మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బంగ్లాదేశ్‌లో హింస ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనబడటం లేదు. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో గతవారం దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మైనారిటీ హిందూ యువకుణ్ణి మతాన్ని కించపరిచాడన్న ఆరోపణతో కొట్టి చంపారు. ‘ప్రథమ్ ఆలో’, ‘ద డైలీ స్టార్’ అనే రెండు ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పంటించారు. ఈలోగా సోమవారం మరో విద్యార్థి నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్‌సీపీ) స్థానిక నేత మొతలబ్ షిక్దర్‌ను దుండగులు కాల్చి చంపారు.
బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోవటం, ఎన్నికలను ప్రహసన ప్రాయంగా మార్చటం వగైరాలతో జనం ఆగ్రహించి నిరుడు జూలైలో ఉద్యమించారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో, హింసను రెచ్చగొట్టి మైనారిటీ హిందూ మతస్తులపై, మహిళలపై దాడులు చేయటంలో మతతత్వవాదులు విజయం సాధించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ వీటన్నిటినీ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఉద్యమకారులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని అడ్డుకోవటానికి ప్రభుత్వపరంగా ఆయన చేసిందేమీ లేదు. అది చేతగానితనమా, వ్యూహాత్మకమా అన్నది తేలాల్సి ఉంది.
హసీనా నిష్క్రమించాక చోటుచేసుకుంటున్న వరస పరిణామాలు అరాచకానికి బీజాలు వేశాయి. నేరగాళ్లను జైళ్లనుంచి విడిచిపెట్టడం, జమాత్–ఎ–ఇస్లామీ(జేఐ) వంటి పాక్ అనుకూల మతతత్వ సంస్థలకు స్వేచ్ఛనీయటం వగైరాలు ఎడతెగని హింసకు దారితీశాయి. హసీనా సొంత పార్టీ అవామీ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోటీచేసే అవకాశం లేకపోవటం, మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అధినేత ఖలీదా జియా తీవ్ర అస్వస్థత వల్ల ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం వగైరా పరిణామాలతో జేఐ వంటి మతతత్వ సంస్థలు తామే విజేతలమన్న భ్రమలో బతుకుతున్నాయి.
భారత్ వ్యతిరేకతను ఇదే స్థాయిలో రెచ్చగొడుతూపోతే తమకే అధికారం దక్కుతుందని తలపోస్తున్నాయి. హదీ చురుకైన విద్యార్థి నాయకుడే. కానీ జేఐకి బద్ధ వ్యతిరేకి. ‘ఇంక్విలాబ్ మంచా’(ఐఎం) అనే మరో మతతత్వ సంస్థకు అధికార ప్రతినిధి. ఇటీవలే ‘ప్రథమ్ ఆలో’ పత్రిక సర్వే నిర్వహించి ఐఎం కన్నా జేఐకే ప్రజాదరణ ఎక్కువుందని తెలిపింది. బంగ్లాలో వరసబెట్టి ఆలయాలపై, దర్గాలపై సాగుతున్న దాడులపై అమెరికాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న అసిఫ్ బిన్ అలీ రాసిన సవివరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా కంటగింపుగా మారి ఐఎం మూకలు ఆ పత్రిక కార్యాలయానికి నిప్పెట్టాయి. పాక్ పాలకులు తమ సంస్కృతినీ, భాషనూ అణగ దొక్కాలని చూసిన పర్యవసానంగానే బంగ్లా ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మూకలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయో అనూహ్యం.
భారత్ వ్యతిరేకత ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య లేదా నిరుద్యోగాన్ని రూపుమాపటం, కనీసం అవినీతి అంతానికి ఏం చేస్తారో చెప్పటం వగైరాలు మరిచిన ఈ సంస్థలు భారత్ వ్యతిరేకత పైనే ఆశ పెట్టుకున్నట్టు కనబడుతోంది. హదీ భారత వ్యతిరేకి కావొచ్చుగానీ... అంతమాత్రాన ఆ హత్య వెనక భారత్ హస్తం ఉన్నదనీ, హదీ హంతకులకు అది ఆశ్రయమిచ్చిందనీ వదంతులు వ్యాపింపజేయటం, ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇలాంటి వైఖరే అరాచకానికి దారితీస్తోంది. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కుప్పకూలదు. దీర్ఘకాలం కొనసాగే అరాచకం, హింస అందుకు తోడ్పడతాయి. హదీ సంస్మరణ సభలో మాట్లాడిన వారు భారత్‌కు హెచ్చరికలు జారీచేయటం, హసీనానూ, హదీ హంతకులనూ అప్పగించాలంటూ తేదీ ఖరారు చేయటం... ఎన్నికలు ముంచుకొస్తుండగా ప్రభుత్వం దీన్ని మౌనంగా వీక్షించటం బాధ్యతా రాహిత్యం. సకాలంలో ఈ అరాచకాన్ని నివారించకపోతే మున్ముందు తనను కూడా ఈ శక్తులు లక్ష్యంగా మార్చుకుంటాయని యూనస్ తెలుసు కోవటం మంచిది.


