పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్‌ | Revanth Reddy Meets AICC Chief Kharge In Delhi, Expresses Confidence Of Congress Sweeping Telangana Municipal Elections | Sakshi
Sakshi News home page

పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్‌

Feb 12 2026 5:47 AM | Updated on Feb 12 2026 11:05 AM

CM Revanth Reddy Comments On Municipal Elections with Mallikarjun Kharge

మల్లికార్జున ఖర్గేకు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లడి 

అదే ఊపుతో ముందుకెళ్లాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

రాష్ట్ర రాజకీయాలపై నేతల చర్చ

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్రంలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్‌లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్‌ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్‌ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్‌ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్‌ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. 

బీఆర్‌ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి 
ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్‌కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.  

నేడు కేంద్ర మంత్రులతో భేటీ 
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement