అమ్మాయిల క్రికెట్‌లో ఇప్పుడు ఆమె అతి పెద్ద అద్భుతం...వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానం...ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అగ్రస్థానం... అంతర్జాతీయ టి20ల్లో రెండో స్థానం...అన్నింటికి మించి తొలిసారి భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర...రెండేళ్ల వ్యవధిలో కెప్టెన్‌గా సాధించిన రెండు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్స్ దీనికి అదనం. ఈ అన్ని ఘనతలూ సాధించిన ఒకే ఒక స్టార్ ప్లేయర్ ఎవరంటే నిస్సందేహంగా స్మృతి మంధాన పేరు చెప్పవచ్చు.
ఒకప్పుడు మహిళల క్రికెట్ మాత్రమే కాదు...మహిళా ప్లేయర్లు సౌందర్య సాధనాలకు తప్ప మరో ఉత్పత్తికి ప్రచారం చేస్తే చూసేవారెవరు, కొనేవారెవరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్మృతి మంధాన క్రెడిట్ కార్డులు కొనమని చెప్పినా.... ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమన్నా...ఇంజిన్ ఆయిల్ అమ్మినా, ఎనర్జీ డ్రింక్‌లు తాగమని చెప్పినా జనం వింటున్నారు. ఆట ప్లస్ అందం కలగలిసిన ప్రచారకర్తగా అమాంతం స్థాయిని పెంచుకున్న స్మృతి బ్రాండింగ్ హవా ఇప్పుడు నడుస్తోంది....
స్మృతి మంధాన బ్రాండింగ్ విలువ ఇప్పుడు భారీగా పెరిగినా... ఇది రాత్రికి రాత్రే జరిగేది కాదు. దశాబ్ద కాలానికి పైగా నిలకడైన ఆటతీరుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కృషి దీని వెనక ఉంది. వరుసగా పలు రికార్డులు సృష్టిస్తూ అంచెలంచెలుగా ఆమె పెద్ద స్థాయిని అందుకుంది. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన ఆమె కెరీర్ ఆరంభం నుంచే జోరుగా సాగింది.
జట్టులో జూనియర్‌గానే ఉన్నా...
ప్రదర్శనపరంగా అందరికంటే అగ్రభాగాన నిలుస్తూ తనదైన ముద్ర వేసింది. మిథాలీ రాజ్ తర్వాత భారత నంబర్‌వన్ బ్యాటర్‌గా ఆమె అన్ని ఘనతలు సాధిస్తూ వచ్చింది. ఈ పాపులారిటీ కారణంగానే మహారాష్ట్రలో తన సొంత పట్టణం సాంగ్లీలో ఎస్‌ఎం 18 పేరుతో స్మృతి ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయడం ఆమెలోని వ్యాపార కోణాన్ని చూపించింది.
అన్ని వర్గాలు మెచ్చేలా...
ఒక ప్లేయర్‌లో ప్రతిభను గుర్తించడంతో పాటు భవిష్యత్తులో వారు ఎంత పెద్ద స్థాయికి చేరవచ్చో అంచనా వేయడంలోనే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీల విజయం దాగి ఉంటుంది. స్మృతి మంధాన విషయంలో బేస్‌లైన్ వెంచర్స్ అనే మేనేజ్‌మెంట్ కంపెనీ చూసిన భవిష్యత్తు ఆమె బ్రాండింగ్ స్థాయిని అమాంతం ఆకాశానికి తీసుకెళ్లింది. ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఆమెకు బ్రాండింగ్ అవకాశాలు తెచ్చి పెట్టాయి.
‘హెల్త్, ఇన్సూరెన్స్, క్రీడా సామగ్రి, మొబైల్స్, ఫైనాన్స్... ఇలా ఒకటేమిటి... ఎన్నో భిన్న రంగాల్లో దాదాపు 15 రకాల ఉత్పత్తులకు స్మృతి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్‌లోనే కాకుండా మైదానం బయట కూడా ఆమె వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. అన్ని వర్గాలకు చేరువైనట్లుగా, అందరి మనిషి అనేలా అనిపించడమే స్మృతి బ్రాండింగ్ రహస్యం’ అని బేస్ లైన్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుహీన్ మిశ్రా తమ క్లయింట్ గురించి గర్వంగా చెబుతున్నాడు.
