మార్చి 16 నాటికి నివేదిక ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న సిట్‌ను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించింది. ఈ సిట్‌కు అదనపు డీజీ స్థాయికి తక్కువ కాని అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ సిట్‌లో ఎవరెవరు ఉంటారన్న వివరాలను మూడు రోజుల్లో హైకోర్టు రిజిస్ట్రార్ కు అందచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా, వాటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేశారా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్‌ను ఆదేశించింది. అసలు ఓఎంఆర్ షీట్లు, విజయవాడలో ఫిజికల్ వాల్యుయేషన్ సమయంలో ఉపయోగించిన ఓఎంఆర్ షీట్లు, సమాధాన పత్రాలపై ఉన్న బార్ కోడ్‌లు, వాటినుంచి సేకరించిన వివరాలన్నీ ఒకేలా ఉన్నాయో లేదో సరిపోల్చాలని కూడా స్పష్టం చేసింది.
ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలను ఏవిధంగా తనిఖీ చేస్తారో, అదే రీతిలో ఎంపిక కాని అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా పరిశీలించాలని ఆదేశించింది. అలాగే మెరిట్ లిస్ట్‌లో చివరిగా ఎంపికైన అభ్యర్థి కంటే కింద ఉన్న 100 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా పరిశీలించాలని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది. పైన పేర్కొన్న నిర్దిష్ట అంశాలపైనే కాకుండా (బార్ కోడ్‌లు, ఓఎంఆర్ షీటు వంటివి), దర్యాప్తు సంస్థ ఇతర శాస్త్రీయ మార్గాల ద్వారా కూడా అక్రమాలను వెలికితీయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
దర్యాప్తులో ఎలాంటి స్థానిక ప్రభావం లేకుండా ఉండటానికి, రాష్ట్రం వెలుపల ఉన్న ఏదైనా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణుల సహాయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వారు తమ అధికార బలంతో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎంపిక కాని అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తక్షణమే వారందరినీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు నాన్–ఫోకల్ (ప్రాధాన్యత లేని) పోస్టులకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఓ వారంలో ఆ అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలతో ఓ నివేదికను రిజి్రస్టార్ జ్యుడీషియల్‌కు అందచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎంపిక కాని అభ్యర్థుల జవాబు పత్రాలను కూడా ఎంపికైన అభ్యర్థుల మాదిరిగానే విచారించాలని సిట్‌కు తేల్చి చెప్పింది. మార్చి 16 లోపు నివేదిక సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. అన్ని అప్పీళ్లపై మార్చి 16న తిరిగి విచారణ జరుపుతామంది.
ఈ ఆదేశాల కాపీని ప్రత్యేక మెసెంజర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో సిట్‌ను ప్రతివాదిగా చేర్చాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథశర్మ ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్ల నేపథ్యంలో
గ్రూప్–1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష మొత్తాన్ని రద్దు చేశారు. అలాగే గ్రూప్–1 మెయిన్స్‌లో అర్హత సాధించిన వారి జాబితాను కూడా రద్దు చేశారు. తిరిగి గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఏపీపీఎస్‌సీ అధికారులను ఆదేశించారు.
ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్‌సీ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. మరోవైపు ఉద్యోగాలు పొంది ప్రస్తుతం వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారు కూడా అప్పీళ్లు దాఖలు చేశారు. అలాగే వీరు పలు అభ్యర్థనలతో అనుబంధ పిటిషన్లు సైతం దాఖలు చేశారు. కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేయాలని, గ్రూప్–1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాల మీద నమోదైన క్రిమినల్ కేసులో సిట్ దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ రిపోర్టును కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.
కోర్టు నియమించిన కమిటీ పరిశీలించిన ఆన్సర్ షీట్స్, కంట్రోల్ బండిల్స్ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్‌కి ఇవ్వాలన్న అభ్యర్థనలతో మరికొన్ని అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.


