‘దొడ్డి’దారిన సర్కారు కక్ష సాధింపు | Secretariat Employees Assigned For Toilet Duty During Maha Shivaratri, Sparks Outrage In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

‘దొడ్డి’దారిన సర్కారు కక్ష సాధింపు

Feb 12 2026 5:32 AM | Updated on Feb 12 2026 11:56 AM

Toilet duty for Secretariat employees

సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల డ్యూటీ!

శివరాత్రి పేరుతో పిండ ప్రదానాలు, టాయిలెట్ల వద్ద విధులు 

తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 11 గంటల వరకు కాపలా 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. అమానవీయ రీతిలో నిత్యం అవమానాలు, మానసిక క్షోభ, అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో వారు నలిగిపోతున్నారు. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులైతే సర్కారు వేధింపులకు తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా సర్కారులో వీసమెత్తు అపరాధభావం కనిపించడం లేదు. 

పైగా మరింత పాశవిక చర్యలకు పూనుకుంటోంది. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సచివాలయ ఉద్యోగులకు మరుగుదొడ్ల వద్ద విధులు కేటాయించడం, పిండ ప్రదానాల వద్ద డ్యూటీలు వేయ­డం సర్కారు నీచరాజకీయానికి ప్రబల నిదర్శనం.    

రోజుకు మూడు షిఫ్టుల్లో.. 
డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలతోపాటు సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్న ఎందరో యువత గత ప్రభుత్వ హయాంలో తమ సొంత గ్రామాల్లోనే పేదలకు సేవలందించే అవకాశం దక్కడంతో గ్రామ/వార్డు సచివాలయాల కొలువుల్లో చేరారు. లక్షలాది మందితో పోటీ పడి పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. సమాజంలో హోదా, గౌరవాన్ని పెంచుకున్నారు.  చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో  గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను పదేపదే వేధిస్తోంది. 

పనిభారం విపరీతంగా పెంచి కక్ష సాధింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తా­జా­గా మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా 14 నుంచి 16వ తేదీ వరకు జగ్గయ్యపేట మండల పరిధిలోని ముక్తేశ్వరం గ్రామంలో వాహనాల పార్కింగ్‌తో పాటు, మెయిన్‌ రోడ్లు, ఘాట్లు, మహిళా స్నానాల గదులు, టాయిలెట్ల దగ్గర సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రోజుకు మూడు షిఫ్టుల్లో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విధులు కేటాయించింది. 

పురుషులు, మహిళల టాయిలెట్ల దగ్గర ప్రత్యేకంగా ఇద్దరేసి సిబ్బందిని విధులు చేయాలని ఆదేశించింది. పిండ ప్రదానాలు జరిగేచోట ఒక్కొక్కరు చొప్పున విధుల్లో ఉండాలని హుకుం జారీ చేసింది. ఎవరైనా ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ఈ మేరకు బుధవారం జగ్గయ్యపేట మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పేరిట ఆదేశాలు వెలువడ్డాయి.

మా రక్తం ‘మరుగు’తోంది 
సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన డ్యూటీ ఆర్డర్లు చూస్తే రక్తం మరుగుతోంది. టాయిలెట్ల దగ్గర కాపలా ఉండమని సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారా? సచివాలయ ఉద్యోగులు మనుషులు అనుకుంటున్నారా? లేక ప్రభుత్వానికి వెట్టి చాకిరీ చేసే బానిసలు అనుకుంటున్నారా? ఒక పక్క సర్వేల టార్చర్, మరోపక్క రెగ్యులర్‌గా చేయాల్సిన పనుల ఒత్తిడి తట్టుకోలేక గుండెపగిలి చనిపోతున్నారు. ఇంకొందరు జీవితం మీద విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఏకంగా ఐదుగురు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. 

సచివాలయం ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏ మాత్రం కనికరం చూపకుండా ఇంకా అడ్డమైన పనులు చెబుతోంది. ఏటా ఉత్సవాలు జరిగే చోట ఎప్పుడూ లేని విధంగా సచివాలయ ఉద్యోగులకు ఇలాంటి దారుణమైన పనులు అప్పగించడం ఏమిటి? శని, ఆదివారాలు సెలవు రోజులు. 

పైగా పండుగ రోజు పనులు చెప్పడం ఒక తప్పయితే అందులో షిఫ్టుల పద్ధతిలో రేయింబవళ్లూ మరుగుదొడ్ల దగ్గర నిలబెడతారా? డిగ్రీలు, బీటెక్‌ చేసి ఉద్యోగాల్లోకి వచ్చింది ఇందుకేనా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించాలి. ఈ ఉత్తర్వులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.  – కాకర్ల వెంకటరామి రెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంటు ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

సచివాలయ ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేసిన ఆర్డర్‌ కాపీ 

Advertisement
 
Advertisement
Advertisement