సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నోటికి తోచింది మాట్లాడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 300 రూపాయలకే స్వచ్చమైన నెయ్యి ఎవరు అందిస్తారు.. అది కల్తీ నెయ్యి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గతంలో హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నెయ్యి సంగతేంటి?. ఇందాపూర్‌లో కల్తీ జరిగిందా? అని ప్రశ్నించారు. అసలు నిజాలు బయటకు వస్తున్నాయి అని కామెంట్స్ చేశారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ గురించి వెలుగులోకి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ఫ్రాంచైజీ సంస్థ. 2015లో రూ.278కే నెయ్యి సరఫరా చేసింది. 2016లో ఇందాపూర్ సంస్థ డిస్ క్వాలిఫై అయ్యింది. కానీ, 2025 డిసెంబర్ 16న కేజీ నెయ్యి రూ.658కి ఇందాపూర్ సంస్థ దక్కించుకుంది. గతంలో 2013-19వరకు ప్రీమియర్ అగ్రి డైరీ నుంచి 40 లక్షలు కేజీల నెయ్యి సరఫరా చేశారు. ఈ నెయ్యి ఖరీదు దాదాపు 300లుగానే ఉంది. ఈ రెండు సంస్థలు 50 కోట్ల 40 లక్షలు నెయ్యి సరఫరా చేశాయి.
ఇందాపూర్‌లో సరఫరా చేసిన నెయ్యి కల్తీదా? అనే అనుమానాలు ఉన్నాయి. మీ హయంలో తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేసింది కల్తీనా?. రూ.300లకు సరఫరా చేసే నెయ్యి.. 658కి ఒకేసారి రెట్టింపు ధరకు ఎలా సాధ్యమైంది?. దీనిపై చంద్రబాబు, హెరిటేజ్ సంస్థ స్పందించాలి. స్వచ్చమైన నెయ్యి రెండు వేల అయితే కానీ రాదు అని చంద్రబాబు పదేపదే చెప్పారు కదా?. తక్కువ రేటుకు సరఫరా చేసిన నెయ్యి కల్తీదా అనిపిస్తోంది. హెరిటేజ్ సంస్థ అనే పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దాచేసినా దాగని సత్యం.. ఇప్పుడు బయట పడింది అని వ్యాఖ్యలు చేశారు.


