అంబటిని జైలులోనే ఉంచేందుకు కుట్ర
ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసు ముందుకు..
మెడికల్ ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్
వెంటనే మరో కేసులో పీటీ వారెంట్
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు లీగల్: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్ జారీచేశారు.
ఇలా వరుస కేసులతో హింసించడం సర్కారు శాడిజానికి పరాకాష్ట అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులంటున్నారు. ఒక కాపు నేతపై ఇంతలా కక్ష సాధించడం విడ్డూరమని వారు పేర్కొంటున్నారు. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని అంటున్నారు.
బెయిల్.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్..
అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమరి్పంచిన తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఆయనను గురువారం గుంటూరు కోర్టులో మళ్లీ హాజరుపరుచనున్నారు.
అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నాయకులు వెల్లడించారు.
సుప్రీం తీర్పులకు విరుద్ధంగా..
అంబటి రాంబాబు మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టారు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు కూడా విరుద్ధమని, దీని వెనుక సర్కారు రాక్షసత్వం, ఒక వ్యక్తిపై కక్ష, పగ కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదు. ఈ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం ఓ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పినా ఆ తీర్పును రాష్ట్రంలో అమలు చేయడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయడం లేదు.
ఒకే కేసులో ఇన్ని ఎఫ్‌ఐఆర్‌లా..హైకోర్టు విస్మయం..
అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండడంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్‌మోషన్ రూపంలో దాఖలుచేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఒకే అంశంపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్‌పీసీ సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. అంబటి కేసులో చట్ట ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు గుంటూరు జిల్లా, మంగళగిరి గ్రామీణ పోలీసులను ఆదేశించారు. ఆయనకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని విమర్శకులంటున్నారు.


