ఎన్ని కుట్రలు సృష్టించినా వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్‌ | KTR Serious Comments on Congress And BJP Over Medigadda | Sakshi
Sakshi News home page

ఎన్ని కుట్రలు సృష్టించినా వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్‌

May 28 2025 1:50 PM | Updated on May 28 2025 5:57 PM

KTR Serious Comments on Congress And BJP Over Medigadda

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదికపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే అంటూ విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక  అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే.

నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం.

కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల  ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు.

పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారు.

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.

ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన  గుణపాఠం చెప్పడం ఖాయం’ అంటూ హెచ్చరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement