గవర్నర్‌తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు
సూపర్ సిక్స్ రూపంలో రెండేళ్లలో రూ.1,42,897.12 కోట్లు
ఎగ్గొట్టి వాటిని అమలు చేశామంటూ నిస్సిగ్గుగా అసత్యాలు
20 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని రీతిలో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.3,27,725 కోట్లు అప్పులు..
అంతులేని రుణభారం.. ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ఆర్థిక విధ్వంసం.. 22 ఏ కింద లక్షలాది ఎకరాలను 2016లో నిషేధిత జాబితాలో చేర్చింది చంద్రబాబే
2014–19 మధ్య రాజధానిలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు పునర్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు అవాస్తవాలు
కమీషన్ల దాహంతో పోలవరంలో చారిత్రక తప్పిదాల పాపం బాబుదే
గత ప్రభుత్వంలో వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులనే ఇప్పుడు వచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ
రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ కుట్రలు.. కక్ష సాధింపు.. విధ్వంస పాలన
డీబీటీతో పేదల ఖాతాల్లోకి రూ.2.73 లక్షల కోట్లు జమ చేసిన వైఎస్ జగన్
22 ఏ భూములకూ వైఎస్సార్‌సీపీ హయాంలోనే విముక్తి
పోలవరాన్ని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా పనులు
విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు జగన్ సర్కారు సంపూర్ణ భరోసా
సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఇవ్వకుండా మోసం.. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ కింద రూ.19,200 కోట్లు ఎగనామం.. తల్లికి వందనం కింద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగ్గొట్టి పిల్లలకు పంగనామాలు.. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు రూ.64,800 కోట్లు ఎగవేత.. అన్నదాతా సుఖీభవ కింద రైతులకు రూ.16,747.52 కోట్లు బకాయిలు.. దీపం పథకంతో మహిళలకు రూ.4,700.96 కోట్లు ఎగవేత.. మహిళలు అందరికీ ఉచిత బస్సు కింద రూ.3,200 కోట్లు బాకీ.. సూపర్ సిక్స్ కింద రెండేళ్లలో రూ.1,42,897.12 కోట్లకుపైగా ఎగ్గొట్టి ప్రజలను సీఎం చంద్రబాబు మోసగించారు! ఆ మోసాలన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నా.. సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేసినట్లు గవర్నర్‌తో సీఎం చంద్రబాబు అసత్యాలు చెప్పించారు. అలవోకగా, కళ్లార్పకుండా అసత్యాలను చెప్పే చంద్రబాబు.. ఉభయసభలనుఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలోనూ అవే అవాస్తవాలను వల్లె వేయించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సహా 143 హామీలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. వాటి అమలుకు తనదీ పూచీ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాడు వాగ్దానం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్నీ రద్దు చేయబోమని.. వాటిని కొనసాగిసూ్తనే సూపర్ సిక్స్ సహా 143 హామీలనూ నెరవేరుస్తామని చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలంటే ఏడాదికి రూ.79,867 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్‌లో కేవలం రూ.17,179 కోట్లు మాత్రమే విదల్చడం గమనార్హం. సూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా మిగలడంతో ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఇచ్చిన బాండ్లను పరిశీలించి 20 నెలల్లో తమ కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఎంత ఎగ్గొట్టిందో ప్రజలు లెక్కలు వేసుకుంటున్నారు.
సంపద సృష్టి లేదు.. ఆర్థిక విధ్వంసం!
రుణ సేకరణ భారాన్ని తగ్గించడానికి.. రాష్ట్ర పునరుజ్జీవనానికి అవసరమైన మద్దతు పొందడానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో గవర్నర్‌తో చెప్పించారు. ఎన్నికలకు ముందు.. సంపద సృష్టించి, రుణ భారాన్ని తగ్గించి, సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సీఎం చంద్రబాబు నమ్మబలికారు. కానీ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని రీతిలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే ఏకంగా రూ.3,27,725 కోట్ల అప్పులు చేశారు. రికార్డు స్థాయి అప్పులతో ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేస్తున్నా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేలా ఏ ఒక్క పథకాన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 2019–24 మధ్య.. రెండేళ్లపాటు కరోనా లాంటి ప్రతికూల పరిస్థితులతో ఆర్థిక ఇబ్బందులున్నా.. రూ.3,32,671 కోట్ల అప్పులలో ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేస్తున్నారు.
తప్పు చేసి నిందలా..
2016లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు 6 లక్షల ఎకరాలను అకారణంగా 22 ఏ జాబితాలో పెట్టారు. చుక్కల భూములు, అనాధీనం భూములు, షరతులు గల పట్టా భూములు లాంటివి అందులో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 22 ఏ జాబితాలో ఉన్న భూములను సుమోటో వెరిఫికేషన్ చేయించారు. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 60 వేల ఎకరాల అనాధీనం భూములు, 34 వేల ఎకరాల షరతుల గల పట్టా భూములు, సుమారు 18 వేల ఎకరాల ఇతర భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించి ఊరట కల్పించారు. దీంతో ఆ భూములపై రైతులకు మళ్లీ హక్కులు వచ్చాయి. కానీ.. 2024లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడంతో ఆ భూముల్లో చాలా వరకూ మళ్లీ 22 ఏ జాబితాలోకి నెట్టేశారు. వీటితోపాటు 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములు 13.59 లక్షల ఎకరాలను జగన్ ఫ్రీ హోల్డ్ చేస్తే.. వాటిని కూడా చంద్రబాబు 22 ఏ జాబితాలో పెట్టించేశారు. వాస్తవాలు ఇలా ఉండగా గత ప్రభుత్వంపై గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు నిందలు వేయించారు. రాష్ట్రంలో 22 ఏ దుర్వినియోగం చేసింది చంద్రబాబు సర్కారేనని రైతులు స్పష్టం చేస్తున్నారు.
పోలవరంలో బాబు చారిత్రక తప్పిదాలు
గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. 2016–18లో పోలవరం ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్‌ను చంద్రబాబు పూర్తి చేశారు. 2017లో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో కోతకు గురై దెబ్బతింది.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ చారిత్రక తప్పిదాన్ని విదేశీ నిపుణుల కమిటీ ఎండగట్టింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది.. పోలవరాన్ని గాడిలో పెట్టి.. 2027 నాటికి పూర్తిచేసేందుకు మార్గం సుగమం చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై గవర్నర్‌తో చంద్రబాబు అభాండాలు వేయించారని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా..
2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతిలో చంద్రబాబు ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనాన్ని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టు సంస్థలతో కలిసి భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. ఈ కమీషన్ల బాగోతాన్ని కేంద్ర ఆదాయపు పన్నుల శాఖ ఎండగట్టింది. ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా రాజధాని నిర్మాణ పనులు చేపట్టారంటూ కాగ్ కడిగిపారేసింది. 2014–19 మధ్య తాను కట్టని రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసినట్లు.. ఇప్పుడు దాన్ని పునర్ నిర్మిస్తున్నట్లు గవర్నర్‌తో సీఎం చంద్రబాబు అవాస్తవాలు వల్లె వేయించారు. రాజధాని పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రూ.47,387 కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు.. నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు అప్పగిస్తున్నారని కాంట్రాక్టర్లు ప్రస్తావిస్తున్నారు.
భవనాలు చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తుండగా చంద్రబాబు సర్కారు దానికి మూడు రెట్లకుపైగా అధికంగా చెల్లించడం గమనార్హం. వీటిని పరిశీలిస్తే రాజధాని నిర్మాణాల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందన్నది బహిర్గతమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విత్తనం నుంచి విక్రయాల దాకా అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలిచి వ్యవసాయాన్ని వైఎస్ జగన్ పండుగగా మార్చితే.. పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ ఎగ్గొట్టి, ఉచిత పంటల బీమాను రద్దు చేసి, గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను నట్టేట ముంచింది చంద్రబాబేనని రైతన్నలు మండిపడుతున్నారు.
క్రెడిట్ చోరీలో చంద్రబాబుకు సాటెవ్వరు..?
వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు... ఇప్పుడు అవే అసత్యాలను గవర్నర్ నోటి వెంట చెప్పించారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ బాగోతాన్ని విశాఖ సీఐఐ సదస్సు వేదికగా గౌతమ్ అదానీ బట్టబయలు చేసినా.. ఆ సదస్సు ద్వారా 16.13 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయంటూ గవర్నర్‌తో చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేయించారు. అదానీ గ్రూప్ పేరును దాచిపెట్టి గూగుల్ డేటా సెంటర్‌ను తామే తెచ్చామంటూ చంద్రబాబు సర్కారు చేసుకున్న ప్రచారానికి తెర దించుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్‌ను గూగుల్‌తో కలసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు సమక్షంలోనే సీఐఐ సమ్మిట్‌లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్‌ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్‌తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఇక వైఎస్ జగన్ హయాంలో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన ఇంధన వనరులపై దృష్టిసారించడమే కాకుండా ఆ దిశగా పలు పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంటే.. ఇప్పుడు చంద్రబాబు వాటిని తన ఖాతాలో వేసుకుంటూ వైజాగ్ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకున్న సంగతి విదితమే. గత ప్రభుత్వ హయాంలో 2023లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడుల తర్వాత అతిపెద్ద పెట్టుబడుల ఒప్పందంగా నిలిచిన ఏబీసీ లిమిటెడ్ రూ.1,20,000 కోట్ల ఒప్పందాన్ని తిరిగి ఇప్పుడు కుదుర్చుకొని కొత్త ఒప్పందంగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రెన్యూ పవర్‌తో కుదిరిన రూ.97,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం, రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్‌తో ఇప్పుడు కొత్త పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలను అదుపు తప్పేలా చేసి విధ్వంస పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు.. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ నిర్మించి ప్రగతి దిశగా నడిపిస్తున్నట్లు గవర్నర్‌తో అవాస్తవాలను చెప్పించారంటూ సర్వత్రా మండిపడుతున్నారు.
బాబు మోసాల ఖరీదు రూ.1,42,897.12 కోట్లు!
⇒ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా రెండేళ్లుగా హామీని అమలు చేయలేదు. ఒక్కో ఏడాది రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. భృతి కింద రెండేళ్లలో యువతకు చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయి పడ్డారు.
⇒ పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కో రైతుకు రూ.30 వేలు బకాయి పడ్డారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.
⇒ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి ఏడాదికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. రెండేళ్లుగా ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు.
⇒ దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు.
⇒ 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వీరు 20 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. రెండేళ్లుగా పైసా ఇవ్వకుండా పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు
బకాయిపడ్డారు.
⇒ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26 ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లు ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. తొమ్మిది రకాల సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేరలేదు.
⇒ తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లు తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు.


