దూర విద్యలో పరీక్షలే మిథ్య! | - | Sakshi
Sakshi News home page

దూర విద్యలో పరీక్షలే మిథ్య!

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

దూర విద్యలో పరీక్షలే మిథ్య!

దూర విద్యలో పరీక్షలే మిథ్య!

దూర విద్యలో పరీక్షలే మిథ్య!

అక్రమాలకు నెలవుగా పరీక్షల నిర్వహణ తీరు ఆధిపత్య పోరు కారణంగా పలు వివాదాలు పరస్పరం కక్ష సాధించుకుంటున్న అధికారులు చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కారు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ అధ్వానంగా మారింది. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి గత 20 రోజులుగా పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలే నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు గత నెల ఆఖరులో ప్రారంభమయ్యాయి. వివాదాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దుతున్నామంటూ అధికారులు చేస్తున్న హడావుడి చూసి అందరూ విస్తుపోతున్నారు.

ఏఎన్‌యూ(పెదకాకాని): రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు జరుగుతున్నాయి. పర్యవేక్షకులను కో ఆర్డినేటర్‌ ఆచార్య రామచంద్రన్‌ నియమించారు. స్క్వాడ్‌లను కూడా నియమించాల్సి ఉంది. కానీ ఉన్నతాధికారులు నియమించడం గమనార్హం. సంస్కరణల పేరుతో జరుగుతున్న పరిణామాలు ఆధిపత్య పోరును చాటుతున్నాయి. రెండవ సెమిస్టర్‌లో ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో ఒక స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. ఆ ఎంపిక చేసిన టీం.. పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నారని గుర్తించింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్క సెంటర్‌ నిర్వాహకుడిని కూడా బాధ్యుడిని చేసిన సంఘటనలు లేవు. ఈ వివాదాలను సాకుగా చూపిస్తూ వర్సిటీని చక్కదిద్దేందుకు ఎఫ్‌ఏసీ ఇవ్వాలని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రాలన వారికి పరోక్షంగా సహకారం అందిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థను చక్కదిద్దవచ్చని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పరీక్షల కో ఆర్డినేటర్‌ బుధవారం నుంచి 14 మంది మందితో 7 స్క్వాడ్‌లను ఎంపిక చేయడం అధికారుల మధ్య భేదాభిప్రాయాలను స్పష్టం చేస్తోంది. పరీక్షల పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమే ఈ ఆరాటమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకత పేరుతో రహస్యంగా తనిఖీ బృందాలను రాష్ట్రమంతా తిప్పుతుండగా... కొందరు అధికారులు కూడా కొన్ని సెంటర్ల నిర్వాహకులతో తెరవెనుక సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు మాత్రం వర్సిటీ అధికారుల పోరులో తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఈ పరిణామాలపై విసిగిపోయిన కొందరు పరీక్ష కేంద్రాల నిర్వాహకులు... పరీక్షలకు ముందుగానే ఏ అధికారిని ఏ విధంగా కలిశామో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆ సెంటర్‌ను రద్దు చేశాం..

పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా... ‘గత నెలలో పొదిలి సెంటర్‌ను రద్దు చేశాం. ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలపై ఏ సెంటర్‌పైనా చర్యలు తీసుకోలేదు. వివరాలు సేకరిస్తున్నారు. స్క్వాడ్‌ ఎంపిక సహజంగా కోఆర్డినేటర్‌ ద్వారానే జరుగుతుంది. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని అనుసరించాల్సిందే’ అని తెలిపారు.

చర్యలు తీసుకుంటాం..

దూర విద్య పరీక్షల కో ఆర్డినేటర్‌ ఆచార్య రామచంద్రన్‌ను వివరణ కోరగా... ‘రెండో దశలో ముగ్గురు సభ్యులతో ఉన్నతాధికారులు ఒక స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. సమాచారం కూడా కొంతమేర గోప్యంగా ఉంచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు. ప్రస్తుతం 14 మందితో 7 స్క్వాడ్‌లను ఎంపిక చేశా. రాష్ట్రంలోని 114 సెంటర్లను షెడ్యూల్‌ ప్రకారం తనిఖీలు చేయాలని కోరాం. అక్రమాలకు పాల్పడితే పరీక్ష కేంద్రాల నిర్వాహకులను బాధ్యులను చేయడంతోపాటు చూసి రాతలకు పాల్పడే విద్యార్థులపైనా చర్యలు తీసుకుంటామని’ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement