ప్రతి సోమవారం హోటళ్లకు ‘వీక్లీ హాలిడే’ | Every Monday is a weekly holiday for hotels | Sakshi
Sakshi News home page

ప్రతి సోమవారం హోటళ్లకు ‘వీక్లీ హాలిడే’

Mar 12 2026 4:41 AM | Updated on Mar 12 2026 4:41 AM

Every Monday is a weekly holiday for hotels

గ్యాస్‌ కొరత నేపథ్యంలో స్విగ్గీ, జొమాటో ఆర్డర్ల నిలిపివేత 

ఏపీ హోటళ్ల జేఏసీ నిర్ణయం 

సాక్షి, అమరావతి: గ్యాస్‌ కొరత కారణంగా రాష్ట్రంలోని స్టార్‌ హోటళ్ల నుంచి జొమాటొ, స్విగ్గీ ఆన్‌లైన్‌ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తున్నట్టు హోటళ్ల అసోసియేషన్‌ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరతతో వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో వాణిజ్య గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో బుధవారం ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోసియేషన్, ఏపీ హోటల్స్‌ అసోసియేషన్‌ జేఏసీ సమావేశమైంది. 

అనంతరం ఏపీ స్టార్‌ హోటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, విజయవాడ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రమణ మీడి యాతో మాట్లాడుతూ.. గ్యాస్‌ కొరతతో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే హోటళ్లను మూసి వేయాల్సిందేనన్నారు. గురువారం నుంచి హోటళ్లలో గ్యాస్‌ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నిర్ణయించామన్నారు. స్టార్‌ హోటళ్లలో జొమాటో, స్విగ్గీ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామన్నారు. 

ముఖ్యంగా ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి ‘వీక్లీ హాలిడే’గా ప్రకటిస్తామన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్‌ కేవలం టీ, కాఫీ మాత్రమే విక్ర యించే పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి 10 గంటల వర కే రెస్టారెంట్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లను నడిపేలా చూడా లని ప్రభుత్వాన్ని కోరారు. గ్యాస్‌ ఏజెన్సీలు వాణిజ్య గ్యాస్‌ నిల్వలు నిండుకున్నాయని చెప్పడంతో హోటళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మరోవైపు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్న గ్యాస్‌ను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. వాణిజ్య గ్యాస్‌ నిలిపివేత నిర్ణయంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, హాస్పిటాలిటీని ప్రాధాన్యతగా గుర్తించాలని కోరారు.    

Advertisement
 
Advertisement
Advertisement