రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.6,300 కోట్లు పెండింగ్
దాదాపు రూ.2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలు కూడా..
మొత్తంగా రూ.8,500 కోట్లకు గాను ఇచ్చింది కేవలం రూ.700 కోట్లే
ఇంకా రూ.7,800 కోట్ల బకాయిలు
అసెంబ్లీ వేళ ప్రజలను మభ్యపెడుతూ రూ.1,200 కోట్లకు బీఆర్‌వో
అంటే ఆ మేరకు బిల్లు పెట్టుకోవచ్చని చెప్పే అత్యంత సాధారణ అనుమతి.. దీనిపై లోకేశ్ డప్పు
విద్యార్థులను తామే ఉద్ధరిస్తున్నట్లు ఓ స్థాయిలో ప్రచారం
ఫలితంగా ఒక్క రూపాయి కూడా కాలేజీల ఖాతాలకు చేరని దుస్థితి
ఫీజులు చెల్లించకుంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించని యాజమాన్యాలు
భారతదేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలుపుకుని, హామీలు నెరవేర్చామని చెప్పుకునే వారు కొందరు.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే అన్నీ చేసేశామని చెప్పుకునే వారు ఇంకొందరు.. ఇందులో మొదటి వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయితే, రెండో వ్యక్తి చంద్రబాబునాయుడు.. అయితే తండ్రిని మించిన తనయుడిగా మంత్రి లోకేశ్ మరో నాలుగడుగులు ముందుకేసి ఉత్తుత్తి ఆదేశాలతో ప్రజలను మభ్యపెడుతుండటం విస్తుగొలుపుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌వో) ఇచ్చి.. అంటే బిల్లు పెట్టుకోవచ్చని ఇచ్చే అత్యంత సాధారణ ఉత్తర్వు. దీనిపై పండుగ చేసుకోండంటూ ప్రచారం చేసుకోవడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరినీ తామే ఉద్దరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం లోకేశ్‌కే చెల్లింది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో ఫీజు డబ్బులు చెల్లించడం తమ బాధ్యత అంటూ ‘ఎక్స్’ వేదికగా చాటుకోవడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యకు ఉరితాడు బిగిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో నక్కజిత్తులు ప్రదర్శిస్తూ విద్యార్థులను నిలువునా మోసం చేస్తోంది. కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తీర్చలేక కాగితాలపై కుయుక్తులు పన్నుతోంది. ఏ ప్రభుత్వంలోనైనా సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చాకే ప్రచారం చేసుకుంటారు.
కానీ, దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్‌వో) ఇచ్చి, పండగ చేసుకోమని చెప్పిన ఏకైక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు విద్యా శాఖ మంత్రి లోకేశ్ మాత్రమేనని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. స్వేచ్ఛగా కళాశాలలకు వెళ్లలేని దుస్థితిలో చదువు దినదిన గండంగా మారిపోయింది. ఒకవైపు ప్రభుత్వం ఫీజులు చెల్లించట్లేదు.
మరోవైపు ఫీజులు కట్టకుంటే కళాశాలలు పరీక్షలు రాయనివ్వట్లేదు. ఒకవేళ ఎలాగోలా పరీక్షలు రాసినా, సర్టిఫికెట్లు విడుదల చేయట్లేదు. గత రెండేళ్లుగా ఉన్నత విద్యా రంగంలో ఇదే తంతు నడుస్తోంది. తమ బిడ్డల చదువుల కోసం ఎందరో పేదింటి తల్లులు పుస్తెలు తాకట్టుపెట్టి, ఫీజులు కట్టిన ఉదంతాలు కోకొల్లలు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై విద్యార్థులను, కళాశాలలను మభ్య పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ విద్యా సంవత్సరం కూడా ముగుస్తుండగా.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.6,300 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయి.
ఇందులో ఇచ్చింది కేవలం రూ.700 కోట్లే. ఇంకా రూ.5,600 కోట్లు బకాయిలున్నాయి. పైగా పేదింటి విద్యార్థులకు హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద చెల్లించాల్సిన రూ.2,200 కోట్ల ఊసే ఎత్తట్లేదు. మొత్తంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యలో రూ.7,800 కోట్లు బకాయిలు ఉంటే.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం రాత్రి రూ.1,200 కోట్లు విడుదల చేయొచ్చంటూ బీఆర్‌వో ఇచ్చి విద్యా వ్యవస్థను ఉద్ధరించినట్టు ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చెప్పిందొకటి.. చేస్తున్నది మరొకటి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయడం మొదలు పెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో కరోనా విలయ తాండవం చేసినప్పటికీ, సమర్థవంతంగా ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు మాత్రం పాతరేసేశారు. అంత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి, కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికారు.
