బాబు ఆర్థిక విధ్వంసం..
చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు
బాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు జాయింట్‌గా దోచుకుంటున్నారు
ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే
ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి?
365 రోజుల్లో ప్రభుత్వ ఖజానాలో 8 రోజులు మాత్రమే కనీస నగదు నిల్వలు
మిగిలిన 357 రోజులూ వడ్డీలు కడుతూ.. అప్పులతోనే బండి లాగించారు
మా హయాం కంటే రెవెన్యూ లోటు 56 శాతం, అప్పులు 30 శాతం పెరిగాయి
ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులు రూ.3.31 లక్షల కోట్లు
ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటాయి
2023–24లో మొత్తం వ్యయంలో అప్పులు 26.52 శాతానికి పరిమితం
బాబు పాలనలో 2024–25లో 32.55 శాతం, 2025–26లో 39.74 శాతానికి ఎగబాకాయి
మా ప్రభుత్వంలో 2019–24 మధ్యలో జీఎస్‌డీపీలో సగటు అప్పుల శాతం 4.11 మాత్రమే
బాబు సర్కారు మొదటి ఏడాదిలోనే జీఎస్‌డీపీలో అప్పులు 5.08 శాతానికి చేరాయి
కోవిడ్ లాంటి పరిస్థితులున్నా మేం ఎన్‌బీసీ కంటే రూ.12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం
చంద్రబాబు సర్కార్ ఎన్‌బీసీ కంటే 2014–19లో రూ.29,099 కోట్లు, ఇప్పుడు రూ.17,953 కోట్లు అధికంగా అప్పులు చేసింది
బాబు ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలు
కాగ్ నివేదిక ప్రకారం 2024–25లో రూ.81,082 కోట్ల అప్పులు చేస్తే.. అసెంబ్లీలో రూ.60,485 కోట్లుగా చూపించారు
రూ.20,000 కోట్ల అప్పులను దాచిపెడుతూ.. అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు
తప్పుడు లెక్కలతో అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై డీవోపీటీ, కేంద్ర ఆర్థిక కార్యదర్శికి ఫిర్యాదు చేస్తున్నాం
16 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై నా ప్రశ్నలకు ఒక్కదానికీ ప్రభుత్వం సమాధానమివ్వలేదు
కాగ్ నివేదిక, బడ్జెట్ ప్రతులు, అసెంబ్లీకి ప్రభుత్వం ఇ చ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ చంద్రబాబు సర్కారు ఆర్థిక విధానాలను ఎండగట్టిన వైఎస్ జగన్
రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి, డీవోపీటీకి లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై లేఖ రాస్తున్నాం.
ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జెటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు.. ఇవి మినహా ఏమైనా మంచి జరిగిందా అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా.
చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే. ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తెచ్చినా ఎలా సరిపోతాయి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఆర్థిక విధ్వంసం సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అంతా కలిసి దోచుకుంటుండడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పడిపోతున్నాయని, మరోవైపు రాష్ట్ర అప్పులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వ హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను రక్షించుకోవడానికి అదనంగా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సివ చ్చినప్పటికీ.. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించామని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి విపత్కర పరిస్థితులేవీ లేనప్పటికీ.. కేంద్రం విధించిన పరిమితి (నెట్ బారోయింగ్ సీలింగ్)కి మించి ఎడాపెడా అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ తాను పరిపాలనా దక్షుడినంటూ చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు.
అప్పులపై అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శిపై చర్యలు కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి, డీవోపీటీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్)కి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. కాగ్ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక.. బడ్జెట్ ప్రతులు.. అసెంబ్లీకి ప్రభుత్వం రాతపూర్వకంగా ఇ చ్చిన సమాచారం ప్రతులను ఉటంకిస్తూ చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను ఎండగట్టారు.
2026–27 బడ్జెట్‌లో లోపాలను ప్రస్తావిస్తూ.. మేనిఫెస్టోలో ఇ చ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ తాను అడిగిన ప్రశ్నలకు.. 16 రోజులపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తండ్రీ, కుమారుడు పరస్పరం జాకీలు ఎత్తుకుంటే.. వారిద్దరి జాకీలను పవన్‌కళ్యాణ్ ఎత్తడమే సరిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు..
రాష్ట్ర ప్రజలు చంద్రబాబు సర్కారుకు ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇక రెండు మాత్రమే ప్రవేశపెట్టే అవకాశముంది. గతనెల 19న జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నాడన్న విషయాన్ని సవివరంగా చెప్పా. ఆ రోజు నేను అడిగిన ప్రశ్నలను ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
మా ప్రభుత్వంలో చివరి ఆర్థిక ఏడాది (2023–24)ని.. కాగ్ ఆడిటింగ్ జరిగిన చంద్రబాబు నాయుడు తొలి ఏడాది (2024–25)తో పోలిస్తే తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2023–24లో ప్రభుత్వ వ్యయం రూ.2,36,486 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం (సొంత పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్–ఇన్–ఎయిడ్) రూ.1,73,767 కోట్లు. చంద్రబాబు సర్కార్ తొలి ఏడాది 2024–25లో ప్రభుత్వ వ్యయం రూ.2,49,096 కోట్లు. ఇందులో రాష్ట్ర ఆదాయం రూ.1,68,024 కోట్లు. 2023–24లో రూ.1,73,767 కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం 2024–25లో రూ.1,68,024 కోట్లకు పడిపోయింది.
అంటే మా ప్రభుత్వం కంటే బాబు తొలి ఏడాదిలో రాబడులు తగ్గిపోయాయి. ఇదే సమయంలో రెవెన్యూ లోటు ఏకంగా 56 శాతం పెరిగి రూ.38,682 కోట్ల నుంచి రూ.60,285 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు.. అంటే చేసిన అప్పులు 30 శాతం పెరిగి రూ.62,719 కోట్ల నుంచి రూ.81,071 కోట్లకు చేరింది. అయినా కూడా మొదటి ఏడాది సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్ హామీలు అమలు చేయకపోగా గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను రద్దు చేశారు. చంద్రబాబు హయాంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
2024–25 తర్వాత కూడా రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెంచుకుంటూనే పోతున్నారు. 2019–20లో మా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఐదేళ్ల కాలంతో ఇప్పటి ప్రభుత్వంలో 2024–25, 2025–26లోని పది నెలలతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా అప్పులు ఏ విధంగా పెరిగాయో తెలుస్తుంది. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులున్నా, ప్రజలను కాపాడుకోవడానికి అదనంగా వ్యయం చేయాల్సి వ చ్చినా మేనిఫెస్టోలో చెప్పిన అన్ని పథకాలను కూడా అమలు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాం. కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా, ఎలాంటి స్కీమ్‌లు అమలు చేయకున్నా అప్పులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
2023–24లో రాష్ట్రం మొత్తం వ్యయంలో అప్పులు 26.52 శాతంగా ఉంటే అదే చంద్రబాబు తొలి ఏడాది 2024–25లో 32.55 శాతానికి, 2025–26లో మొదటి పదినెలల్లో 39.74 శాతానికి ఎగబాకాయి. అంతేకాకుండా మా ఐదేళ్ల పరిపాలనలో జీఎసీడీపీలో అప్పులు సగటున 4.11 శాతంగా ఉంటే 2024–25లో జీఎసీడీపీలో అప్పులు 5.08 శాతానికి చేరాయి. చంద్రబాబు ఆర్థిక విధ్వంసానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.. ఆధారాలు!!
దోచుకో.. పంచుకో.. తినుకో..
చంద్రబాబు అధికారంలోకి వస్తే రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు (అప్పులు) ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణం.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. చంద్రబాబు, బినామీలు, ఎమ్మెల్యేలు, ఎల్లో మీడియా యాజమాన్యాలు అందరూ కలిసి జాయింట్‌గా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో..! అంటూ దోచుకుంటున్నారు కాబట్టే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్ ్జ, గ్రానైట్, లిక్కర్, పీపీఏలు.. అన్నింటా దోపిడీనే.
ఇలా అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమం, అభివృద్ధి ఎలా నడుస్తాయి? ఎంత అప్పులు తె చ్చినా ఎలా సరిపోతాయి? విశాఖలో అత్యంత విలువైన 54 ఎకరాలను, రూ.5,000 కోట్ల విలువైన భూమిని బాబు దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? రియల్ ఎస్టేట్ కంపెనీలకు శనక్కాయలు, బెల్లానికి భూములు ఇస్తున్నాడు. అంతేకాదు.. నిర్మాణ వ్యయంలో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈయన ఎదురు ఇస్తున్నాడు.
