అంబటిపై ‍కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు | AP Police PT Warrant On Ambati Rambabu In 2023 Case, Transferred To Guntur For Hearing | Sakshi
Sakshi News home page

అంబటిపై ‍కక్ష సాధింపు.. గుంటూరు కోర్టులో రాంబాబు

Feb 12 2026 7:40 AM | Updated on Feb 12 2026 12:02 PM

AP Police PT Warrant On Ambati Rambabu In 2023 Case

సాక్షి, తూర్పుగోదావరి: వైఎ‍స్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీ పోలీసులు తాజాగా అంబటిపై మరో కేసుకు సంబంధించిన పిటీ వారెట్‌పై విచారణకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. 

కాగా, గతేదాడి నవంబర్‌ 12న పట్టాభిపురం వైఎస్సార్‌సీపీ ర్యాలీ కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, అంబటి జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. ఆయన బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం మరో కేసులో అరెస్ట్‌కు రంగం సిద్దం చేసింది. 2023లో(ప్రైవేట్ కేసు నమోదు) సత్తెనపల్లి పరిధిలో నమోదైంది. అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పిటీ వారెంట్‌ జారీచేశారు. కేసుకు సంబంధించి పిటీ వారెంట్‌పై విచారణకు అంబటి రాంబాబును గుంటూరు తరలించారు. ఈ నేపథ్యంలో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటీ వారెంట్‌పై అంబటిని సత్తెనపల్లి పోలీసులు హాజరు పరిచారు. 

బెయిల్‌.. వెంటనే పాత కేసులో పీటీ వారెంట్‌.. 
అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్‌ వేశారు. రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్‌ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం  గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ బెయిల్‌ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబంధించి షూరిటీలు అన్నీ సమర్పించిన  తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు.  

అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకువచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు పట్ల  రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాలలో నిరసన వ్యక్తం అవుతోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. సంబంధిత కేసులపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ నాయకులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement