భారత్‌తో మ్యాచ్‌ ఆడేందుకు 5 డిమాండ్లు చేసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు | PCB keeps 5 demands in front of ICC to revoke their stand of not play against india in T20 world cup 2026 | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై తొలగని అనిశ్చితి.. పీసీబీ డిమాండ్లకు నో చెప్పిన ఐసీసీ

Feb 9 2026 8:36 PM | Updated on Feb 9 2026 8:36 PM

PCB keeps 5 demands in front of ICC to revoke their stand of not play against india in T20 world cup 2026

టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరగాల్సిన భారత్‌-పాక్‌ గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌పై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ మ్యాచ్‌ జరగడానికి మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులకు సంబంధించి ఎలాంటి సానుకూల ప్రకటన వెలువడలేదు. తాజా పరిస్థితి చూస్తే, ఈ మ్యాచ్‌ దాదాపుగా రద్దైయ్యేట్లే కనిపిస్తుంది. ఇదే జరిగితే పాక్‌ క్రికెట్‌ బోర్డు భారీ పర్యావసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కొద్ది రోజుల కిందట పాక్‌ ప్రభుత్వం ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి పాక్‌ క్రికెట్‌ బోర్డుతో ఇవాళ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. భారత్‌తో మ్యాచ్‌ ఆడాలంటే పీసీబీ ఐసీసీ ముందు ఐదు గొంతెమ్మ కోర్కెలను ఉంచినట్లు తెలుస్తుంది. వీటిలో ఏ ఒక్క దానికి ఐసీసీ అంగీకరించలేదని సమాచారం.  

భారతీయ క్రీడా జర్నలిస్ట్‌ విక్రాంత్‌ గుప్తా సోషల్‌మీడియా పోస్ట్‌ ఆధారంగా.. పీసీబీ ఐసీసీ ముందు ఈ ఐదు డిమాండ్లు ఉంచినట్లు తెలుస్తుంది. 

- బంగ్లాదేశ్‌పై శిక్షలు విధించకూడదు 
- భారత్–పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ  
- టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాలి  
- భారత్‌-పాక్‌-బంగ్లాదేశ్‌తో ప్రత్యేక ట్రై-సిరీస్  
- అదనపు ఐసీసీ టోర్నమెంట్ కేటాయింపు  

అయితే, ఈ ఐదు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించిందని తెలుస్తుంది. ఈ ఐదు తమ పరిధిలోకి రావని ఐసీసీ తేల్చినట్లు సమాచారం. ఈ ఐదు కాకుండా పాక్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని ప్రత్యేక ఫండింగ్‌ కోసం కూడా డిమాండ్‌ చేసిందని తెలుస్తుంది. ఈ పాక్‌ డిమాండ్లు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి రావడంతో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. పాక్‌తో మ్యాచ్‌ అవసరం లేదని అంటున్నారు. పాక్‌పై ఐసీసీ శాశ్వత బహిష్కరణ విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాక్‌ తమతో మ్యాచ్‌ ఆడకపోతే తమకు కలిగే నష్టమేమీ లేదని అంటున్నారు.

కాగా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను ఐపీఎల్‌ నుంచి తొలగించిన తర్వాత బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. ఇది సాధ్యపడదని ఐసీసీ చెప్పడంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగింది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్‌కప్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ తతంగం జరుగుతుండగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు బంగ్లాదేశ్‌కు కొమ్ముకాస్తూ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించిన తర్వాత పాక్‌ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement