సాక్షి, విజయవాడ: సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భూములను కారుచౌకగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి లోకేశ్ విరుచుకుపడ్డారు. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున భూములు ఎన్ని కంపెనీలకిచ్చారని అడగడమే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల పాపమైపోయింది. లోకేశ్‌కు తోడుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరుపేరులేని ఉర్సా కంపెనీకి తాము స్థలాలు ఇవ్వనేలేదని బుకాయించే ప్రయత్నం చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు? అని ప్రశ్నించారు. అలాగే...
‘‘ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.మూడు వేల కోట్ల విలులైన భూమిని 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా?. విశాఖలోని ఓ విద్యాసంస్థ రూ.ఐదు వేల కోట్ల విలువైన భూములను తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము రూ.వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెబుతోంది. రూ.వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించకోవచ్చా?’’ అని నిలదీశారు.
రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు..
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారు. కానీ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములిస్తున్నారు. ఏపీఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు’’ అని ప్రశ్నించారు.
అవును.. 99 పైసలకే భూములిచ్చాం..
వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కేపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ... ‘‘151 సీట్లు ఉన్న మీకు 11 వచ్చాయి’’ అంటూ ఓవరాక్షన్‌కు దిగారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.
శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందే. వైజాగ్‌లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గీతంకి భూములు కేటాయింపులకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని బయటకు వచ్చారు.


