టీమిండియా సెలక్టర్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో పిచ్చి ప్రయోగాలతో ఆటగాళ్లను గందరగోళానికి గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం రెండు నుంచి మూడు నెలల కాలం వృథా చేశారంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తీరును తప్పుబట్టాడు.
గిల్‌పై వేటు
అసలు విషయమేమిటంటే.. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బీసీసీఐ ఇటీవలే తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. జితేశ్ శర్మను కూడా జట్టు నుంచి తప్పించింది.
గిల్, జితేశ్ స్థానాల్లో రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)లను మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. ఈ రెండు మార్పులు మినహా సౌతాఫ్రికాతో స్వదేశంలో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఆడిన జట్టునే వరల్డ్‌కప్ టోర్నీకీ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మొహమ్మద్ కైఫ్ స్పందిస్తూ.. గిల్ విషయంలో మేనేజ్‌మెంట్ చేసిన తప్పును ఎత్తి చూపాడు.
సెలక్టర్లు తప్పు చేశారు
‘‘మెరుగైన ఆటగాళ్లు ఎవరో వాళ్లకు (సెలక్టర్లకు) ముందుగానే తెలుసు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌కు ఎవరు సరిపోతారో వారికి ఓ అవగాహన ఉంది. గిల్ కంటే పొట్టి క్రికెట్‌లో బాగా ఆడే వాళ్లున్నారని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ సెలక్టర్లు తప్పు చేశారు.
వారి తప్పు వల్ల భారత క్రికెట్ వెనుకబడింది. గత రెండు- మూడు నెలలుగా గిల్‌కు బదులు వాళ్లు యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మలను ఎక్కువగా ఆడించాల్సింది’’ అని కైఫ్ పేర్కొన్నాడు.
కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నీతో గిల్ టీ20 జట్టులో పునరాగమనం చేయగా.. ఓపెనింగ్ జోడీగా ఉన్న అభిషేక్ శర్మ- సంజూ శాంసన్‌లను విడదీయాల్సి వచ్చింది. సంజూ స్థానంలో గిల్ ఓపెనర్‌గా వచ్చి వరుస మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
భవిష్య సారథినే తప్పించారు
ఈ క్రమంలో అనూహ్య రీతిలో గిల్‌పై వేటు వేసిన యాజమాన్యం.. ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను తిరిగి నియమించింది. కాగా టీమిండియా టెస్టు, వన్డే జట్లకు గిల్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీ20 జట్టుకు కూడా భవిష్య సారథిగా అతడే ఉంటాడని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. కానీ బ్యాటర్‌గా వరుస మ్యాచ్‌లలో విఫలమైన నేపథ్యంలో మేనేజ్‌మెంట్ అతడిని జట్టు నుంచే తప్పించడం గమనార్హం.
చదవండి: కెప్టెన్‌గా ఇషాన్ కిషన్


