ఏ.ఐ. (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటేనే పవర్. ఆ పవర్‌కు ఉమెన్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది? సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుంది. ఏ.ఐలో సరికొత్త కోణాలు ఆవిష్కారం అవుతాయి. ఇందుకు సాక్ష్యం... రిత్విక చౌదురి (అన్‌స్క్రిప్ట్), నిధి (నెమ ఏఐ), అశ్వినీ అశోకన్ (మ్యాడ్ స్ట్రీట్ డెన్), గీతా మంజునాథ్ (నిరామై హెల్త్ అనాలటిక్స్)....
కాలేజీ రోజుల నుంచే ఏఐ పరిశోధనల్లో ఇష్టంగా తలమునకలయ్యేది రిత్విక చౌదురి. ఐఐటీ–ఖరగ్‌పూర్ స్టూడెంట్ అయిన రిత్వికాకు ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేది కల. కాలేజీ రోజుల్లో ఏ.ఐ.కి సంబంధించి రిసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు వీడియో క్రియేషన్‌కు సంబంధించి ఇ–కామర్స్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను గ్రహించింది. ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, సెలబ్రిటీలతో హైక్వాలిటీ వీడియోలను క్రియేట్ చేయడం ఖరీదైన ప్రక్రియ. అలాగే బాగా సమయం తీసుకునే వ్యవహారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘అన్‌స్క్రిప్ట్’ అనే ఏఐ స్టార్టప్‌కు స్వీకారం చుట్టింది రిత్విక.
వ్యక్తిగతీకరించిన (పర్సనలైజ్డ్) సింథటిక్ వీడియోలను ఉపయోగించి తమ కస్టమర్‌లతో ఎంగేజ్ కావడానికి ఇ–కామర్స్ బ్రాండ్‌లకు ‘అన్‌స్క్రిప్ట్’ ఉపయోగపడుతుంది. బ్రాండ్స్‌కు డబ్బు, సమయం ఆదా అవుతుంది.
సెలబ్రిటీల నేతృత్వంలోని మార్కెటింగ్ వీడియోలను రూపొందించడానికి పేటెంట్‌తో కూడిన ఏఐ మోడల్స్‌ను నిర్మించింది అన్‌స్క్రిప్ట్ కంపెనీ ప్రారంభం నుంచి ఫండింగ్. ర్ట్‌నర్‌షిప్స్, టెక్, ప్రాడక్ట్స్... ఇలా రకరకాల విభాగాల బాధ్యతలను చూస్తోంది రిత్విక.
‘నేను ఆలోచిస్తున్నదే కరెక్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. మన నిర్ణయాలకు సంబంధించి ఇతరుల అభి్రయాలు తెలుసుకోవాలి. సరైన మార్గంలో నెట్‌వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా నా ప్రయాణంలో నా ఆలోచనలు, నిర్ణయాలకు సంబంధించి స్నేహితులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాను’ అంటుంది రిత్విక చౌదురి.
సాంకేతిక కళ!
చెన్నైలోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అశ్వినీ అశోకన్ డ్యాన్సర్ కావాలనుకునేది. అయితే ఆ కల ఫలించలేదు. విజువల్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసిన అశ్వినీకి సాంకేతిక ప్రపంచంలో కళ, సృజనాత్మక దారులను వెదుక్కునే అవకాశం వచ్చింది. కళతో సాంకేతికతను జోడీ కట్టించిన వినూత్న విధానం ఆమె భవిష్యత్ కెరీర్‌కు గట్టి పునాది వేసింది. అమెరికాలో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేసిన అశ్విని ప్రాడక్ట్ డిజైన్, ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన సాధించింది. దిగ్గజ సంస్థ ‘ఇంటెల్’ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అశ్విని కొత్తగా ఏదైనా చేయాలనుకొని ఇండియాకు వచ్చేసింది. ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ను లాంచ్ చేసింది. క్లయింట్స్‌కు ఆర్టిషియల్–డ్రివెన్ సొల్యూషన్స్ అందించే రిటైల్ ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్... మ్యాడ్ స్ట్రీట్ డెన్.
‘రాబోయే కాలమంతా ఏ.ఐ. దే. ప్రజలు ఏదో ఒక రకంగా ఏ.ఐ.తో టచ్‌లో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ.ఐ. ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలనే ఆలోచనతో మ్యాడ్ స్ట్రీట్ డెన్ ప్రారంభించాం’ అంటుంది అశ్విని.
కట్టింగ్–ఎడ్జ్ ఏఐ టెక్ ప్రాడక్ట్‌ల రూపకల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది మ్యాడ్ స్ట్రీట్ డెన్. వ్యూ.ఏఐ అనే వర్చువల్ ఏఐ–ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను తొలిసారిగా ప్రారంభించింది.‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’లో సగం మంది ఉద్యోగులు మహిళలే.
సామాజిక శ్రేయస్సుకోసం ఏ.ఐ.
సామాజిక శ్రేయస్సు కోసం కృత్రిమ మేధను ఉపయోగించుకోవాలనే లక్ష్యాన్ని తన స్టార్టప్ ‘నెమ ఏఐ’తో నెరవేర్చుకుంది నిధి. న్యూరోడైవర్జెంట్ (మెదడు పనితీరు ఇతరుల కంటే భిన్నంగా ఉండడం) గుర్తించడానికి, దాని గురించి అవగాహన కలిగించడానికి, మార్గనిర్దేశం చేయడానికి ‘నెమ ఏఐ’ సాంకేతికత తోడ్పడుతుంది.
‘నెమ ఏఐ’ ద్వారా న్యూరోడైవర్జెంట్ వెనుక ఉన్న శాస్త్రాన్ని లోతుగా పరిశోధించడంలోని ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చింది నిధి.
‘విద్యార్థుల మెదడు నమూనాలను అర్థం చేసుకోవడం, వారికి సమర్థవంతమైన అభ్యాస మార్గాలను అందించడంపై పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేక విద్య అవసరాలను తీర్చడంపై దృషి పెట్టాం. బోధనకు సంబంధించి మా ప్లాట్‌ఫామ్ ఉధ్యాయులకు ప్రత్యేక సూచనలు ఇస్తుంది. మాన్యువల్ వర్క్‌ను తగ్గిస్తుంది. వారు మరింత సమర్థంగా పనిచేసేలా ఉపకరిస్తుంది’ అంటుంది దిల్లీకి చెందిన నిధి.
గత సంవత్సరం ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టెలివిజన్ షోలో ల్గొంది. షార్క్స్(ఇన్వెస్టర్‌లు) నుంచి ఆమె స్టార్టప్‌కు మంచి స్పందన వచ్చింది. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్‌డీ), డిస్లెక్సియా, అటెన్షన్–డెఫిసిట్/హైపర్ యాక్టివ్ డిజార్డర్ లాంటి వైకల్యాల గురించి తన స్టార్టప్ ద్వారా అవగాహన పెంచాలనేది నిధి లక్ష్యం.
ఖర్చు తక్కువ...ఫలితం ఎక్కువ...
డీప్–టెక్ స్టార్టప్ ‘నిరామై హెల్త్ అనాలటిక్స్’తో విజయపథంలో దూసుకుపోతోంది బెంగళూరుకు చెందిన గీత మంజునాథ్. వైద్య సాంకేతిక రంగంలో ‘నిరామై’ ప్రత్యేక గుర్తింపు సాధించింది. బయటి మార్కెట్‌తో పోల్చితే సగం కంటే తక్కువ ఖర్చుతో క్సాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడే కొత్త క్యాన్సర్ స్క్రీనింగ్ సాఫ్ట్‌వేర్ థర్మాలిటిక్స్ రూపొందించింది.
‘మా ఫలితాలు మామోగ్రఫీ కంటే 25 శాతం ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి’ అంటుంది గీత. తమ క్లౌడ్‌బేస్డ్ టెక్నాలజీని ఇతర వ్యాధులను గుర్తించడంలో కూడా ఉపయోగించవచ్చు. కొన్నిరకాల క్యాన్సర్‌లను గుర్తించడానికి ట్రయల్స్ మొదలయ్యాయి. గతంలో కోవిడ్–19 స్క్రీనింగ్ అప్లికేషన్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. ఆసియాతో టు యూరప్ దేశాల్లో తమ ప్రాడక్ట్‌ను విక్రయించడానికి కంపెనీకి అనుమతి లభించింది


