సాహితీవేత్తలు, కళాకారుల ప్రతిభా వ్యుత్పత్తులను గుర్తించి, సత్కరించే సంప్రదాయం పురాతన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో ఉండేది. రాచరికాలు కొనసాగిన కాలంలో రసహృదయం కలిగిన రాజులు కవులు, కళాకారులకు సత్కారాలు చేసేవారు. అనితర సాధ్యమైన ప్రతిభాసంపదను ప్రదర్శించిన కవులు, కళాకారులకు కొందరు రాజులు గండపెండేరాలు తొడిగి, కనకాభిషేకాలు చేసిన ఉదంతాలు కూడా చరిత్రలో నమోదై ఉన్నాయి. ‘దీనార టంకాల దీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల’ అంటూ శ్రీనాథుడు రాజుల నుంచి తాను పొందిన సత్కారాలన్నింటినీ ఏకరువు పెట్టాడు.
‘బిరుదైన కవి గండపెండేరమున కీవె తగుదని తానె పాదమును దొడిగె’ అని అల్లసాని పెద్దన –శ్రీకృష్ణదేవరాయలు తన కాలికి బంగారు గండెపెండేరాన్ని స్వయంగా తొడిగిన ఉదంతాన్ని చెప్పుకున్నాడు. తంజావూరు పాలకుడు విజయరాఘవ నాయకుడు తన ఆస్థాన కవయిత్రి రంగాజమ్మకు కనకాభిషేకం జరిపించాడు. సామాజిక స్థాయిని పెంచే రాజాశ్రయం కోసం; రాజులు ఇచ్చే బిరుదులు, పారితోషికాల కోసం; కనకాభిషేకాలు జరిపించుకుని, గండెపెండేరాలు తొడిగించుకోవాలనే ఉబలాటం తీర్చుకోవడం కోసం ఎందరో కవులు, కళాకారులు అర్రులు చాచేవారు.
అలాంటి కాలంలోనే ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే/ సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్’ అని ఘంటాపథంగా చెప్పి, రాజాశ్రయానికి దూరంగా మిగిలిన పోతనలాంటి వారు కూడా ఉండేవారు. భాగవతం రాసిన పోతనే కాదు, రామాయణం రాసిన మొల్ల కూడా రాజాశ్రయానికి దూరంగానే ఉంది. అంతమాత్రాన పోతన కవిత్వానికీ, మొల్ల కవిత్వానికీ వచ్చిన లోటేమీ లేదు. పోతన, మొల్ల మాత్రమే కాదు, రాజాశ్రయానికి దూరంగా ఉండి పోయిన కవులు ఎందరో! రాజాశ్రయంతోను, బిరుద సత్కారాలతోను నిమిత్తం లేకుండా కొందరి కవిత్వం మాత్రమే నేటికీ నిలిచి ఉంది.
రాచరికాలు అంతరించడం మొదలవుతున్న కాలంలో– అంటే, ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో సత్కారాలు ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. సాహిత్యం సహా వివిధరంగాలలోని ప్రతిభావంతులను గుర్తించి, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా అవార్డులు, బిరుదులు ఇవ్వడం మొదలైంది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమానాలు ఇవ్వడం 1901 నుంచి మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఒలింపిక్స్‌లో క్రీడలకు మాత్రమే కాదు, 1912 నుంచి 1948 వరకు సాహితీ కళా
రంగాలలోని ప్రతిభ చూపిన వారికీ పతకాలను ఇచ్చేవారు. అవార్డులు, బిరుదుల వ్యవహారంలో సాహిత్యరంగాన్ని చూసుకుంటే, మన కేంద్ర ప్రభుత్వం 1954లో కేంద్ర సాహిత్య అకాడమీని ప్రారంభించింది. ఈ అకాడమీ 1955 నుంచి వివిధ భాషలకు చెందిన సాహితీవేత్తలకు అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలను ఏర్పాటు చేసుకుని, సాహితీవేత్తలకు అవార్డులు ఇస్తున్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు సంస్థలు ఇస్తున్న జ్ఞానపీఠ అవార్డు, సరస్వతీ సమ్మాన్ వంటివి సాహితీరంగంలో
అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా గుర్తింపు పొందాయి. ఢిల్లీ స్థాయిలోని కేంద్ర సాహిత్య అకాడమీ సరే, గల్లీ స్థాయిలో అవార్డులిచ్చే చిల్లర మల్లర సంస్థలు ఇప్పుడు ఊరూరా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం పైరవీలు సాగించే ఘరానా సాహితీ వేత్తలతో పాటు సాహితీరంగంలో చిల్లర సంస్థలు ఇచ్చే అవార్డులు పుచ్చుకుని, సంబర పడిపోయే అల్పజీవులూ ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో పసలేని రచనలకు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల పందేరం చేస్తోందని సాహితీరంగంలో విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన నిలిచిపోవడంతో అకాడమీ పనితీరుపై సాహితీరంగంలో రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయినా, అమెరికన్ రచయిత, చిత్రకారుడు క్రిస్ వాన్ ఆల్సబర్గ్ చెప్పినట్లు ‘అవార్డులు ఒక పుస్తకం పసను మార్చలేవు’. అవార్డులు అవార్డులే, సాహిత్యం సాహిత్యమే!


