టీ20 ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఒమన్ ఆటగాడు ఆమిర్ కలీమ్ 44 ఏళ్ల 81 రోజుల వయసులో పొట్టి ప్రపంచకప్ మ్యాచ్ ఆడి, టోర్నీ చరిత్రలో అత్యధిక వయసు కలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒమన్ ఇవాళ (ఫిబ్రవరి 9) కొలంబో వేదికగా జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో కలీమ్ ఈ ఘనత సాధించాడు.
గతంలో ఈ రికార్డు హాంగ్‌కాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ పేరిట ఉండేది. క్యాంప్‌బెల్ 2016 ప్రపంచకప్‌లో 44 ఏళ్ల 30 రోజుల వయసులో బరిలోకి దిగాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో 40లు దాటిన వారు చాలామంది ఉన్నారు. ఒమన్‌కే చెందిన మొహమ్మద్ నదీమ్ 43 వయసులో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాల్గొంటున్నాడు. ఇటలీ కెప్టెన్ వేన్ మ్యాడ్‌సన్ 42, ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు వాన్‌డర్ మెర్వ్ 41 ఏళ్ల వయసులో ప్రస్తుత ప్రపంచకప్ బరిలో ఉన్నారు.
కలీమ్ విషయానికొస్తే.. ఇతను పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించి క్రికెట్ కెరీర్ కోసం ఒమన్‌కు వలస వెళ్లాడు. ఈ జట్టు తరఫున అతను 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 15 వన్డేలు, 54 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కలీమ్.. ఫిబ్రవరి 3న శ్రీలంక-ఏతో జరిగిన ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. ఆ మ్యాచ్‌లో అతను 47 బంతుల్లో 80 పరుగులు చేసి, తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ప్రస్తుతం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కలీమ్ (5) తేలిపోయాడు. అతనితో పాటు జట్టు మొత్తం విఫలం కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఒమన్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురే రెండంకెల స్కోర్లు చేశారు. సుఫ్యాన్ మెహమూద్ 25, వినాయక్ శుక్లా 28, నదీద్ ఖాన్ 20 పరుగులు చేయడంతో ఒమన్ అతికష్టం మీద 100 పరుగుల మార్కును తాకింది.
జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ (4-1-17-3), బ్లెస్సింగ్ ముజరబానీ (4-1-16-3), బ్రాడ్ ఈవాన్స్ (3.5-0-18-3), సికందర్ రజా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి ఒమన్ జట్టు విలవిలలాడింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే గెలుపు దిశగా సాగుతోంది. 7.3 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి, లక్ష్యానికి 75 పరుగుల దూరంలో మాత్రమే ఉంది.