తీరా చూస్తే 20 నెలల పాలనలో ఉన్నత విద్యా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద అరకొర నిధులు విదిల్చి మమ అనిపించారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన నిధులను ఆపేసి, ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ఫలితంగా రూ.7,800 కోట్ల బకాయిల కొండ దర్శనమిస్తోంది.
వసతి దీవెన ఎగ్గొట్టి తీరని అన్యాయం
చంద్రబాబు కర్కశ పాలన పేదింటి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి చదువుల కోసం వచ్చే విద్యార్థులు హాస్టళ్లలో జీవనం సాగిస్తుంటారు. అలాంటి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గత వైఎస్ జగన్ ప్రభుత్వం వసతి దీవెన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో హాస్టల్ మెయింటెనెన్స్ కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేసింది.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకం ఊసే ఎత్తడం లేదు. ఇప్పటిదాకా మూడు విడతలకు గాను రూ.2,200 కోట్లు బకాయిపెట్టి, విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తోంది. కాగా, అధికారమే పరమావధిగా ఎన్నికలప్పుడు చంద్రబాబు.. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వరుసగా రెండు దఫాల్లోనూ ముఖం చాటేశారు.
ఇప్పుడు మూడోసారి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సుస్థిరత దిశగా పాలన సాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అప్పులు, వడ్డీల లెక్కలతో కాలం గడిపేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్సిటీలనే కాదు ప్రైవేటు విద్యా సంస్థలను సైతం నట్టేట ముంచేసే కార్యక్రమాలకు ఒడిగట్టింది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆర్థికంగా కుదేలయ్యాయి.
అతికష్టంపై నెట్టుకొస్తున్న దుస్థితి. ఈ క్రమంలో తప్పించుకునేందుకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి ప్రైవేటు యాజమాన్యాలకు ఈ విద్యా సంవత్సరం చివరి వరకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని, అయితే అందుకయ్యే వడ్డీని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు భరించాలని ప్రతిపాదించింది. తీరా, బ్యాంకుల దగ్గరకు వెళ్లేసరికి అప్పు పుట్టక పోవడంతో ప్రభుత్వం ముఖం చాటేసింది.
విశ్వవిద్యాలయాల నిధులు దారి మళ్లింపు
» ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తీవ్రంగా దెబ్బ తీసింది. ప్రభుత్వ వర్సిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోగా, వర్సిటీ నిధులను దారిమళ్లించి వాటి మనుగడపై కోలుకోలేని దెబ్బకొట్టింది. ఉన్నత విద్యా మండలితో పాటు విశ్వవిద్యాలయాల నుంచి ఏకంగా రూ.1,200 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టించింది. వాటిని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కు బదిలీ చేయించి, తద్వారా ఇతర అవసరాలకు వినియోగిస్తోంది.
» ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చినబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కోవిడ్‌ను అధిగమించి వర్సిటీలకు నూతన జవసత్వాలు అందించే ప్రయత్నం విస్తృతంగా జరిగింది. మళ్లీ చంద్రబాబు సర్కార్ రాకతో ప్రభుత్వ వర్సిటీలకు గడ్డుకాలం దాపురించింది.
నేడు అరకొర.. నాడు ఫుల్ బడ్జెట్
» చంద్రబాబు ఉన్నత విద్యకు అరకొర బడ్జెట్ కేటాయించడం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్‌లో కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఆ మేరకు నిధులు విడుదల చేసిందా అంటే అదీ లేదు. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచడంతో పాటు ఆ మేరకు విడుదల చేయాల్సి ఉంది.
» వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేసింది. పైగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్ల బకాయిలు సైతం చెల్లించింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ఇచ్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది.
ఇలా మొత్తం ఐదేళ్లలో గత ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్‌లో పరిగణనలోకి తీసుకుని మే నెలలో నిధులు విడుదల చేయాల్సి ఉండగా, మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
రెడ్‌బుక్‌పై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదా?
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపాటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌లు రెడ్ బుక్ రాజ్యాంగంపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై చూపించట్లేదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.7,800 కోట్లున్నా నిమ్మకు నీరెత్తి¯] ట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇతర శాఖల్లో వేలు పెట్టే లోకేశ్.. తన శాఖలో విద్యార్థుల కష్టాలను తీర్చలేని అసమర్థ మంత్రిగా నిలిచిపోయారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేసి, తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేవారన్నారు. ఫలితంగా విద్యార్థులు హాయిగా చదువుకునే వారని గుర్తు చేశారు. చంద్రబాబు సర్కార్ ఫీజులు చెల్లించక పోవడంతో కళాశాలలు విద్యార్థులను పరీక్షలకు కూడా అనుమతించట్లేదని దుయ్యబట్టారు.
విజయవాడ సమీపంలోని ఎనికేపాడులోని విజయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థినులను ఫీజు పెండింగ్ ఉందనే కారణంతో రీసెర్చ్ రివ్యూ మీటింగ్‌కు అనుమతించక పోవడం దారుణం అన్నారు.బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


