ఉపఖండ దేశాల్లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఇతర క్రీడకు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా అఫ్గనిస్తాన్‌లోనూ క్రికెట్, క్రికెటర్లకు క్రేజ్ ఎక్కువ. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు.
ముఖ్యంగా క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి దిగ్గజాలను నేరుగా కలవాలని పిచ్‌లోకి దూసుకువెళ్లి... ఇబ్బందులపాలైన వీరాభిమానులను ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఒక్కోసారి అభిమానం శ్రుతిమించితే సదరు ఆటగాళ్లకు కూడా కష్టమే.
లండన్‌లోనే కోహ్లి
అందుకే కోహ్లి తన పిల్లలు ఇద్దరినీ లండన్‌లోనే ఎక్కువగా పెంచుతున్నాడు. ఇంత వరకు వాళ్ల ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. సోషల్ మీడియాకు దూరంగా.. సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా సాధారణ పిల్లల మాదిరే వారిని పెంచుతున్నాడు. కోహ్లి సైతం లండన్ వీధుల్లో ఎలాంటి ఇబ్బంది, హంగూ ఆర్భాటాలు లేకుండా స్వేచ్చగా తిరగగలుగుతున్నాడు.
తన పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే అంటున్నాడు అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ (Rashid Khan). సొంత దేశంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలన్నా అతడికి భయమే. అయితే, కోహ్లి మాదిరి కేవలం క్రేజ్ కారణంగా మాత్రమే అతడికి ఈ పరిస్థితి తలెత్తలేదు. దేశంలోని అనిశ్చితులు ఇందుకు ప్రధాన కారణం.
నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో మాట్లాడుతూ రషీద్ ఖాన్ ఈ విషయం గురించి స్పందించాడు. అఫ్గనిస్తాన్ వీధుల్లో స్వేచ్ఛగా విహరించగలవా? అని పీటర్సన్ అడుగగా.. ‘‘లేదు. నేనసలు అఫ్గన్ వీధుల్లో నడవలేను. నా దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. అందులోనే బయటకు వెళ్తా’’ అని రషీద్ ఖాన్ బదులిచ్చాడు.
‘‘కాబూల్‌లో బుల్లెట్ ప్రూఫ్ కారా? ఎందుకు?’’ అని పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ‘‘భద్రతా కారణాల దృష్ట్యా నేను ఆ కారునే వాడతాను. ఉండకూడని సమయంలో.. ఉండకూడని చోట ఉంటే అంతే సంగతులు.
అయినా అఫ్గనిస్తాన్‌లో ఇవన్నీ సాధారణమే. దాదాపు ప్రతి ఆటగాడి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది’’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. తద్వారా తనకు కారు అనేది కేవలం విలాస వస్తువు కాదని.. వ్యక్తిగత భద్రత కోసం తప్పక వాడతానని స్పష్టం చేశాడు.
కాగా అఫ్గన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అనతికాలంలోనే ప్రపంచ స్థాయి స్పిన్నర్‌గా ఎదిగాడు రషీద్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ప్రస్తుతం తిరుగులేని బౌలర్‌గా సత్తా చాటుతున్నాడు. ఇక అఫ్గన్ తరఫున రషీద్ ఖాన్ 117 వన్డేలు, 108 టీ20లు, 6 టెస్టులు ఆడి.. 210, 182, 45 వికెట్లు కూల్చాడు.
చదవండి: ఆ ముగ్గురిని వాడుకోవాల్సింది: టీమిండియా సెలక్టర్లపై మాజీ క్రికెటర్ ఫైర్


