స్కూల్‌ బస్సు బోల్తా | 22 students injured after private school bus overturns | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు బోల్తా

Feb 12 2026 5:21 AM | Updated on Feb 12 2026 5:21 AM

22 students injured after private school bus overturns

22 మందికి గాయాలు

బొబ్బిలిరూరల్‌: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని అలజంగి కూడలి వద్ద బుధవారం ఓ ప్రైవేటు స్కూల్‌బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాథలను కారాడ గ్రామం వద్ద ఉన్న షన్‌షైన్‌హోం (స్వచ్ఛంద సేవా సంస్థ) నిర్వాహకులు ఆదరిస్తూ బొబ్బిలిలోని సెవెంత్‌ డే ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పాఠశాల పూర్తయిన అనంతరం 34 మంది విద్యార్థులు బస్సులో తిరిగి కారాడ షన్‌షైన్‌ హోంకు వెళుతున్నారు. 

ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని డ్రైవర్‌ తప్పించే యత్నంలో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లో బోల్తా కొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ఏడో తరగతి చదువుతున్న పిట్ల నానికి తీవ్ర గాయాలయ్యాయి. నడుము, గుండె భాగాల్లో గాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వా­స్పత్రికి రిఫర్‌ చేశారు. 

ఆరు, ఏడు తరగతులకు చెందిన ఆర్‌.బాలకరుణ్, దుర్గారావు, జయశంకర్, ప్రవీణ్‌ ప్రదీప్‌కు కాళ్లు, చేతులు, తలకు గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. షన్‌షైన్‌ హోం మేనేజర్‌ రాజవర్మ ఆస్పత్రికి చేరుకుని చిన్నారులను పరామర్శించారు. బొబ్బిలి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement