అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. తాలిబన్ల ప్రభుత్వం అక్కడ మహిళల హక్కులను, స్వేచ్ఛను హరించేలా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే వాళ్లు ఎలాంటి కల కనాలనే ఆశ కూడా మనసులోకి రానంత దారుణమైన పరిస్థితులు మధ్య అక్కడ మహిళలు జీవిస్తున్నారు. అలాంటి చోట నుంచి వచ్చిన ఓ చిన్నారి పెళ్లి కూతురు..తన దుస్థితిని మార్చుకోవాలని కంకణం కట్టుకుని మరి దేశం నుంచి పారిపోయింది.
దేశం కానీ దేశంలో.. చంకలో బిడ్డను పెట్టుకుని భాష రాక ఎన్నో అవస్థలు పడింది. అన్నింటిని ఓర్చుకుని తాను కోరుకున్న కలల జీవితాన్ని నిర్మించుకుని యావత్తు ప్రపంచ తనవైపు చూసేలా ఛాంపియన్‌గా అవతరించి..శెభాష్ అనిపించుకుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఆశే లేకుండా చేసినా..అందంగా జీవితాన్ని మలుచుకునే సత్తా ఉంటే..ఎదురే లేదని ప్రూవ్ చేసింది.
యూరప్ అంతటా పేరుగాంచిన బాడీబిల్డంగ్ ఛాంపియన్(bodybuilding champion)గా అవతరించిన అఫ్గానిస్తాన్‌కి చెందిన రోయా కరోమి(Roya Karimi) బాల్యం కడు దయనీయం. ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతికిందంటే..చదువు ఊసే లేకుండా పెరిగింది. ఒక నిశబ్ద వాతావరణం..తానెందుకు బతుకుతున్నా.. అనిపించే పరిస్థితుల మధ్య అమాయకంగా జీవనం సాగించింది. కనీస స్వేచ్ఛ కూడా లేని కఠిన పరిస్థితులను చూసి విసుగుపుట్టునా ఏం చేయలేని పసితనంతో అల్లాడింది.
టీనేజ్ వయసుకే పెళ్లి, పిల్లలు..
జస్ట్ 14 ఏళ్లకే పెళ్లి, 15 ఏళ్ల వయసుకు తల్లిగా మారిపోయింది. అలా 2011 నాటికి కనీస స్వేచ్ఛ, కలలు కనలేని ఈ సామాజిక ఆంక్షల మధ్య బతకడం తన వల్ల కాదంటూ..పరుగు లంకించింది. తన దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయేదాక ఆపలేదు. ఒక చేతిలో ఏవో గుర్తింపు కాగితాలు మరో చేతిలో బిడ్డతో ఆమె పెట్టిన పరుగు..మాటలకందని వేదనకు మించినది. ఎలా బతుకుతాననేది తెలియదు. ఒంటరిగా బయటకు అడుగుపెట్టలేని ఆ దేశంలో కంటే.. తన కంటూ ఓ గుర్తింపు, స్వేచ్ఛతో బతకాలనే ఆరాటంతో దేశ సరిహద్దులు దాటి నార్వేకు చేరుకుంది.
అక్కడ అధికారుల నుంచి ఎదురైనా ఎన్నో ప్రశ్నల నడుమ..శరణార్థుల శిబిరంలోకి చేరింది. చివరికి అక్కడే ఉండేలా అర్హత సంపాదించుకుని..తిరిగి తన జీవితాన్ని నిర్మించుకోవడాన్ని అహర్నిశలు కష్టపడింది. చేతికందిన ప్రతి పని చేసుకుంటూ జీవనం సాగించింది. అలాగే నార్వే భాషపై పట్టుసాధించి..తనకంటూ ఒక కుటుంబాన్ని నిర్మించుకుంది. సరిగ్గా మహమ్మారి సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టింది.
ఆ సమయంలోనే బాడీబిల్డింగ్ క్రీడ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ క్రమంలో కండరాలను బలోపేతం చేసుకుంటూ తన శరీరంపై పట్టు సాధించడం నేర్చుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకుని ఏ స్వేచ్ఛనైతే కోల్పోయిందో..అది ఈ బాడీబిల్డింగ్ శిక్షణ కోసం జిమ్‌లో గడుపుతున్నప్పుడూ.. ఆ స్వేచ్ఛని తిరిగి పొందిన అనుభూతి కలిగింది. దాన్ని ఆపకూడదనుకుంది. అలా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేలా పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందింది. అందుకు భర్త మద్దుతు కూడా లభించడంతో నర్సుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరి పూర్తి జీవితాన్ని ఆ క్రీడకు కేటాయించి వరుస పతకాలను కొల్లగొట్టింది.
ప్రతి పోటీలోనూ టైటిల్ ఆమెనే వరించేది. అలా 2025లో యూరోపియన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకుని యావత్తు ప్రపంచం తనవైపుకి తిరిగి చేసేలా చేసుకుంది. అంతేగాదు బార్సిలోనాలో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లలో ఆమెకు మరింత గౌరవం దక్కింది. ఒక అఫ్గాన్ బాలిక ఎన్నో సాంస్కృతిక, సామాజిక అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి చేరుకోవడం మాములు విషయం కాదంటూ అక్కడ స్థానిక మీడియాలన్నీ ఆమెను కీర్తించాయి.
దాంతో ఆమె పేరు వార్తల్లో నిలవడమే కాదు కరిమి ఎందరో అమ్మాయిలకు నువ్వు ఆదర్శం, ప్రేరణ అంటూ ప్రశంసించాయి కూడా. అఫ్గాన్ నిబంధనలకు విరుద్ధంగా పోటీలో అలాంటి దుస్తులు ధరించినందుకు కరోమికి ఎన్నో బెదిరిపులు వచ్చాయి..అయినా తగ్గేదేలా అంటూ ముందుకు సాగింది.
అంతేగాదు సంవత్సరాలుగా ప్రజలు నా గొంతును, శరీరాన్ని, భవిష్యత్తును నియంత్రించారు. ఇక చాలు..అలాంటి పరిస్థితి రానివ్వను అంటూ..తనకొచ్చే బెదిరింపులకు ఘాటుగా సమాధానమిచ్చింది. అంతేగాదు తీవ్రమైన ఆంక్షల మధ్య బతుకుతున్న అఫ్గాన్ మహిళల పాలిట సింహ స్వప్నంగా మారింది కరిమి. తనకు ఈ బాడీబిల్డింగ్ ఒక క్రీడ కాదని..తను బాల్యంలో కోల్పోయిన స్వేచ్ఛ అని భావోద్వేగంగా చెబుతోంది కరిమి.
(చదవండి: ఆ ఆటో డ్రైవర్ ఆంగ్ల భాష వాక్పటిమకి.. ఆస్ట్రేలియన్ డ్రైవర్ ఫిదా..!)


