శాంతిభద్రతలను కాపాడండి | YSRCP protests at podium during start of budget session | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలను కాపాడండి

Feb 12 2026 4:47 AM | Updated on Feb 12 2026 4:47 AM

YSRCP protests at podium during start of budget session

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్తున్న వైఎస్‌ జగన్‌

అసెంబ్లీలో గవర్నర్‌ ఎదుట నినదించిన వైఎస్సార్‌సీపీ 

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా పోడియం వద్ద నిరసన 

రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం 

అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని మండిపాటు 

సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ ప్రజలను మోసం చేశారు 

నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను దగా చేశారు 

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నారు 

ఇది దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం.. అంటూ నినాదాలు 

సభ్యుల ఆందోళన మధ్యే కొనసాగిన గవర్నర్‌ ప్రసంగం 

ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలను కాపాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఎదుట నినదించింది. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడింది. 

రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలూ సంతోషంగా లేరని నిప్పులు చెరిగింది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించే సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. 

‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. ప్రజల గొంతు వినిపించనివ్వరు.. ప్రతిపక్ష హోదా ఇవ్వరు.. రైతు సమస్యలు వినిపించనివ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే నినాదంతో కూడిన బ్యానర్లతో పాటు ప్ల కార్డులను ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ నాలుగో నంబర్‌ గేటు ద్వారా సభ్యులు సభలోకి వచ్చారు. ‘ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు.. కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు’ అనే ప్లకార్డును వైఎస్‌ జగన్‌ స్వయంగా పట్టుకుని లోపలకు ప్రవేశించారు. 

వైఎస్‌ జగన్‌ తన స్థానంలో ఆశీనులవ్వగానే సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి.. హామీలిచ్చారు.. అమలు మరిచారు.. అర్హులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకోవాలి.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం..’ అని నినదిస్తూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు వెళ్లారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నప్పటికీ, గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది. 

ఈ నేపథ్యంలో మార్షల్స్‌ పోడియం వద్దకు చేరుకుని వైఎస్సార్‌సీపీ సభ్యులు ముందుకు వెళ్లకుండా వలయంగా నిలబడ్డారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ పని తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement