుత్వం 

మహిళలకు మళ్లీ మోసం.. 
సూపర్‌ సిక్స్, సెవెన్‌ అని మోసం చేశావ్‌.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మళ్లను అన్ని విధాలా దగా చేశావ్‌.. మహిళలకు అందించిన పథకాలన్నీ రద్దు చేశావ్‌. ఆఖరికి సున్నా వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచించావ్‌.. ఇప్పుడు మరోసారి మభ్యపెడుతున్నావ్‌.. మహిళలకు ఆడబిడ్డ నిధి ఎప్పుడు ఇస్తారు?   

ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ‘ఐఆర్‌’ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. పీఆర్సీ ప్రస్తావనే లేదు. నాలుగు పెండింగ్‌ డీఏలు ఎప్పుడిస్తారో స్పష్టత లేదు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, 
రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్, సరెండర్‌ లీవ్స్‌ కింద ఉద్యోగులకు రూ.35 వేల కోట్లు బాకీపడ్డారు. చివరికి ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలనూ నెరవేర్చకుండా పోలీసులతో దాడి చేయించారు.

నెయ్యిపై దుమారం రేపి.. స్కామ్‌లు
తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టెండర్లను గమనిస్తే రూ.200 కోట్ల స్కామ్‌ బయటపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఏడాదిలోనే కిలో నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచేశారు. ఇది ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని స్కామ్‌. దేవుడంటే భయభక్తులు లేకుండా.. ఒక పక్కన నెయ్యిపై దుమారం రేపి.. అదే నెయ్యిని అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తున్నారు. 

ఇదేనా తాట తీయడం? 
తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు.. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబూ! టీటీడీ చైర్మన్‌ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో దొరికిపోతే ఏం చేశావ్‌ బాబూ?  కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై టీడీపీ ఎమ్మెల్యే కూన వేధింపుల మీద చర్యలేవి?  
– మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ హామీలను ఎప్పుడు అమలు చేస్తారు? మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఉద్యోగులకు మీరు బకాయి పడిన నిధులు ఎప్పుడు ఇస్తారు? బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సమయంలో నేను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదెందుకు?’ అంటూ సీఎం చంద్రబాబు­ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ‘బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్లీ అడుగుతున్నా.. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. 

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చీ రాగానే 2024 జూన్‌ నుంచే అమలులోకి వస్తాయన్నారు. హామీల పేరిట బాకీ పడ్డ సొమ్ములు ఎప్పుడిస్తావు? అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు’ అంటూ నిలదీశారు.   గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆటలు.. పాటలు.. స్కిట్‌లతో కాలక్షేపం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎన్ని­కల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎత్తిచూపు­తూ.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోలు ప్రదర్శిస్తూ.. పత్రికల్లో ఇచ్చి­న ప్రకటనలను గుర్తు చేస్తూ.. ఆ హామీల అమలుకు బడ్జెట్‌లో కేటాయింపులను వివరిస్తూ.. ప్రజ­లకు చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న మోసాన్ని ఆధారాలతో సహా చూపుతూ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అన్నదాత సుఖీభవ.. నిలుపునా మోసం
పీఎం కిసాన్‌ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేలు ఇస్తామన్నాడు (గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చే రూ.6 వేలు కాకుండా ప్రతి ఏటా రైతుకు రూ.20 వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ప్రదర్శించారు). తొలి ఏడాది ఎగ్గొట్టాడు. రెండో ఏడాది రూ.20 వేలకు గాను అప్పుడో రూ.ఐదు వేలు.. అప్పుడో రూ.ఐదు వేలు ఇచ్చాడు. అంటే రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. మా హయాంలో 53.58 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వారి సంఖ్యను 46.85 లక్షల మందికి కుదించేశారు. దాదాపు 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా కౌలు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఈ బాకీ సొమ్ములు ఎప్పుడిస్తావు అని అడిగితే అసెంబ్లీ సమావేశాల్లో నోరు మెదపలేదు. 

⇒ 2023–24 ఖరీఫ్‌కు సంబంధించి 2024 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున ఇన్సూ రెన్స్‌ ప్రీమియం కట్టి ఉంటే.. కేంద్రం ఇవ్వాల్సింది జత చేసేది. ఆ వెంటనే రైతులకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు బీమా పరిహారం చెల్లించేవి. ఈ పెద్దమనిషి 2024 జూన్‌లో ప్రీమియం డబ్బులు కట్టక పోవడంతో రైతులు రూ.1,324 కోట్లు నష్టపోయారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్ల 2023–24, 2024–25 సీజన్లలో రూ.3,500 కోట్ల మేర బీమా పరిహారం నష్టపోయారు. ఇది ఎప్పుడు ఇస్తారని అడిగితే సమాధానం లేదు. 

⇒ అక్టోబర్‌లో మోంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని అడిగితే వీళ్ల నోటి నుంచి ఒక్క మాట రాదు. 
⇒ మా ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు పెట్టి.. రూ.7,500 కోట్లు వెచ్చించి అండగా నిలిచాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి ఎకరాలో సాగైన ప్రతి పంటను ఈ–క్రాప్‌లో నమోదు చేసేవాళ్లం. ఏ రైతుకు అయినా తాను వేసిన ఏ పంటకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే సీఎం యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌) ద్వారా పర్యవేక్షిస్తూ ధరలు పడిపోయినా ప్రతిసారీ ఆదుకున్నాం. పైగా ప్రతీ ఆర్బీకేలో ప్రతి పంటకు నిర్దేశించిన మద్దతు ధరలతో బోర్డులు పెట్టి దళారుల వెన్నులో వణుకు పుట్టించేవాళ్లం. అంతకంటే తక్కువ రేటుకు కొనేందుకు సాహసిస్తే.. వెంటనే స్పందించేవాళ్లం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. ఇంత దారుణమా.. రైతులంటే ఇంత చులకనేంటయ్యా.. అని అడిగితే సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు.

ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు
⇒ గతేడాది వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, శనగలు, మిర్చి, టమాటా, చీనీ, పత్తి అన్ని పంటలకు ధరలు పడిపోతే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్లీ మిర్చి, శనగ, అరటి, మొక్కజొన్న పంటలకు ధరలు పడిపోయాయి. నెల క్రితం క్వింటా రూ.26 వేలున్న మిర్చి.. ఈ రోజు రూ.18 వేలకు పడిపోయింది. శనగ కనీస మద్దతు ధర రూ.5,875.. రైతులకు రూ.5 వేలకు మించి రావడం లేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 అయితే, రైతులు కేవలం రూ.1400–1500కు అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క పంటపైనే రూ.3,500 కోట్లు నష్టపోతున్నారు.

⇒ అరటి ఈ ఏడాది కూడా టన్ను రూ.5 వేలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో టన్ను రూ.30 వేలు పలుకగా, ఈ రోజు రూ.5 వేలకు తెగనమ్ముకుంటున్నారు. టమాటా కిలో రూ.2కు అమ్ముకోవాల్సి వస్తోంది. బత్తాయి, పుచ్చకాయ, మస్క్‌మెలన్, సజ్జలు ఇలా అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి రైతులకు తోడుగా నిలవాల్సింది పోయి బడ్జెట్‌లో రూ.300 కోట్లు పెట్టారు. ఇంత తక్కువ ఎందుకు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు.

⇒ రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆటలు, పాటలు, స్కిట్‌లతో కాలక్షేపం చేశారు. అసెంబ్లీలో వీళ్ల ప్రవర్తన చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. వ్యవసాయ రంగం ఎంత సంక్షోభంలో ఉందంటే.. వందలాది మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2025–26లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. వీరికి పరిహారం ఎప్పుడు ఇస్తారని అడిగితే అసెంబ్లీలో ఒక్క మాట చెప్పలేదు. కనీసం వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతుల కష్టాలపై అసెంబ్లీలో చర్చించడం, వారికి భరోసా కల్పించడం మచ్చుకైనా చేయలేదు.

మరో 7.46 లక్షల పింఛన్లు కోత వేయబోతున్నారు
⇒ 2024 ఎన్నికల షెడ్యూల్‌ నాటికి మార్చిలో మేము ఇచ్చిన పింఛన్ల సంఖ్య 66,34,372. ఈ నెలలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య 60,69,664. అంటే ఇప్పటికే 5,64,708 పింఛన్లు కట్‌ చేశారు. 2026 ఫిబ్రవరిలో 60,96,108 మందికి పింఛన్లు ఇస్తే.. మార్చిలో 60,69,664 మందికి ఇచ్చారు. అంటే ఈ ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్‌ చేశారు. ఇలా ప్రతీ నెలా పింఛన్లు కట్‌ చేసూ్తనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛన్‌ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద పింఛన్‌ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