ఇలాంటి స్కామ్‌లు జరుగుతుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనడానికి ఇంకో ఉదాహరణ.. ట్రెజరీలో మినిమమ్ క్యాష్ బ్యాలెన్స్(కనీస నగదు నిల్వ) చూస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కనీస నగదు లేకపోతే ముందుగా ఎస్‌డీఎఫ్ తీసుకుంటారు. ఇదికూడా దాటితే వేస్ అండ్ మీన్స్.. అది కూడా దాటితే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళుతుంది. ఇవన్నీ వడ్డీతో కూడినవి. కోవిడ్ లాంటి ఏ కష్టాలూ బాబు హయాంలో లేనప్పటికీ 2024–25లో కనీస నగదు నిల్వ ఉన్నవి కేవలం 8 రోజులు మాత్రమే. 365 రోజుల్లో 357 రోజులు కనీస నగదు నిల్వ కూడా ఉంచలేదు.
చంద్రబాబు పరిపాలనకు, బిల్డప్‌కు తేడా స్పష్టంగా చూపించే మరో చిత్రపటం.. ట్రెజరీలోని ఈ కనీస నగదు నిల్వలు! ఒకవైపు మామీద తప్పుడు ప్రచారం చేస్తూ మరోవైపు ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ వాటిని బయటకు రానివ్వకుండా దాచేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024–25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు రూ.81,082 కోట్లు అని కాగ్ నివేదిక స్టేట్‌మెంట్ సిక్స్‌లో పేర్కొంది. కానీ అసెంబ్లీలో రూ.60,485 కోట్లు అప్పు చేసినట్లు చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలతో కూడిన సమాచారం ఇ చ్చింది. అంటే రూ 20,000 కోట్ల అప్పులు దాచిపెట్టి చూపిస్తున్నారు.
ఆత్మస్తుతి.. పరనిందే
రాష్ట్ర అప్పులపై తప్పుడు సమాచారం ఇ చ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తాం.. డీవోపీటీకీ లేఖ రాస్తాం. కాగ్ నివేదికలో పేర్కొన్న అప్పులు.. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అప్పులను చూపించి.. చంద్రబాబు కోసం కిందామీదాపడి దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంలో పాలుపంచుకున్నందుకు ఆ అధికారులపై డీవోపీటీకి, కేంద్ర క్యాబినెట్ సెక్రటరికీ, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి లేఖ రాస్తున్నాం.
ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు కాకుండా బడ్జెటేతర అప్పుల వివరాలు ఇవ్వాలని మండలిలో రాతపూర్వకంగా కోరితే ప్రభుత్వం దాటవేసే యత్నం చేస్తూ వివరాలు ఇవ్వలేదు. ప్రభుత్వ గ్యారంటీతో ఎన్నో అప్పులు తీసుకున్నారు. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. వీటిని బడ్జేటేతర అప్పులని కాకుండా ఏమంటారు? వీటిని మాత్రం చెప్పడం లేదు. అన్నీ దొంగచాటు వ్యవహారాలే.
బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, దుష్ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు మినహా ఏమైనా మంచి జరిగిందా? అని చూస్తే ప్రజలకు ఒరిగింది సున్నా. చంద్రబాబు తన కొడుకును జాకీ పెట్టి ఎత్తుతాడు. బాబు కొడుకేమో ఆయన్ను జాకీపెట్టి ఎత్తుతాడు.. వీళ్లిద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీ ఎత్తుతాడు. పరనింద.. ఆత్మస్తుతి మినహా 16 రోజుల సభలో ఏం జరిగింది? విలేకరుల సమావేశం నిర్వహించి బడ్జెట్‌పై గతంలో మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలేమయ్యాయి?
పరిమితికి మించి అప్పులు..
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నెట్ బారోయింగ్ సీలింగ్ (ఎన్‌బీసీ)కి లోబడి అప్పులు తీసుకోవాలి. చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన ప్రతిసారీ ఓవైపు ఎన్‌బీసీని ఉల్లంఘిస్తూ మరోపక్క పరిపాలనా దక్షుడిగా బిల్డప్ ఇస్తారు. 2014–19లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్‌బీసీ పరిమితి కంటే రూ.29,099 కోట్లు అధికంగా అప్పు చేశారు. అదే మా హయాంలో రెండేళ్ల పాటు కోవిడ్ ఉన్నా, ఆదాయాలు తగ్గినా, ప్రజలను కాపాడుకోవడం కోసం భారీగా ఖర్చు చేసినా, ఇ చ్చిన హామీలు అమలు చేసినా కూడా ఎన్‌బీసీ పరిమితి కంటే రూ. 12,708 కోట్లు తక్కువగా అప్పులు చేశాం.
