ఆన్‌లైన్ షార్ట్స్, రీల్స్‌కు దాసోహమవుతున్న పిల్లలు
ఒకదాని వెంట మరొకటి.. గంటలకొద్దీ వీక్షణం
రకరకాల కంటెంట్లు.. భావోద్వేగ హెచ్చుతగ్గులు
నిద్ర, ఆరోగ్యం, చదువుపై తీవ్ర ప్రభావం
వెల్లడిస్తున్న అంతర్జాతీయ అధ్యయనాలు
సాక్షి, స్పెషల్ డెస్క్: షార్ట్స్, రీల్స్.. కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తున్న వీడియోల వీక్షణం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వ్యసనంలా దాపురించింది. మాట్లాడటాన్ని మినహాయిస్తే ఒకప్పుడు ఖాళీ సమయాల్లో కొద్దిసేపు వెలిగే మొబైల్ ‘తెర’.. ఇప్పుడు గంటలకొద్దీ కాంతిని వెదజల్లుతోంది. ఒకదాని వెంట మరొకటిగా ప్రత్యక్షమయ్యే వీడియోలను విడిచి పెట్టకుండా చూసేస్తున్నారు. అయితే పిల్లలు సైతం ఈ వ్యసనం బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర యాప్‌లలో అప్‌లోడ్ అవుతున్న ఈ తక్కువ నిడివి వీడియోలు చూడటం నిత్యకృత్యంగా మారింది.
డ్యాన్సులు, పాటలు, హాస్యం, నేరాలు, ప్రాంక్ (ప్రాక్టికల్ జోక్స్)..ఇలా అంశం ఏదైనా కోట్లాది షార్ట్ వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. వంటలు చేయడం, పర్యాటక ప్రదేశాలు, ప్రపంచ దేశాలను చుట్టేయడం..వీటన్నిటినీ అప్‌లోడ్ చేసేది కొందరైతే, అవన్నీ చూస్తూ మొబైల్ స్క్రీన్ ముందు ఎంత సమయం గడుపుతున్నదీ తెలియనంతగా జనం లీనమై పోతున్నారు. వీటిల్లో చాలా వీడియోలు పిల్లలకు పనికొచ్చేవి కాదు..వారిని ఉద్దేశించి చేసినవీ కాదు. అయినప్పటికీ కోట్లాది మంది పిల్లలు వీటికి అలవాటుపడ్డారు. భారీ వరదలా ముంచెత్తే కంటెంట్ ప్రవాహం వీరి నిద్రకు అంతరాయం కలిగిస్తోంది. అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చదువులపై ప్రభావం చూపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 40 వేల కోట్ల యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీక్షిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
నియంత్రణ కోల్పోయి..
సాధారణంగా 15–90 సెకన్ల వ్యవధితో ఉండే ఈ చిన్న వీడియోలు మెదడు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునేలా రూపొందాయి. స్వైప్ చేసిన ప్రతిసారీ కొత్త వీడియో దర్శనమిస్తుంది. ఇంకేముంది.. స్క్రీన్‌తోనే తెల్లవారుతోంది.. అదే స్క్రీన్‌తో నిద్రలోకి జారుకుంటున్నారు. లక్ష మంది పాలుపంచుకున్న 71 అధ్యయనాలను విశ్లేíÙస్తే.. పెద్ద ఎత్తున షార్ట్ వీడియోల వీక్షణంతో స్వీయ నియంత్రణ, పని, చదువుపై శ్రద్ధ తగ్గిందని తేలింది. ముఖ్యంగా నిద్రపై తీవ్ర ప్రభావం పడుతోంది.
నిద్రకు దూరం..
షార్ట్ వీడియోలు చూసే వారు సరిపడా నిద్రకు దూరమవుతున్నారు. చాలామంది పిల్లలు నిద్రకు ఉపక్రమించే ముందు మొబైల్స్‌లో విహరిస్తున్నారు. వేగవంతమైన కంటెంట్‌లో ఉండే భావోద్వేగ హెచ్చు తగ్గులు మెదడుకు ప్రశాంతత లేకుండా చేస్తాయి. నిద్రపోవడం కష్టమవుతుంది. మరో అధ్యయనం ప్రకారం అధికంగా షార్ట్ వీడియోల వీక్షణంతో కొంతమంది టీనేజర్లు పేలవమైన నిద్ర, బిడియం, ఆందోళనకు గురి అవుతున్నట్టు వెల్లడైంది.
హెచ్చరిక లేకుండానే ప్రత్యక్షం
స్వీయ నియంత్రణ విషయంలో చిన్నపిల్లల్లో తక్కువ పరిణతి ఉంటుంది. పైగా చాలావరకు సున్నిత మనసు్కలు. దీంతో త్వరితగతిన భావోద్వేగానికి గురవుతున్నారు. పిల్లలు ఎప్పుడూ చూడకూడని కంటెంట్ సైతం దర్శనమీయడం ప్రమాదానికి కారణం అవుతోంది. పిల్లల ప్రమేయం లేకుండానే వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోప్లే అవుతుంటాయి. హింసాత్మక, హానికరమైన చాలెంజ్‌లు, లైంగిక కంటెంట్ సైతం తెరపై ప్రత్యక్షమవుతుంటుంది. గంటల నిడివిగల వీడియోలు, సంప్రదాయ సోషల్ మీడియా పోస్ట్‌లకు భిన్నంగా షార్ట్ వీడియోలు ఎటువంటి హెచ్చరిక ప్రదర్శించవు. దీంతో భావోద్వేగ పరంగా సిద్ధం కావడానికి ఎలాంటి అవకాశమూ ఉండదు.
భావోద్వేగాలను ఎదుర్కోవడానికి..
కంటెంట్, సౌండ్‌లో ఆకస్మిక మార్పు, భావోద్వేగపరమైన హెచ్చుతగ్గులు అభివృద్ధి చెందుతున్న మెదడులకు ఇబ్బంది కలిగిస్తుంది. అందరు పిల్లలపై ప్రతికూల మానసిక ప్రభావం చూపనప్పటికీ.. ఆందోళన, శ్రద్ధ వహించడంలో ఇబ్బందులు, భావోద్వేగ అస్థిరత ఉన్నవారు మానసిక స్థితిలో మార్పులకు ఎక్కువగా గురవుతారు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) ఉన్నవారు ప్రధానంగా వేగవంతమైన కంటెంట్ వైపు ఆకర్షితులవుతారు. బెదిరింపులకు గురైన వారు, ఒత్తిడి, కుటుంబ అస్థిరత, పేలవమైన నిద్రతో బాధపడుతున్న పిల్లలు కష్టమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి రాత్రి సమయంలో షార్ట్ వీడియోలను చూస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
నైపుణ్యాలు బలహీనం..
సంబంధాల నిర్మాణం, విసుగును తట్టుకోవడం, అసౌకర్య భావాలను ఎదుర్కోవడం బాల్యంలో నేర్చుకుంటారు. అలాంటిది ఎక్కువగా శీఘ్ర వినోదానికి అలవాటు పడిపోయినప్పుడు.. పిల్లలు కలలు కనడం, ఆటలు, కుటుంబంతో ముచ్చటించడం లేదా వారి సొంత ఆలోచనల్లో విహరించడం వంటి అవకాశాలను కోల్పోతారు. బడి నుంచి ఇంటికి వచి్చన తర్వాత ఖాళీ సమయంలో లేత మనసులు తమను తాము ఉల్లాసపర్చుకోవడం, అంతర్గత దృష్టిని పెంపొందించు కోవడం వంటివి చేయాలి. అది కరువైతే నైపుణ్యాలు బలహీన పడతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
తల్లిదండ్రులు ఏం చేయాలి..
⇒ నిద్ర, ఆఫ్‌లైన్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలి.
⇒ ఆరు బయట క్రీడలు, పఠనం, అభిరుచులను ప్రోత్సహించాలి.
⇒ కంటెంట్, ఆన్‌లైన్ అనుభవాల గురించి పిల్లలతో చర్చించి అవగాహన కల్పించాలి.
⇒ డిజిటల్ ప్రయోజనాలు, స్క్రీన్ వీక్షణ ప్రభావాల గురించి వివరించాలి.


