రివైండ్: 2025
‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నాడు కవి. ‘పుణ్యం’ మాత్రమే కాదు ‘నైపుణ్యం’తోనూ ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన పురుషోత్తములు వీరు. బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చినప్రొఫెసర్ శంకర్‌లాల్, తమ ప్రతిభాపాటవాలతో దిగ్గజసంస్థలు యాపిల్‌లో సీవోవోగా, టెస్లాలో సీఎఫ్‌ఓగా సత్తా చాటుతున్న సబీఖాన్, వైభవ్ తనేజా వరకు...అంకితభావానికి, నైపుణ్యం జోడించిన స్ఫూర్తిదాయక పురుషోత్తముల గురించి...
అతడు అడవిని సృష్టించాడు!
‘అయ్యో!’ అని బాధకే పరిమితమై ఉంటే అతడు అడవిని సృష్టించి ఉండేవాడు కాదు. ఇండోర్‌కు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్‌లాల్ గార్గ్ స్థలంలో 2019లో జరిగిన అగ్నిప్రమాదంలో వెయ్యి వరకు చెట్లు బూడిదయ్యాయి. ఆ కన్నీళ్ల నుంచే శంకర్‌లాల్ ‘నేను అడవిని సృష్టించాలి’ అనే కల కన్నారు. ఆ కలను సాకారం చేసుకోవడానికి లేటు వయసులోనూ రాత్రనక పగలనక కష్టపడ్డారు. సంవత్సరాల అతడి శ్రమ ఫలించింది.
ఆ బంజరు భూమిలో ఇప్పుడు 40,000 చెట్లు కనిపిస్తున్నాయి. ‘‘ఆప్రాంతంలోని తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటికొరత వల్ల మొదటి దఫా దాదాపు వందమొక్కలు మాత్రమే నాటాను. రోజూ నేనే వాటికి నీరు పోసేవాడిని. కొన్నిరోజుల్లో ఆ మొక్కలు పెరగడం నాకు సంతోషాన్నిచ్చింది. క్రమంగా, మొక్కలు రాళ్లలో తమదైన స్థలాన్ని ఏర్పర్చుకున్నాయి. ఇది ప్రాథమిక ప్రకృతి ధర్మం’ అంటున్నారు 75 ఏళ్ల గార్గ్.
‘హోప్’ మొదలైంది...
‘శాస్త్రసాంకేతిక విషయాలు శాస్త్రవేత్తలకు మాత్రమే పరిమితం కాదు. సామాన్యులు కూడా వాటి గురించి లోతుగా తెలుసుకోవాలి, అంతరిక్ష పరిశోధనలు తమ జీవితాలకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకోవాలి’ అంటున్న నాసా మాజీ హార్డ్‌వేర్ ఇంజినీర్ సిద్దార్థ్ పాండే ప్రోటోప్లానెట్’ స్టేషన్‌కు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
తాజా విషయానికి వస్తే...పాండే బృందం లద్దాఖ్‌లోని పోకార్ లోయలో ప్రారంభ వెంచర్ హోప్ (హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్΄్లోరేషన్)కు శ్రీకారం చుట్టింది. దీనిని ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (హెచ్‌ఎస్‌ఎఫ్‌సీ)తో సంయుక్తంగా అభివృద్ధి చేశారు. వాతావరణ మార్పులు మానవ శరీరంపై కలిగించే ప్రభావం గురించి అధ్యయనం చేయడం ఈ మిషన్ ప్రాథమిక లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు,
ఇంజినీర్లు, వ్యోమగాములకు, విద్యార్థులకు కీలకమైన డేటాను అందించే పరిశోధన ఇది. ‘లద్దాఖ్‌లో స్టేషన్ నిర్వహించడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఏది నిర్మించినా అది స్థిరంగా ఉండేలా చూడాలనుకున్నాం. ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–ముంబై. ఐఎస్‌టీ–తిరువేండ్రం, యూనివర్శిటీ ఆఫ్ మల్టా, హోప్ నుంచి డేటా సేకరించడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అంటున్నారు పాండే.
కరెంట్ బిల్లు తగ్గించేలా...
విద్యుత్ వృథాను అరికడితే ‘కరెంట్ బిల్లు’ తేలిక అవుతుంది కదా! అని ఆలోచించారు బెంగళూరుకు చెందిన భరత్ రంక్వాత్. విద్యుత్ వృథాను అరికట్టే స్మార్ట్ ఎనర్జీ సిస్టమ్‌ను వృద్ధి చేశారు. ‘ఎనలాగ్’ అనే ఈ స్మార్ట్ అప్లికేషన్ విద్యుత్ వృథాను అరికట్టి బిల్లు భారాన్ని తగ్గించడం లో వినియోగదారులకు ఉపయోగపడుతోంది.
టెస్లా వైభవం... తనేజ
‘ఎవరీ వైభవ్ తనేజా?’ అనుకునేలా చేశారు వైభవ్ తనేజా. అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ‘టెస్లా’ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. చార్టర్డ్ ఎకౌంటెంట్ (సీఏ) అయిన వైభవ్ 2017లో టెస్లా ‘సోలార్‌సిటీ’లో చేరి ఫైనాన్స్‌కు సంబంధించి వివిధ హోదాల్లో పనిచేశారు. దిల్లీ యూనివర్శిటీలో బీ.కామ్, ఆ తరువాత సీఏ చేసిన వైభవ్ ‘సోలార్‌సిటీ’కి ముందు మల్టీనేషనల్‌ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్ ‘పీడబ్ల్యూసీ’లో పనిచేశారు. సీఎఫ్‌వోకి ముందు కార్పొరేట్ కంట్రోలర్, చీఫ్ ఎకౌంటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఏడాదికి రూ.1200 కోట్ల జీతం తీసుకుంటున్న వ్యక్తిగా సంచలనం సృష్టించారు. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్‌కు చెందిన ‘అమెరికన్ పార్టీ’లో ట్రెజరర్‌గా నియామకం అయ్యారు.‘వైభవ్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకు పోతారు. ప్రతిభ ఉంటే త్వరగా పై స్థాయికి వెళ్లవచ్చు అని చెప్పడానికి వైభవ్ నిలువెత్తు నిదర్శనం’ అంటారు ఆయనతో పనిచేసేన వారు.
సత్తా చాటే సైనికుడు...
దిగ్గజ సంస్థ ‘యాపిల్’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా ఈ సంవత్సరం ప్రపంచ దృష్టిని ఆకర్షించారు సబీఖాన్. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అయిదవ తరగతి వరకు చదువుకున్నాడు ఖాన్. ఆ తర్వాత వారి కుటుంబం సింగపుర్‌కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లింది. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేసిన ఖాన్ 1995లో యాపిల్‌లో చేరారు. 2019లో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) అయ్యారు.‘మాన్యుఫాక్చరింగ్‌కు సంబంధించి యాపిల్ విస్తరణలో ఖాన్ కృషి ఉంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా సంస్థను తీర్చిదిద్దారు’ అంటారు యాపిల్ సీఈవో టిక్ కుక్. యాపిల్‌లో ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ప్రతిభావంతులతో కలిసి పనిచేసిన ఖాన్‌కు ‘నమ్మకమైన సైనికుడి’గా పేరు.


