హోం మంత్రి అనిత పీఏ అండ.. అక్రమంగా పశువుల రవాణా
‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’, అనుబంధంగా గోశాల ఏర్పాటు
జాతీయ రహదారిపై పశువులను తరలించే వాహనాలను అడ్డుకుని వసూళ్లు
డబ్బులిస్తే ఓకే... లేదంటే పోలీసులకు ఫిర్యాదు
అనంతరం పోలీసులు పట్టుకున్న గోవులన్నీ గోశాలకు తరలింపు
అదే సమయంలో ఏజెన్సీ, ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు పశువుల కొనుగోళ్లు
వాటన్నింటినీ అర్ధరాత్రి వేళ హైదరాబాద్‌లోని పశువధ శాలలకు తరలింపు
తాజాగా హోం మంత్రి పీఏ గణేష్ వసూళ్ల దందా సోషల్ మీడియాలో వైరల్
తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు ఆదేశించిన హోం మంత్రి అనిత
సాక్షి, అనకాపల్లి: హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. ఆమె పీఏ సుంకర గణేష్ ఈ దందా వెనుక కీలకంగా ఉంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు వెలుగుచూసింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో టీడీపీకి చెందిన ముఠా మూగజీవాలపై ‘పైసా’చికత్వం ప్రదర్శిస్తోందని... ఈ ముఠా రోజు రోజుకూ వికృతరూపం దాలుస్తోందనే ఆరోపణలున్నా యి. జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ సాగుతున్న ఈ దందాపై, గణేష్ అవినీతిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోంది.
గణేష్ పై 2022లో కాకినాడ జిల్లా ప్రతిపాడు పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోంమంత్రి అనిత స్పందిస్తూ పీఏ గణేష్ పై విచారణ చేపట్టి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. అయితే ఏ స్టేషన్ పోలీసులు విచారణ చేస్తున్నారో తెలియడం లేదు.గతంలో హోం మంత్రి పాత పీఏ జగదీష్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అప్పట్లో తొలగించారు.

హోంమంత్రి అనితతో పీఏ గణేష్
గోశాల ముసుగులో భారీ దందా
హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలోని ఎస్.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వారంతా హోంమంత్రి అనిత పీఏ సుంకర గణేష్ అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్ నెం.2–8/2 అడ్రస్‌తో ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేశారు.
దానికి అనుబంధంగా విజయవాడలో గల ఏపీ యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా అక్రమమార్గంలో రికగ్నైజేషన్ సర్టిఫికెట్ పొంది గోశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకుని వసూళ్లకు పాల్పడేవారు. డబ్బులివ్వకుంటే ఆ వాహనాలను పోలీసులకు అప్పగించేలా చేసి... అక్కడి నుంచి ఆ వాహనాల్లోని పశువులను తమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న గోశాలకు తరలించుకునేవారు.
అదే సమయంలో ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే పశువులు కొనుగోలు చేసేవారు. అప్పటికే గోశాలలో ఉన్న గోవులతోపాటు తక్కువ ధరకే కొనుగోలు చేసిన పశువులను కలిపి రక్షణ చారిటబుల్ ట్రస్టు ముసుగులో హైదరాబాద్‌కు అక్రమంగా తరలించేవారు.
ఎస్.రాయవ రం మండలం పెనుగొల్లులోని చారిటబుల్ ట్రస్ట్ నుంచి పశువులను హైదరాబాద్‌లోని వ్యాపారుల పశువధ శాలలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని... ఈ ముఠాపై విచారణ జరిపి... వారికి జారీ చేసిన సర్టిఫికెట్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, లోకాయుక్తకు ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు ఫిర్యాదు చేశారు.
ముఠా సభ్యులను, వారికి సహకరిస్తున్న వారి వివరాలు చేర్చి గతేడాది ఆగస్టులో చర్యలు తీసుకోమని కోరినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం విశేషం. అనంతరం కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు ‘రక్షణ చారిటబుల్ ట్రస్ట్’ను మాత్రం రద్దు చేశారు.
హైవేపై రయ్‌రయ్‌మని..
అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్థరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. స్థానికంగా కొందరు హైదరాబాద్‌కు చెందిన పశువధ వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా కొద్ది రోజుల కిందట కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ సమీపంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులతో సమవేశమయ్యేలా అని త పీఏ గణేష్ ఏర్పాట్లు చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందరినీ ఓ ముఠాగా ఏర్పాటు చేసి అనకాపల్లి నుంచి హైదరాబాద్ వరకూ ఏ అడ్డంకీ లేకుండా పశువుల అక్రమ రవాణాకు గణేష్ రూట్‌మ్యాప్ సిద్ధం చేశాడని తెలుస్తోంది.
ఇప్పటికే వ్యాపారులంతా డీసీఎంలు, బొలెరో వాహనాల్లో అత్యంత విచక్షణారహితంగా ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


