‘వాడికేం మగాడు’ అనేవారు గతంలో. ‘అయ్యో... మగాడు’ అనేలా ఉన్నాయి రోజులు అనుకుంటున్నారు పురుషులు. 2025 సంవత్సరం పురుషుడిని మరింత ఒంటరిని చేసిందని పరిణామాలు చెబుతున్నాయి. ‘అవతార పురుషుడు’, ‘ఆపద్బాంధవుడి’గా గతంలో చెప్పబడిన పురుషుడు నేడు సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడని నిపుణులు అంటున్నారు. 2025లో పురుషుడి స్థితిగతులపై ఓ నజర్.
మగాడి కోసం రెండు ప్రయివేటు బిల్లులు
2025 ముగిసి, 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ 365 రోజుల జీవితాన్ని మొత్తం తరచి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అని పురుషులని అడిగితే ‘అసలు తరచి చూసే అవకాశం, తీరిక మాకెక్కడిదీ’ అనేది పురుషుల మాట. హడావిడి, పని ఒత్తిడి, అనారోగ్యం, కుటుంబ బాధ్యతలు, సామాజిక వ్యవహారాలు, ఆర్థిక కష్టనష్టాలు... అన్నీ కలిపి నిమిషం తీరిక లేకుండా చేస్తే ఇక జీవితం ఎలా సాగుతోందో చూసి, అంచనా వేసే అవకాశం ఎలా ఉంటుంది? 2025లో పురుషుల సమస్యల మీద అనేకమంది వైద్య నిపుణులు, సామాజికవేత్తలు గొంతెత్తారు.
ఆధునిక జీవనంలో అబ్బాయిల పరిస్థితి అధ్వానంగా మారిందని, సమస్యలు బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక వారు అవస్థ పడుతున్నారని పేర్కొన్నారు. అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. రీల్స్‌లో ఒక జోక్... నలుగురు మగవారు ‘గోవాకు వెళదాం’ అని ΄్లాన్ చేస్తూ ఉంటారు. కలిసినప్పుడల్లా గోవా ΄్లానే. కాని సంవత్సరాలు గడిచిపోతాయిగానీ గోవాకు మాత్రం వాళ్లు వెళ్లరు. నిజానికి గోవాకు వెళ్లడం పెద్ద విషయం కాదు. తగినన్ని డబ్బులు అందరి దగ్గరా ఉంటున్నాయి. కాని కదల్లేని మెదల్లేని పరిస్థితులు నేడు పురుషుడి కనీస సరదాలను కూడా తీర్చడం లేదు.‘మగాళ్లు పైలాపచ్చీసు’గా తిరుగుతుంటారు అనేది పాతమాట. కనీసం రెండురోజుల లీవ్ దొరకని ఉద్యోగాల్లో వాళ్లు ఒళ్లు హూనం చేసుకుంటున్నారని ఎవరికి తెలుసు?
రైట్ టు డిస్ కనెక్ట్
బిల్‌మగవారు ఆఫీసులో ఉన్నంత సేపే డ్యూటీ చేసినట్టు కాదు.. ఇంటికొచ్చాక కూడా కాల్స్ అటెండ్ చేస్తూ ఆఫీస్ పని చేస్తూ అదనపు డ్యూటీ చేస్తూనే ఉంటారు. దీనివల్ల కుటుంబంలో కలతలు సర్వసాధారణం. మగవారికే కాదు పురుష/మహిళా ఉద్యోగులందరికీ పని గంటల తర్వాత ఆఫీసుతో డిస్‌కనెక్ట్ అయ్యే హక్కును ప్రతిపాదిస్తూ ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్’ను ప్రయివేటు బిల్లుగా 2025లో పార్లమెంట్ మెంబర్ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. అత్యవసర సేవల్లో ఉంటే తప్ప ప్రతి ఉద్యోగంలో ఇలా డిస్‌కనెక్ట్ అయ్యే సౌలభ్యం మగవారికి ఉంటే వారు మరింత క్వాలిటీ లైఫ్‌ను అనుభవించగలరు.
జాతీయ పురుషుల కమిషన్
పురుషుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించే చట్టబద్ధమైన సంస్థను రూ΄÷ందించడానికి ఈ ఏడాది తొలి ప్రయత్నం జరిగింది. డిసెంబర్ 6న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ‘జాతీయ పురుషుల కమిషన్ బిల్లు’ను ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టారు. పురుషులపై చట్టపరమైన వివక్ష, మానసిక ఆరోగ్య సమస్యలు, కుటుంబ చట్టాలలో పక్షపాతాలు, కొన్ని నేర నిబంధనల దుర్వినియోగాన్ని పరిశీలించడానికి సంస్థాగత యంత్రాంగం కావాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇలాంటి కమిషన్ ఉండాలని ‘భార్యా బాధితులు’ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. 2025లో కొన్ని భరణం కేసులు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయే విధంగా కోర్టు ముందుకు వచ్చాయి.
ఆయుష్షు తక్కువ
‘నూరేళ్లు వర్థిల్లు’ అనుకోవడమే గాని పురుషుడి ఆయుష్షును తగ్గించే విషయాల గురించి చింత ఉండటం లేదు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మహిళలతో పోలిస్తే పురుషుల ఆయుష్షు నాలుగు సంవత్సరాలు తక్కువ. ఈ గణాంకాల ప్రకారం దేశంలో సగటు ఆయుర్దాయం ఇప్పుడు 70.3 సంవత్సరాలు. యాభై ఏళ్ల క్రితంతో పోలిస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది. కేరళలో 75.1 సంవత్సరాలతో అత్యధికంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే, పురుషుల ఆయుర్దాయం జమ్మూ కాశ్మీర్‌లో 73.4 సంవత్సరాలు కాగా, మహిళలకు కేరళలో 78.4గా ఉంది. అత్యంత తక్కువ ఆయుర్దాయం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. అక్కడ పురుషులకు 62.4 సంవత్సరాలు కాగా, మహిళలకు 67.1 సంవత్సరాలు. పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా హృదయ సంబంధ వ్యాధులే కావడం గమనార్హం.
పాపం ఒక్కడు
అవును! ఇంటికి అతను ఒకే ఒక్కడు. ఉమ్మడి కుటుంబాలు పోయి దేశంలో చిన్న కుటుంబాల వ్యవస్థ మొదలైన తర్వాత భార్య, భర్త, ఇద్దరు పిల్లలు అనే సంస్కృతి పెరిగింది. ఈ నేపథ్యంలో మగవాడు భర్త బాధ్యతనంతా భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భార్య అతనికి సహకరిస్తున్నా పని ఒత్తిడి, బాధ్యతలు నిమిషం ఖాళీగా ఉంచడం లేదని నిపుణులు అంటున్నారు. పనులు పంచుకునేవారు లేక, కాసింత విశ్రాంతి దొరకక చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని అంటున్నారు. 2025లో పురుషుల మానసిక సమస్యల గురించి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు హెచ్చరికలు జారీ చేశారు.
కాలుష్యం అతడికే... జరిమానాలు అతడికే...
పురుషుడు పని చేయాలంటే కాలు బయట పెట్టాలి. బయట అడుగుపెడితే కాలుష్యం, దుమ్ము, ధూళీ, ట్రాఫిక్.... ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే మన దేశంలో అత్యధిక పురుషులు టూ వీలర్ల మీద తిరుగుతూ కాలుష్యం బారిన పడుతున్నారు. ఫలితంగా జుట్టు రాలిపోవడం వీరి సమస్య. చూపు మందగించడం, చర్మం ముడతలు పడిపోవడం వంటి సమస్యలకు లెక్కలేదు. వేళ కాని వేళల్లో ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు చిన్నవయసులోనే బీపీ, డయాబెటిస్ బారిన పడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు పురుషుల్లో సర్వ సాధారణం. ఇక వీరు ట్రాఫిక్ జరిమానాల బారిన పడుతూ అవి కట్టలేక చేసే ఆర్తనాదాలకు అంతు లేదు.
బెట్టింగ్ బర్‌బాదీ
బెట్టింగ్ యాప్స్ ఎరకు చిక్కుకున్న పురుషుల పెను విషాదాలు 2025లో అత్యధికం చోటు చేసుకున్నాయి. మద్యం, డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకున్నవారు కూడా సులభదారుల్లో డబ్బు వస్తుందని బెట్టింగ్ యాప్స్‌కు చిక్కుకుని ్రపాణాలు కోల్పోతున్నారు. వీరిలో యువకులు ఎక్కువ ఉంటే సైబర్ మోసగాళ్ల చేత చిక్కి వారు పెట్టమన్న చోట పెట్టుబడులు పెట్టి కోట్లు నష్టపోయిన వారిలో అనుభజ్ఞులైన ప్రొఫెషనల్స్ ఉన్నారు. జీవన తాత్త్వికత, జీవన సౌలభ్యాలు తెలుసుకోకుండా అసలు ఎటువంటి వివేచనాపూరిత ఆలోచనలు లేకుండా ఎక్కువ సంఖ్యలో పురుషులు ఉంటూ మూక స్వభావంతో జీవితాలను కష్టాల్లోకి నెట్టుకుంటున్నారు.
గడ్డం పురుష లక్షణం
ఎన్ని చెప్పుకున్నా ఇప్పటికీ ఇది పురుష ప్రపంచమే. పురుషులే ఆకర్షక శక్తులుగా నిలిచే ఆనవాయితీ పోలేదు. ఒకప్పుడు పురుషులు శుభ్రంగా గడ్డం గీసుకుని కనిపించేవారు. ఇప్పుడు గడ్డం కలిగి ఉండటం పురుష లక్షణంగా మారింది. 2025లో బారు గడ్డాల సౌందర్యంతో రణబీర్ కపూర్, రణధీర్ కపూర్‌తో మొదలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో సహా విరాట్ కోహ్లీతోపాటుగా హల్‌చల్ సృష్టించారు. ప్రస్తుతం ‘వారణాసి’ కోసం మహేష్ బాబు కూడా గడ్డం పెంచారు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌లో అత్యధికులు సెర్చ్ చేసిన వ్యక్తి స్త్రీ కాదు. అమెరికన్ గాయకుడు–గేయరచయిత డేవిడ్ ఆంటోనీ బర్క్ (ఈ4ఠిఛీ). మనదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల్లో మొదటి ఐదుగురిలో నలుగురు మగవారే కావడం విశేషం. వారిలో తొలిస్థానం యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కాగా, ఆ తర్వాతి స్థానాల్లో క్రికెటర్లు ప్రియాంశ్ ఆర్య, అభిషేక్ శర్మ, షేక్ రషీద్ ఉన్నారు.
ఎవరికీ చెప్పుకోలేక
‘మగవాడివి.. నువ్వు ఏడవకూడదు’ అని చిన్ననాటి నుంచి వినే మాటలు, ఇంటా బయటా నూరిపోసే పురుష అహం ఆ సమయానికి బాగున్నా వయసు పెరిగే కొద్ది పురుషులను సతమతం చేస్తున్నాయి. దీంతో ఎంత కష్టం వచ్చినా బయటకి చెప్పుకోలేక, ఇతరులతో పంచుకోలేక నలిగిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన అధ్యయనాల్లో అనేకమంది పురుషులు తమ తమ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, చిన్న చిన్నవి బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనో, ఎగతాళి చేస్తారనో లోలోపలే దాచుకొని కుమిలిపోతున్నారని తేలింది. ఉదాహరణకు ఇంట్లో అవమానకరమైన, సూటిపోటి మాటలు ఎదురవుతుంటే ఆ పురుషుల బాధ వర్ణనాతీతంగా ఉంది.
ఒక ఉద్యోగం చాలదు
ఒక ఉద్యోగానికే సమయం సరిపోకపోతే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఇంటి స్థలాలు– ఇళ్ల ధరలు, ఇళ్ల అద్దెలు మగవాణ్ణి మరో ఉపాధిని కూడా వెతుక్కునే అగత్యానికి నెడుతున్నాయి. ఏ.ఐ ప్రవేశం తర్వాత ఉద్యోగాలు పోతాయన్న హెచ్చరికలు వారిని అభధ్రతలో నెడుతున్నాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టక తప్పని పరిస్థితో ఈఎంఐలకు చిక్కుకోత తప్పని పరిస్థితో నెలకొంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని పురుషులు ఈ ఇబ్బందిని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. కొందరు ఉద్యోగంతోపాటు పార్ట్‌టైం ఉద్యోగాలూ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఊబర్, ఓలా సర్వీసుల్లో ఇలాంటి మగవారు ఎందరో కనిపిస్తున్నారు. రాత్రిళ్లు నిద్ర కాచి పని చేస్తున్నారు.
అనూహ్యమైన ఆమె
భార్యాభర్తల అనుబంధం భారతీయ సంస్కృతిలో ఎంతో ముఖ్యమైనది. దాని కోసం స్త్రీ, పురుషులిద్దరూ ఎన్నో త్యాగాలకు, సర్దుబాట్లకు సిద్ధమవుతూనే ఉంటారు. అయితే గతంలో గృహహింసలో మగవారి పాత్ర వార్తల్లోకి ఎక్కేది. ఇప్పుడు స్త్రీ హింస వార్తలుగా కనిపించడం మగవారికి బెంబేలు పుట్టిస్తోంది. భర్తల ్రపాణాలకు భార్య వల్ల ముప్పు ఏర్పడే పరిస్థితి రావడం 2025లో ఎక్కువ సంఘటనల వల్ల కనిపించిన సామాజిక విషాదం. ఇంత ప్రమాదం అరుదే అయినా భార్య నుంచి వేధింపులు, ఆమె కుటుంబసభ్యుల నుంచి బెదిరింపులు ఇటీవల పెరిగాయని పురుషులు చేస్తున్న ఆరోపణ. నకిలీ వేధింపులు కేసులు, వరకట్న కేసులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విడాకుల కోసమో, మరే కారణం చేతనో సూటిపోటి మాటలు అనడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల సంఖ్య పెరిగింది.