⇒ కొత్త పింఛన్ల మంజూరు కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మా హయాంలో ప్రతి ఆర్నెల్లకోసారి జూన్, డిసెంబర్‌లలో పింఛన్లు అప్‌డేట్‌ చేసే వాళ్లం. ఈరోజు ఆ పరిస్థితి కన్పించడం లేదు. కనీసం మార్చిలో ఇచ్చిన పింఛన్ల సంఖ్యను బట్టి చూసినా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.31,554 కోట్లు పెట్టాలి. కానీ బడ్జెట్‌లో పెట్టింది కేవలం రూ.27,719 కోట్లు. అంటే మరో 7,45,993 పింఛన్లు కట్‌ చేయబోతున్నామని చెప్పకనే చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని, బడ్జెట్‌లో ఎందుకు తగ్గించి చూపిస్తున్నారో చెప్పాలని అడిగాం. 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా లేదు.

తల్లికి వందనం పేరిట దగా
⇒ తల్లికి వందనం కింద చదువుకునే ప్రతీ పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు పథకాన్ని కత్తిరించారు. యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (యూడీఐఎస్‌ఈ–యూడైస్‌) ప్రకారం 2023–24లో బడికి వెళ్లే పిల్లలు 87,41,885 మంది ఉన్నారు. కానీ ఇచ్చింది 67 లక్షల మందికే.

తల్లికీ వంచనే.. 

యూడైస్‌ ప్లస్‌ ప్రకారం 87,41,885 మంది పిల్లలకు తల్లికి వందనం కింద రూ.13,112 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.8,456.48 కోట్లు మాత్రమే 

⇒ పైగా ఏ ఒక్కరికి రూ.15 వేలు ఇవ్వలేదు. కొంత మందికి రూ.8 వేలు, మరికొంత మందికి రూ.9 వేలు, ఇంకొంత మందికి  రూ.10 వేలు, అక్కడక్కడా అతి కొద్ది మందికి రూ.13 వేలు చొప్పున ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులతో పాటు రెండో ఏడాది ఇవ్వాల్సిన మిగిలిన డబ్బులు ఎప్పుడిస్తారని అడిగితే సమాధానం లేదు. 

⇒ ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. తీరా ఇప్పుడు షరతులు పెట్టారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులుంటే కేవలం 5 రకాల సర్వీసులకే పరిమితం చేశారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టారని అడిగితే నోరు మెదపడం లేదు. 

⇒ దీపం పథకం కింద ప్రతి మహిళకు మూడు గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ అన్నారు. తొలి ఏడాది ఒక సిలిండర్‌కే ఇచ్చి మిగిలిన రెండు సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టారు. గ్యాస్‌ కంపెనీల డేటా ప్రకారం రాష్ట్రంలో కోటి 59 లక్షల కనెక్షన్లున్నాయి. ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.­855 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలి. అంటే మూడేళ్లకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ తొలి ఏడాది రూ.786 కోట్లు ఖర్చు చేశారు. రెండో ఏడాది రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌లో రూ.­2,199 కోట్లుగా చూపించారు. ఇచ్చారో లే­దో కూడా తెలియదు. ఈ బడ్జెట్‌లో రూ.­2,600 కోట్లు పెట్టారు. మరి రూ.12 వేల కోట్లకు గానూ ఇచ్చింది సగం కూడా లేదు. ఈ పథకం కింద మహిళలకు రూ.6,144 కోట్లు బాకీ పడ్డారు. ఈ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని అడిగితే నోరు మెదపడం లేదు.

నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఏమైంది?
⇒ యువగళం పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏటా రూ.36 వేల చొప్పున మూడేళ్లకు ప్రతి నిరుద్యోగికి బాకీపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు ఇస్తారో 
చెప్పమంటే నోరు మెదపడం లేదు. 

ఆడబిడ్డలకూ తీవ్ర అన్యాయం 

రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల వయసు గల మహిళలు 1,78,99,440 మంది ఉండగా.. ఒక్కరికి కూడా ఆడబిడ్డ నిధి కింద ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు 

⇒ సూపర్‌ సిక్స్‌లో రెండో కీలకమైన హామీ..18 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పైబడిన వారిని తీసేస్తే 1,78,99,440 మంది అర్హులు. వీరికి ప్రతి నెలా రూ.1,500.. ఏడాదికి రూ.18 వేలు చొప్పున మూడేళ్లకు బాకీ పడ్డ రూ.54 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీస ప్రస్తావన కూడా చేయలేదు. 

⇒ మరో ముఖ్యమైన హామీ.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ పథకం. ఈ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.48 వేలు..ఇలా మూడేళ్లలో రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారని అడిగితే కనీసం మాట్లాడటం లేదు.

ప్రతినెలా 25 వేలకు పైగా పింఛన్ల కోత  

వైఎస్‌ జగన్‌ 2024 మార్చిలో 66,34,372 మందికి పింఛన్లు ఇవ్వగా.. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో పింఛన్లు ఇచ్చినది 60,69,664 మందికి మాత్రమే  

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. 
ఆరోగ్యశ్రీ పథకం నడవాలంటే బకాయిలతో కలిపి రూ.7,150 కోట్లు కావాలి. బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించిన చంద్రబాబు గతంలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో సేవలు ఆగిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్లైనా లేదు. పిల్లల చదువులెలా  సాగుతాయి? 

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద బకాయిలతో కలిపి మొత్తం రూ.10,328 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు రూ.2,766 కోట్లు మాత్రమే. ఇలా అయితే పిల్లల చదువులు ఎలా సాగుతాయి? ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు.    

పెన్షన్లు కటింగ్‌...
50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ హామీని నెరవేర్చకుండా మూడేళ్లలో ఒక్కొక్కరికీ రూ.1.44 లక్షలు బాకీ పడ్డారు. మరోవైపు సామాజిక పెన్షన్లు ఇప్పటికే 5,64,708 కట్‌ చేశారు. ఒక్క నెలలోనే 26 వేల పింఛన్లు కట్‌ చేశారు. ప్రతీ నెలా పింఛన్లు కట్‌ చేస్తూనే ఉన్నారు. కొత్తగా ఒక్క పింఛనూ ఇవ్వలేదు. పింఛన్‌ కోసం 2.50లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్‌ కేటాయింపులను బట్టి మరో 7,45,993 పింఛన్లు కట్‌ చేయబోతున్నామని చెప్పకనే చెబుతున్నారు. 

50 ఏళ్లకే పింఛన్‌ ఇంకెప్పుడు? 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామని ఎన్నికల ముందు పచ్చ పత్రిక ఈనాడులో చంద్రబాబు ఇచ్చిన ప్రకటన 

అన్నదాతకు దగా...
పీఎం కిసాన్‌ కాకుండా అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామన్నాడు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలు ఇచ్చాడు. ఒక్కో రైతుకు రూ.30 వేలు బాకీ పడ్డారు. 7 లక్షల మందికి ఎగ్గొట్టారు. కౌలు రైతులకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు కూడా ఒక్క పైసా ఇచ్చింది లేదు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులను గాలికొదిలేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర లేదు. ధరల స్థిరీకరణ నిధికి తూట్లు పొడిచారు. రైతులు ఇంత దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆటపాటలు, స్కిట్‌లతో కాలక్షేపం చేశారు. 

ఇళ్లపై దొంగ మాటలు..
మేం 31 లక్షల పట్టాలిచ్చి 21 లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేశాం. 10 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన డబ్బులను చంద్రబాబు మళ్లించడంతో ఈ పథకం ఆగిపోయింది. కనీసం మేం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటే త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని దొంగ మాటలు చెబుతున్నారు. ఈ రెండేళ్లలో ఒక్క అక్క చెల్లెమ్మకైనా గజం స్థలం ఇచ్చారా? ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు.

ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయి?
జగన్‌కు ఎలాంటి క్రెడిట్‌ ఇవ్వడం చంద్రబాబుకు నచ్చదు. కనీసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులకూ థ్యాంక్స్‌ చెప్పరు. సర్వేయర్ల వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ ఎవరి వల్ల వచ్చింది? సర్వే పరికరాలు, కోర్‌ స్టేషన్లు, రోవర్స్‌ ఎవరు తీసుకొచ్చారు? విమానాలు, హెలికాప్టర్లలో సర్వేలు ఎవరి హయాంలో జరిగాయి? ఓఆర్‌ఐ రికార్డులు, సర్వే అనంతరం హద్దుల్లో పాతడానికి కోట్ల హద్దు రాళ్లు ఎవరి హయాంలో సమకూర్చారు? పాస్‌బుక్‌లో క్యూఆర్‌ కోడ్, జియో ట్యాగింగ్‌ హద్దు నిర్ణయం ఎవరి హయాంలో ప్రారంభమైంది?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement