ఆర్టీసీపై చావుదెబ్బ! | 12 key bus depots in the state are privatized | Sakshi
Sakshi News home page

ఆర్టీసీపై చావుదెబ్బ!

Feb 12 2026 5:15 AM | Updated on Feb 12 2026 8:28 AM

12 key bus depots in the state are privatized

రాష్ట్రంలో 12 కీలక బస్‌ డిపోలు ప్రైవేటుపరం

ఆ డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులు ఇతర డిపోల్లో సర్దుబాటు  

ఈ నెల 25లోగా ఆ డిపోలు ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ 

రూ.6 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం 

ఈ–బస్‌ల నిర్వహణ పేరుతో సరికొత్త కుతంత్రం  

చంద్రబాబు సర్కారు తీరుపై భగ్గుమంటున్న ఆర్టీసీ ఉద్యోగులు  

సాక్షి, అమరావతి :   రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని చావుదెబ్బ కొట్టింది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులు ఉన్న అతి పెద్ద రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి దొంగదెబ్బ తీసింది. దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు బరితెగించింది. ఇప్పటికే విజయవాడ ఆర్టీసీ డిపో–1కు చెందిన రూ.600 కోట్ల విలువైన 4.15 ఎకరాలను చంద్రబాబు తన అస్మదీయ సంస్థ లూలూ గ్రూప్‌నకు కట్టబెట్టింది. తాజాగా ఆర్టీసీ వెన్నెముకను విరిచేస్తూ విభ్రాంతికర నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ–బస్సుల నిర్వహణ సంస్థల ముసుగులో ఏకంగా రూ.6 వేల కోట్ల విలువైన భూములను అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేయడానికి రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో పావులు కదుపుతోంది. 

‘ప్రధాన మంత్రి ఈ–బస్‌ సేవా’ పథకం కింద ప్రవేశ పెట్టే విద్యుత్‌ బస్సు (ఈ–బస్సు)లను ఈ ఆర్టీసీనే నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను అందుకే తిరస్కరించింది. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల ద్వారానే ప్రవేశ పెడతామని తేల్చి చెప్పింది.   

ఇక్కడే తిర‘కాసు’ 
ఈ–బస్సులను ప్రవేశపెట్టే ప్రైవేటు సంస్థలే తమకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలి. అంటే బస్సుల చార్జింగ్‌ కేంద్రాలు, గ్యారేజీలు, బస్సులు నిలుపుదల చేసే ప్రదేశాలను ఆ సంస్థలే ఏర్పాటు చేసుకోవాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా ఒప్పందంలో విస్మరించింది. ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఈ–బస్సులకు చార్జింగ్‌ కేంద్రాలు, గ్యారేజీలు, ఇతర వసతులను ఆర్టీసీ డిపోల్లోనే ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 

పోనీ ఆ డిపోలను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగిస్తూ ప్రైవేటు సంస్థలకు యూజర్‌ చార్జీలు వసూలు చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కూడా పట్టించుకోలేదు. ఆర్టీసీ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌ 29న నిర్వహించిన సమావేశంలోనే ఆమోద ముద్ర వేసింది. మొదటి దశలో రాష్ట్రంలోని 12 డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 4న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆ 12 డిపోలను ఈ నెల 25లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ డిపోల ద్వారా నిర్వహిస్తున్న బస్సులను ఇతర డిపోలలో సర్దుబాటు చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ డిపోల్లో ఆర్టీసీ చేపట్టిన సివిల్‌ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కూడా స్పష్టం చేసింది. అంటే ఆ డిపోలను పూర్తిగా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసినట్టేనని తేల్చి చెప్పింది.  

రూ.6 వేల కోట్ల భూములు అన్యాక్రాంతం 
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ స్టేషన్లు, డిపోల రూపంలో ఉన్న విలువైన భూములే ఆర్టీసీకి వెన్నెముక. ఆ వెన్నుముకకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో అత్యంత విలు­వైన ప్రదేశాల్లో ఉన్న డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది. 

ఒక్కో డిపో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంటే 12 డిపోల విస్తీర్ణం దాదాపు 120 ఎకరాలు. ఆ ప్రాంతాల్లో ఎకరా భూమి మార్కెట్‌ విలువ రూ.25 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ఉంది. సగటున ఎకరా భూమి విలువ రూ.50 కోట్లు లెక్క వేసుకున్నా.. ఆ 12 డిపో­ల మార్కెట్‌ విలువ ఏకంగా రూ.6వేల కోట్లు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కలం పోటుతో ఆర్టీసికి చెందిన రూ.6 వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోంది.  

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్ర 
ఆర్టీసీ డిపోలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. విద్యుత్‌ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఆలోచనను వెంటనే వెనక్కు తీసుకోవాలి. అత్యంత విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలి. 12 ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయాలన్న ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. 

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలను ఉధృతం చేస్తాం. ఐక్య కార్యాచరణ కమిటీ పోరుబాట పడుతుంది. ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారు.  – సీహెచ్‌.సుబ్బారావు, కట్టా సుబ్రమణ్యం, ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

12 డిపోలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం కోసం ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు 

అన్యాక్రాంతం కానున్న 12 డిపోలు  
1. సింహాచలం – విశాఖపట్నం 
2. గాజువాక – విశాఖపట్నం 
3. రాజమహేంద్రవరం      
4. కాకినాడ  
5. విద్యాధరపురం – విజయవాడ 
6. మంగళగిరి – అమరావతి 
7. గుంటూరు –2         
8. నెల్లూరు  
9. మంగళం  – తిరుపతి      
10. కడప  
11. అనంతపురం       
12. కర్నూలు  

 

Advertisement
 
Advertisement
Advertisement