బాలోత్సవం | Sakshi Editorial On Childrens Booker Prize | Sakshi
Sakshi News home page

బాలోత్సవం

Nov 10 2025 12:48 AM | Updated on Nov 10 2025 12:51 AM

Sakshi Editorial On Childrens Booker Prize

కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.

పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. 

ఈసప్‌ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్‌ కథలు, జంగిల్‌ బుక్, కాంచన ద్వీపం, గలివర్‌ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్‌ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్‌ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్‌ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?

అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్‌ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్‌ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. 

కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్‌ రండెల్‌ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.

లండన్‌లోని థేమ్స్‌ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్‌ కరోల్‌. అందులో అలీస్‌ లిడ్డెల్‌ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్‌’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్‌! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్‌. అట్లా ‘అలీస్‌(స్‌) అడ్వెంచర్స్‌ ఇన్‌ వండర్‌లాండ్‌’ పుస్తకంగా రూపుదాల్చింది. 

1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్‌ లిటరేచర్‌’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. 

అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్‌ ఫౌండేషన్‌ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement