విదేశీ విద్యకు పంపుతున్నమొత్తంలో క్షీణత
మూడేళ్లుగా రెమిటెన్సుల తిరోగమన బాట
భారత్‌లో ఉన్నత విద్యను అంతర్జాతీయీకరించాల్సిన ఆవశ్యకత ఉందని నీతి ఆయోగ్ ఇటీవల స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఐటీ నిపుణులు, వైద్యులు, ఇంజనీర్లు, విద్యావేత్తల వంటి నిపుణులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దగ్గరే ఉన్నత విద్యను అందించవచ్చు. జ్ఞానంతో నడుస్తున్న ప్రపంచంలో భారత్ నుంచి మేధావులు పరాయిగడ్డకు వెళ్లడం పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందన్నది నిపుణుల మాట. అయితే విదేశాలలో ఉన్న తమ బిడ్డల చదువుల కోసం భారత్ నుంచి కుటుంబాలు పంపిస్తున్న డబ్బుల వాటా తగ్గుతోంది.

వాటా పడిపోయింది..
మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న తమవారికి పంపిన మొత్తం రెమిటెన్సుల్లో విదేశీ విద్య వాటా 2014–15లో 20.90%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్‌లో ఇది 8.32 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సరళీకృత చెల్లింపుల పథకం కింద విదేశీ విద్యకు భారత్ నుంచి పలు దేశాలకు పంపిన మొత్తం 2014–15లో 0.28 బిలియన్ డాలర్ల నుంచి 2024–25 వచ్చేసరికి 2.92 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాస్తవానికి దేశ చరిత్రలో అత్యధికంగా 2021–22లో ఈ మొత్తం 5.17 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2025–26 ఏప్రిల్–అక్టోబర్‌లో 1.43 బిలియన్ డాలర్లు విదేశాలకు చేరింది.
ముందంజలో చైనా..
వివిధ దేశాలకు చెందిన ఉన్నత విద్యాసంస్థల నిలయంగా చైనా ముందంజలో ఉంది. ఆ దేశంలో ఏకంగా 45 విదేశీ ఉన్నత విద్యా సంస్థలు (ఎఫ్‌హెచ్‌ఈఐ) పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుతం 3 ఎఫ్‌హెచ్‌ఈఐలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరో 15 సంస్థలు మన దేశంలో సేవలు అందించేందుకు సూత్రప్రాయ ఆమోదం దక్కించుకున్నాయి.


