ఏదిపడితే అది మాట్లాడొద్దు.. | Chandrababu warns members at NDA legislature party meeting | Sakshi
Sakshi News home page

ఏదిపడితే అది మాట్లాడొద్దు..

Feb 12 2026 4:51 AM | Updated on Feb 12 2026 4:51 AM

Chandrababu warns members at NDA legislature party meeting

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సభ్యులకు చంద్రబాబు హెచ్చరిక 

ఎమ్మెల్యేలతో ముందే సమావేశమై ఎలా మాట్లాడాలో చెప్పిన బాబు 

కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలి: పవన్‌కళ్యాణ్‌ 

సాక్షి, అమరావతి: గత శాసనసభ సమావే­శా­­­­ల్లో మాదిరిగా ఏదిపడితే అది మాట్లాడితే సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు తెలిసింది. నోరు అదు­పులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం జరిగిన ఎన్డీయే పార్టీల శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఏ పనులు జరగడంలేదని విరుచుకుపడడంతో చంద్రబాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

దీంతో ఈ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఎలా మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడాలి అనే అంశాలపై వారికి సూచనలు చేశారు. గతంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన కొందరు ఎమ్మెల్యేలను ఆయన ఈ సమావేశంలో పరోక్షంగా హెచ్చరించారు. జనం అన్ని విష­యాలు చూస్తారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. కచ్చితంగా తొమ్మిది గంటలకు సభకు హాజరుకావాలని ఆదేశించారు. 

కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. 40 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని.. వారితో ఈ సమావేశాల్లోనే తాను వ్యక్తిగతంగా మాట్లాడతానన్నారు. అలాగే, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీ, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక నియోజకవర్గాల్లో పెండింగ్‌ పనులు గుర్తిస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామని, వాటిని తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు చంద్రబాబు చెప్పారు. 

20 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. మరో 15 ఏళ్లు కూటమి కలిసే ఉంటుందని చెప్పారు. గత ఎన్నికల్లో పనిచేసినట్లుగానే భవిష్యత్తులోనూ పనిచేయాలన్నారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలని.. కూటమి ధర్మానికి ప్రతిఒక్కరూ కట్టుబడి పనిచేయాలని సూచించారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement