చుక్‌.. చుక్‌.. రైలు రాదాండీ! | Construction of Kotipalli Narsapuram railway line stalled after Chandrababu govt came to power | Sakshi
Sakshi News home page

చుక్‌.. చుక్‌.. రైలు రాదాండీ!

Feb 12 2026 5:52 AM | Updated on Feb 12 2026 5:52 AM

Construction of Kotipalli Narsapuram railway line stalled after Chandrababu govt came to power

నత్తనడకన కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్‌ నిర్మాణం 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిన పనులు 

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి 10 రోజులు దాటినా నిధులపై రాని స్పష్టత 

గతంలో నాలుగు రోజులకే కేటాయింపుల ప్రకటన 

‘‘నీవు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు’’ అన్నారు ఒక సినీ కవి. రైలు ఏమో కానీ కోనసీమ రైల్వే ప్రాజెక్టు తీరు తెన్నులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ప్రాజెక్టుకు శంకుస్థాపన రాయిపడి 26 ఏళ్లు కావస్తోంది. కాని రైలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2016–17 నుంచి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. కాని రెండేళ్లుగా మాత్రం కేటాయింపులు అరకొరగా ఉండడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతోందని కోనసీమ వాసులు ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, అమలాపురం: కాకినాడ– కోటిపల్లి– నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలో శంకుస్థాపన జరిగింది. 2014 వరకు అరకొర కేటాయింపులు జరిగాయి. తరువాత నుంచి బడ్జెట్‌ కేటాయింపులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కానీ ఖర్చు మాత్రం కావడం లేదు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించింది కేవలం రూ.1,035 కోట్లు. కాని ఖర్చు మాత్రం అరకొరగా సాగింది. గౌతమీ, వైనతేయ, వశిష్ఠ నదుల మీద పిల్లర్ల నిర్మాణ తీరు నత్తను తలపించింది. 

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 వరకు రూ.1,496 కోట్ల నిధులు బడ్జెట్‌లో కేటాయించారు. పనులు వేగంగా సాగి మూడు నదీపాయల మీద పిల్లర్లు పూర్తయ్యాయి. గౌతమీ నదిపై కోటిపల్లి– శానపల్లి లంక మధ్య 3.50 కిమీల వంతెనకు సంబంధించి పిల్లర్లు మీద వేయాల్సిన గడ్డర్లు, ఐరన్‌ రైలింగ్‌ వంటి ­నిర్మాణాలకు రూ.296 కోట్లకు టెండర్లు ఖరారయ్యాయి. భూసేకరణకు నాటి జగన్‌ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించడంతో సర్వే పనులు వేగంగా సాగాయి.  

ఏడాదిన్నరగా ప్రచారానికే పరిమితం 
రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రావడం.. కోనసీమ రైల్వే ప్రాజెక్టు పనులు పడకేయడం జరిగిపోయింది. గత ఏడాదిన్నరగా వశిష్ట నదీపాయపై ఒకటి రెండు పిల్లర్లు, వైనతేయ వద్ద మరికొన్ని పిల్లర్ల పనులు మాత్రమే జరిగాయి. గౌతమీ నదిపై గెడ్డర్ల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. అసలు జరుగుతాయో లేదో కూడా తెలియని దురవస్థలో ఉంది. దీనికితోడు రెండు బడ్జెట్‌లలో నిధులు కేటాయింపులపై స్పష్టత లేదు. 

2016లో సవరించిన అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.2,120 కోట్లు గత బడ్జెట్‌లోనే చూపించేశారని కూటమి నాయకులు ప్రచారం చేశారు. తరువాత రూ.120 కోట్లని మరోసారి చెప్పారు. ఈ ఏడాది కూడా ఇదే ప్రచారం చేశారు. మరి కొంతమంది ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.2.60 కోట్లు మాత్రమే ఇచ్చారని సామాజిక మాధ్యమాలలో చేస్తున్న ప్రచారంతో తమ చిరకాల వాంఛ రైల్వే లైన్‌ ఇప్పుడప్పుడే పూర్తి కాదని కోనసీమ వాసుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పింక్‌బుక్‌ లేదు  
కాకినాడ– కోటిపల్లి– నర్సాపురం రైల్వే లైన్‌కు గత ఏడాది, ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులపై అనిశ్చితి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టింది. కానీ ఇంతవరకు కోటిపల్లి– నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు నిధులు కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం రైల్వేకు సొంతంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టేది. ఆ రోజుల్లో సాయంత్రాని కల్లా కోనసీమ రైల్వేలైన్‌కు కేటాయింపుల వివరాలు తెలిసేవి. 

2016 నుంచి రైల్వే ప్రత్యేక బడ్జెట్‌ నిలిపివేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించే బడ్జెట్‌లోనే రైల్వేకు కేటాయింపులు చేస్తున్నారు. రైల్వేకు ఇచ్చిన నిధులను జోన్లు, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసే పింక్‌ బుక్‌ (రైల్వే ఆస్తులు, ఖర్చులు, నిర్మాణాలు పొందు పరిచే పుస్తకం)లో నమోదు చేసేవారు. కేంద్ర బడ్జెట్‌ ప్రకటించిన నాలుగైదు రోజుల్లో ప్రాజెక్టులు వారీగా కేటాయింపులు పింక్‌ బుక్‌ ద్వారా విడుదలయ్యేవి. 

కానీ గత ఏడాది నుంచీ ఈ విధానం ఎత్తివేసి కేవలం జోన్ల వారీగా కేటాయింపులు చేస్తున్నారని సమాచారం. ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడం లేదు. రైల్వే ప్రాజెక్టు సంబంధించి అమలాపురం మండలం భట్నవిల్లి నుంచి మలికిపురం మండలం దిండి వరకు భూ సేకరణ చేయకపోవడంతోపాటు వంతెనలు పూర్తి చేసే పనులకు టెండర్లు ఖరారు కాకపోవడంతో పనులు జరగడం లేదు.   

ఆ ప్రచారం ఊహాజనితం 
రైల్వేలో పింక్‌ బుక్‌ అనేది ఎత్తివేశారు. దీనివల్ల ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం లేదు. కేవలం జోన్ల వారీగా కేటాయింపులు సాగుతున్నాయి. కాబట్టి రైల్వే ప్రాజెక్టుకు కేటాయింపులు అంత చేశారు, ఇంత చేశారు అనే ప్రచారం ఊహాజనితమే కానీ వాస్తవం కాదు.   – డాక్టర్‌ ఇ.ఆర్‌.సుబ్రహ్మణ్యం, కోనసీమ రైల్వే సాధన సమితి కన్వినర్, అమలాపురం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement