
అందరికీ కావాలి ఆటపాటల బడి
అది బెర్క్‌షైర్ లోని విండ్సర్ పట్టణంలోని రాజ ప్రాసాదం. పేరు విండ్సర్ క్యాజిల్. పౌరపురస్కారాల కార్యక్రమం రాజరిక గౌరవాలతో సాగుతున్న రోజు. బ్రిటిష్ రాజవంశం పౌరులకు ప్రదానం చేసే అత్యున్నతమైన ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ (Commander of the British Empire) పురస్కారాలను బ్రిటన్ రాజు చార్లెస్ సోదరి ప్రిన్సెస్ యాన్నే ప్రదానం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో తెలుగు మహిళ ఉన్నారు. ఆమె పూర్ణిమా మూర్తి తణుకు. తెలుగు నేల అందుకున్న తొలి ‘కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారం.
ఆంధ్రప్రదేశ్, అమలాపురంలో పుట్టిన పూర్ణిమామూర్తి (purnima murthy)ఆంధ్ర విశ్వవిద్యాలయంలోపోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట ఆమె అత్తగారిల్లు. పెళ్లి తర్వాత భర్తతోపాటు ఇంగ్లండ్‌కు వెళ్లిన పూర్ణిమ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్‌లో సేవలందించారు. నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ (ఎన్‌డీఎన్‌ఏ) ద్వారా ఆమె స్కూలు వయసు రాని పిల్లలకు విద్యావిధానం మీద ఇరవై ఏళ్లకు పైగా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఎన్‌డీఎన్‌ఏకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ ‘‘బాల్యం అద్భుతమైనది. పాఠశాలకు వెళ్లడానికి ముందు నుంచే పిల్లలను పాఠ్యాంశాలకు తగినట్లు సిద్ధం చేయడం అనే ప్రక్రియ సున్నితంగా మొదలవ్వాలి. మెదడు వికాసంలో ఇది చాలా ప్రధానమైన విషయం. అందుకే నర్సరీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిల్లలకు ఇచ్చే ఆహారం, ఫిజికల్ ఎక్సర్‌సైజ్, కరికులమ్ రూ రూపొందించడంతోపాటు అవి యథాతథంగా అమలయ్యేటట్లు దృష్టి పెట్టాలి’’ అన్నారు. బ్రిటన్‌లో ప్రభుత్వం ప్రతి నర్సరీని సందర్శిస్తుంది. తల్లి వర్కింగ్ ఉమన్ అయితే తొమ్మిది నెలల నుంచి బిడ్డ బాధ్యతను నర్సరీ తీసుకుంటుంది. ఆ బిడ్డకు మూడున్నర– నాలుగేళ్లు నిండే వరకు అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవరకు నర్సరీనే సంరక్షిస్తుంది. పైగా నర్సరీలను చాలా వరకు ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తుంది. ప్రైవేట్ నర్సరీలకు బిడ్డకు ఇంత అని ఫండింగ్ ఇస్తుంది. పూర్ణిమామూర్తి పర్యావరణం, వాతావరణ మార్పుల వంటి ఇతర సామాజికాంశాల్లో పని చేస్తున్నప్పటికీ ఎర్లీ ఎడ్యుకేషన్ కోసం కీలకమైన సేవలందించారు. మనదేశంలో కూడా నర్సరీ విధానం ఉంది. కానీ అది సామాన్యులకు అందుబాటులో లేదు. నర్సరీ ఫీజులు కూడా వేలల్లో, లక్షల్లో ఉంటున్నాయి. దాంతో అవి సంపన్నులు, ఎగువ మధ్యతరగతికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ సెంటర్ లలో నాణ్యత ఉండడం లేదు. పిల్లలు ఆడుతూపాడుతూ, తోటి పిల్లలతో అనుబంధాలు అల్లుకుంటూ నేర్చుకోవాలి.
(తిన్న వెంటనే టీ తాగుతున్నారా? అయితే ఈ వివరాలు మీ కోసమే!)
పాఠాల కంటే ముందు అందమైన సమాజాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఆటపాటల బడి ప్రతి ఊరికీ కావాలి. ఖైదీలకు పాఠాలు జైల్లో శిక్షననుభవిస్తున్న ఖైదీలకు చదువు చెప్పడం, చెప్పించడంలో చేసిన సేవలు చాలా సంతృప్తినిచ్చాయి. వాళ్లలో ఎక్కువ మంది కరడు కట్టిన నేరగాళ్లే. జైలు జీవితం అంటేనే వారికి తగిన శిక్షణనిచ్చి సమాజంలో గౌరవంగా జీవించేటట్లు తయారు చేయడం కదా! నేర ప్రవృత్తి నుంచి వారిని దూరం చేయాలంటే చదువుకు దగ్గర చేయడమే చక్కటి మార్గం. ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు. కానీ ప్రభుత్వం ప్రత్యేక రక్షణనిచ్చి పని చేయడానికి తగిన వెసులుబాటు కల్పించేది. నా సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిని కావడం సంతోషంగా ఉంది.– పూర్ణిమామూర్తి తణుకు, విద్యాకార్యకర్త, బ్రిటిష్ ప్రభుత్వ పురస్కార గ్రహీత
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఇదీ చదవండి: జయాబచ్చన్ సెల్ఫీ వివాదం, ఘాటుగా స్పందించిన మరో నటి