‘సరిగ్గా చెప్పిలంటే పురుషుల జట్టులో విరాట్ కోహ్లి స్థాయిని ఇప్పుడు ఆమె మహిళల క్రికెట్‌లో అనుభవిస్తోంది. అందుకే ప్రీమియం, లైఫ్ స్టయిల్ బ్రాండ్‌లు, ఎనర్జీ డ్రింక్ ప్రకటనలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి’ అని మరో మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రతినిధి రూపేశ్ కశ్యప్ వివరించాడు. సరిగ్గా చెప్పాలంటే ప్రచారకర్తగా ప్రస్తుత పురుషుల క్రికెటర్లు ఎంతో మందికంటే స్మృతి చాలా ముందుంది.
మెగా టోర్నీల్లో విజయంతో...
మూడు నెలల వ్యవధిలో స్మృతి వన్డే వరల్డ్ కప్ విజయం, ఉమెన్ ప్రీమియర్ లీగ్ విజయాల్లో భాగంగా ఉంది. ఇందులో డబ్ల్యూపీఎల్ టీమ్‌కు ఆమె కెప్టెన్ కూడా. పైగా ఫ్యాన్స్‌పరంగా చూస్తే అత్యంత ప్రజాదరణ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇవన్నీ కలిసి సహజంగానే స్మృతి బ్రాండింగ్ విలువను అమాంతం పెంచేశాయి. బ్రాండింగ్ వ్యవహారాలను చూస్తే సంస్థ క్రోల్ అంచనా ప్రకారం... గత ఏడాది కాలంలో ఆమె విలువ దాదాపు 50 శాతం పెరగడం విశేషం.
2023లో తొలి డబ్ల్యూపీఎల్ సమయంలో స్మృతి బ్రాండింగ్ విలువ సుమారు 12 మిలియన్ డాలర్లు కాగా, 2024లో అది 17 మిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు అది ఏకంగా 25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 226 కోట్లు) వరకు వెళ్లడం విశేషం. ఇప్పుడు ఒక్కో ప్రకటనకు ఆమె రూ. 2 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఆర్జనపరంగా భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (సుమారు రూ. 26 కోట్లు)తో పోలిస్తే స్మృతి (సుమారు రూ. 34 కోట్లు) చాలా ముందుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోయర్స్ సంఖ్య ఏకంగా 15 మిలియన్లకు చేరడం విశేషం.
ఒక్క ఏడాదిలోనే ఇది రెట్టింపైంది. ఆటపరంగా స్మృతి తన కెరీర్‌లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇంకా 30 ఏళ్లు కూడా నిండని ఆమె త్వరలో హర్మన్ తప్పుకుంటే భారత కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి బ్రాండింగ్ విషయంలో మరికొంత కాలం స్మృతి హవా కొనసాగడం ఖాయం.
ప్రస్తుతం స్మృతి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటి వరకు పని చేసిన కొన్ని సంస్థలు చూస్తే... నైకీ, ఎస్‌బీఐ, హ్యుందాయ్ మోటార్స్, హావెల్స్, పీఎన్‌బీ మెట్‌లైఫ్, రెడ్‌బుల్, గల్ఫ్ ఆయిల్, హెర్బలైఫ్, రాంగ్లర్ జీన్స్, మాస్టర్ కార్డ్, నీమ్ ఆయు షాంపూ, నేచురల్స్, గవి ఎడ్‌టెక్, మ్యాడ్ ర్యాబిట్ ఆడియో ప్రొడక్ట్స్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ప్లేయర్స్ పాట్ ఆన్‌లైన్ గేమ్, రెక్సోనా.
మొహమ్మద్ అబ్దుల్ హాది
(చదవండి: అద్భుతమైన హోమ్ టూర్..! జీవితాన్ని ఆస్వాదించటం అంటే ఇదే..!)