ఇది మా ఐదేళ్ల ట్రాక్ రికార్డు. బాబు అధికారంలోకి రాగానే మళ్లీ సీన్ రివర్స్. తొలి ఏడాది ఎన్‌బీసీ కంటే రూ.17,953 కోట్లు అప్పులు ఎక్కువగా తీసుకొచ్చారు. 2025–26లో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. రెండేళ్లలో తె చ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. మా ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.31 లక్షల కోట్లు అయితే అప్పుడే ఈ రెండేళ్లలోనే రూ.3.20 లక్షల కోట్లు దాటాయి. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారన్నదానికి ఇదే నిదర్శనం.
ఆర్థిక సంఘం ఆదేశాలూ లెక్కలేదు

అయినా దుష్ప్రచారమే..! 
మహిళలను వేధించినా చర్యలు తీసుకోరా?
చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్
మహిళల జోలికొస్తే ఆ రోజే ఆఖరు రోజంటూ బిల్డప్ ఇస్తారా?
సామాన్య మహిళలు, ఉద్యోగులను వేధించిన టీడీపీ, జనసేన నాయకులపై చర్యలు ఏవి?
బాధిత మహిళలు స్వయంగా మీకే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదేం?
టీటీడీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి మహిళను మోసం చేసి అడ్డంగా దొరికితే ఏం చేశావు?
సాక్షి, అమరావతి: ‘మహిళల జోలికి వస్తే తాట తీస్తా... మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు అవుతుంది.. అని డైలాగులు వేసి వెళ్లిపోతున్నారు. స్వయంగా బాధిత మహిళలు మిమ్మల్ని కలిసి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. మహిళలపై దారుణాలకు పాల్పడ్డ కూటమి పార్టీ నేతల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు?’ అని సీఎం చంద్రబాబు వైఖరిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.
చంద్రబాబు ఏలుబడిలో రక్షణ కోసం ప్రాధేయపడిన బాధిత మహిళలపైనే తిరిగి పోలీసు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రతకు సంబంధించి సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మీ ఎమ్మెల్యేలపై చర్యలెక్కడ బాబు?
» రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేసి మోసం చేశారంటూ బాధిత మహిళ నేరుగా సీఎంకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?
» కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌పై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడితే చర్యలు ఎక్కడున్నాయి?
» మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసి, అసభ్యంగా ప్రవర్తించిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై చర్యలు ఎక్కడ?
» టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళపై దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే చంద్రబాబు ఎక్కడున్నారు?
» మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏను కూడా శిక్షించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు కనీసం రాజకీయ నాయకుల పీఏలపైనా చర్యలు తీసుకోవట్లేదు. తిరిగి బాధితురాలిపైనే కేసు పెట్టారు.
బాబుకు భయం, భక్తి లేదు
చంద్రబాబు పాలన అంటేనే.. మహిళలపై పాశవిక దాడులు, దారుణాలు, అఘాయిత్యాలకు కేరాఫ్‌గా మారిపోయింది. సాక్షాత్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోలు, ఫొటోలతో అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు ఏం చేశారు? టీటీడీ చైర్మన్‌ను ఎందుకు వదిలేశారు? ఇక్కడ విచిత్రం ఏమంటే.. తనను మోసం చేసిన వ్యక్తికి పదవులు ఇవ్వొద్దని, విచారించి చర్యలు తీసుకోవాలని బాధితురాలు గతంలోనే బాబుకు లేఖ రాశారు. అదిప్పుడు అక్నాలెడ్జ్‌మెంట్‌తో పాటు బయటకు వ చ్చింది. అయినా చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. మహిళలను వంచించే వ్యక్తులకు దేవుడి పట్ల భయం, భక్తి ఉండదు.
దేవాలయాల్లో భక్తుల మృత్యువాత!
చంద్రబాబు అధికారంలోకి వ చ్చిన తర్వాత ఆలయాల్లో భక్తులకు కనీస రక్షణ కల్పించట్లేదు. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయారు. సింహాచలం చందనోత్సవంలో గోడకూలి ఏడుగురు, పలాసలో తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోగా.. మొన్న కదిరి రథోత్సవంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తప్ప నిజంగా వీళ్లకు శ్రద్ధ ఎక్కడ ఉంది?


